990 రూ.లకే ఎల్పీజీ స్టవ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేదలకు మరో బంపర్ ఆఫర్ ఇస్తోంది ఎన్డీయే సర్కార్. తనను తాను శ్రామిక్ నంబర్ వన్‌గా అభివర్ణించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దారిద్ర్య రేఖకు దిగువన వున్న గ్రామీణ మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే దిశగా, వారి సాధికారత కోసం మరో నిర్ణయం తీసుకుంది. ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందజేసే ప్రతిష్టాత్మక పథకంతో పాటు గ్యాస్ స్టవ్ ఖరీదును దాదాపు సగానికి తగ్గించి పేదలకు అందించనున్నట్టు తెలుస్తోంది. పేద కుటుంబాలపై భారాన్ని తగ్గించేందుకు వీలుగా రూ 990 రూ.లకే గ్యాస్ స్టవ్ ను అందించనున్నట్టు సమాచారం.
బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనక్షన్లు అందిస్తున్న పథకానికి కొనసాగింపుగా ఈ తగ్గింపు ఉంటుందని ప్రభుత్వ వర్గాల సమాచారం. వీటిని సమూహ సేకరణ ద్వారా (బల్క్ ప్రొక్యూర్మెంట్ ) అందించిననున్నట్టు ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి.
కాగా ఉత్తరప్రదేశ్‌లోని బాలియాలో మే 1న ఉజ్వల యోజన పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించిన ప్రధాని మోదీ వచ్చే మూడేండ్లలో దేశవ్యాప్తంగా దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్నవారిలో ఐదుకోట్ల మందికి ఉచితంగా వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఇందుకు రూ.8000 కోట్లు కేటాయించామనీ, ప్రతి ఎల్పీజీ కనెక్షన్‌కు పథకం కింద రూ.1600 ఆర్థికసాయం లభిస్తుందని ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే