నేడు నామినేషన్ వేయనున్న సుచరిత, తుమ్మల
ఖమ్మం : ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి సుచరిత శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నాం ఆమె నామినేషన్ వేస్తారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పాల్గొనున్నారు.
ఇదిలా ఉంటే టీఆర్ఎస్ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నేడు నామినేషన్ వేయనున్నారు. నేటి ఉదయం 11.00 గంటలకు ట్రంక్ రోడ్డులోని రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయానికి తుమ్మల ర్యాలీగా వెళ్లనున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వేయనున్న ఈ నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బేగ్‌తోపాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు.
2014లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపొందారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో పాలేరు ఉప ఎన్నికల అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ పార్టీ నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. కానీ... అవి సఫలం కాలేదు. కాగా టీఆర్ఎస్ను ఈ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరిన విషయం తెలిసిందే. హస్తం పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వర్గీయ రాంరెడ్డి వెంకట్ రెడ్డి భార్య రాంరెడ్డి సుచరితను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపింది.