జంతు దాడుల పరిహారం రూ. 20 లక్షలకు పెంపుపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వన్యప్రాణుల దాడుల ఘటనల్లో మరణించిన వారికి ఇచ్చే నష్టపరిహారాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. శుక్రవారం కొండా సురేఖ అధ్యక్షతన అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ గవరి్నంగ్ బాడీస్ సమావేశం జరిగింది.ఈ భేటీలో సురేఖ మాట్లాడుతూ ఆమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ల పరిధిలోని గ్రామాల తరలింపు ప్రక్రియ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున వారిలో విశ్వాసాన్ని కల్పిస్తూ పునరావాస ప్రక్రియను చేపట్టాలని అధికారులకు సూచించారు. పునరావాసం కోసం తరలించిన కుటుంబాలకు శాశ్వత పట్టాలు అందించాలని, రాకపోకల నిమిత్తం గ్రీన్ పాసులు అందించాలని, స్కూల్ ఏర్పాటు చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు మంత్రిని కోరారు. సాధారణ అటవీ ఉత్పత్తులను సేకరించే స్థానికులపై మానవత్వం చూపాలని మంత్రి అధికారులకు సూచించారు. అక్కమహాదేవి గుహలు, సలేశ్వరం జాతరకు సౌకర్యాలు దోమలపెంట–శ్రీశైలం ఎకో టూరిజం సర్క్యూట్లో భాగంగా అక్కమహాదేవి గుహలను సందర్శించే భక్తులకు యాత్రా సౌకర్యాల కల్పనకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను మంత్రి సురేఖ ఆదేశించారు. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం జాతరను భవిష్యత్తులో చేపట్టనున్న సర్క్యూట్లలో చేర్చి ప్రభుత్వపరంగా యాత్రా సౌకర్యాలను కలి్పంచే దిశగా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఈ భేటీలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్. భూపతిరెడ్డి, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డోబ్రియాల్, పిసిసిఎఫ్ (వైల్డ్ లైఫ్) ఏలూసింగ్, డీసీసీఎఫ్ ఆంజనేయులు(హెడ్ ఆఫీస్), ఓఎస్డీ శంకరన్ పాల్గొన్నారు.