రెండు లక్షల ఇళ్లు మంజూరు చేస్తాం
అచ్యుతాపురం: నూతన గహనిర్మాణ పథకంలో రెండు లక్షల ఇళ్లు మంజూరుచేస్తామని గృహ నిర్మాణశాఖమంత్రి మృణాళిని అన్నారు. గురువారం ఆమె పూడిమడకలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ నిర్మించిన గహనిర్మాణ సముదాయాన్ని పరిశీలించారు. సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఏర్పాట్ల వివరాలను అధికారులనుంచి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
హుద్‌హుద్ బాధితులకు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో జిల్లాలో 10వేల ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో పనిచేశామని చెప్పారు. దాతల సహకారంతో పూడిమడక, కొమ్మాది తదితర ప్రాంతాల్లో 2వేల ఇళ్లు పూర్తిచేశామని వివరించారు. ఇన్ఫోసిస్ ఒక్కో కుటుంబానికి ఇల్లు నిర్మాణానికి రూ.5.5 లక్షలు వెచ్చించిందని చెప్పారు. పూడిమడకలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఇళ్లు నిర్మిస్తే, ప్రభుత్వం రోడ్లు, విద్యుత్, తాగునీటి వసతులు కల్పించిందని చెప్పారు.
నిర్మాణం పూర్తిచేసుకున్న 200 ఇళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 23న ప్రారంభిస్తారని మరో నాలుగు వందల ఇళ్లనిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. మూడు వందల చదరపు అడుగుల స్థలం ఉంటేనే ఇళ్లు మంజూరుచేయాలనే నిబంధనను సడలించామన్నారు. స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, ఎంపీపీ చేకూరి శ్రీనివాసరాజు, జెడ్పీటీసీ జనపరెడ్డి శ్రీనివాసరావు, గహనిర్మాణశాఖ పీడీ ప్రసాద్ పాల్గొన్నారు.