వై-ఫైతో సెల్‌ఫోన్ చార్జింగ్!
మీకు అత్యవసరంగా మీ సెల్‌ఫోన్ నుంచి మరొకరికి మెసేజి పంపాల్సిన అవసరం వచ్చిందా? కానీ మీ సెల్ఫోన్లో ఛార్జింగ్ అస్సలు లేదా? సిగ్నల్స్ కూడా అంతంత మాత్రంగా ఉన్నాయా? ఇప్పుడెలా అని కంగారు పడుతున్నారా? మీ కంగారును దూరం చేసేందుకు త్వరలోనే సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రాబోతోంది. మీకు వై-ఫై సదుపాయం ఉంటే చాలు...దాంతో బ్యాటరీలు చార్జి చేసుకోవచ్చు. అసలు బ్యాటరీలే అవసరం లేకుండా సెల్ఫోన్లు, కెమేరాలను వినియోగించుకోవచ్చు.
దీని కోసం వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు ‘వై-ఫై బ్యాక్‌స్కాటర్’ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దాన్ని ఉపయోగించేందుకు ప్రత్యేకమైన రూటర్లను కూడా తయారుచేశారు. ఈ టెక్నాలజీ మన చుట్టూ ఉండే రేడియో తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చగలదు. బ్యాటరీలు లేని ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సందేశాలను పంపించగలదు. శ్యామ్ గొల్లకోట అనే ఇంజనీరింగ్ విద్యార్థి నాయకత్వంలోని ఓ బృందం ఇటీవల అమెరికాలోని ఆరు ఇళ్లలో ప్రత్యక్షంగా వై-ఫై బ్యాక్‌స్కాటర్ పనిచేసే విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రదర్శించి విజయం సాధించారు. ఓ పక్క వై-ఫై ద్వారా 24 గంటల పాటు నెట్‌ను ఉపయోగిస్తూనే మరోపక్క స్కాటర్ ద్వారా ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సమాచార మార్పిడిని పరీక్షించారు. ఈ ప్రయోగం వల్ల నెట్ బ్రౌజింగ్‌కు కూడా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదని బృందం తెలిపింది.
సూర్య కిరణాలను విద్యుత్ శక్తిగా మారుస్తున్నట్లుగానే ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా తాము రేడియో తరంగాలను విద్యుత్ శక్తిగా మార్చగలిగామని, అలాగే అవే తరంగాలను ఉపయోగించి విద్యుత్ అవసరం లేకుండానే ఎలక్ట్రానిక్ పరికరాల మధ్య సందేశాల మార్పిడి చేయగలిగామని వారు ఇటీవల ఇక్కడ జరిగిన ఎంటెక్ డిజిటల్ సదస్సులో వివరించారు. తాము ప్రయోగాత్మకంగా సృష్టించిన విద్యుత్ స్థాయిని ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ఇంకా ప్రయోగాలు నిర్వహిస్తామని, త్వరలోనే ఈ టెక్నాలజీని మార్కెట్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.