చలిగింతలు..!
13 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
పగటివేళ చల్లగాలులు
పల్లెలను కమ్మేసిన మంచు తెరలు
తిరుపతి తుడా: ఎండలు మండే జిల్లా ఒక్కసారిగా ఊటీగా మారిపోయింది. ఎటుచూసినా మంచు తెరలు.. చల్లటి గాలులు. ఉదయం తొమ్మిది గంటలైనా సూర్యుడు కనిపించడం లేదు. మిట్టమధ్యాహ్నం కూడా చలి. రాత్రయితే చాలు, గడప దాటి బయట అడుగుపెట్టలేని పరిస్థితి. డిసెంబర్ లో ఇలాంటి పరిస్థితి జిల్లా వాసులకు కొత్త. ఉష్ణోగ్రతలు 13 డిగ్రీలకు పడిపోయాయి. గత శనివారం కుప్పం, పలమనేరు ప్రాంతాల్లో 13 డిగ్రీల గరిష్ట సెల్సియస్‌గా నమోదైంది. పడమటి మండలాల్లో చలితీవ్రత విపరీతంగా ఉంది. జిల్లాకు తూర్పు తీరం నుంచి చలిగాలులు పెద్ద ఎత్తున వీస్తున్నాయి.
దీంతో ప్రజలు చలికి అల్లాడిపోతున్నారు. ప్రజలు సూర్యకిరణాలను చూసి సుమారు వారం కావస్తోంది. సముద్ర తీరంలో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గంటకు 20-30 కి.మీ వేగంతో చలిగాలులు వీస్తున్నాయి. కుప్పం, మదనపల్లి, పలమనేరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 14 డిగ్రీలకు పడి పోయింది.
వారం నుంచి ఉష్ణోగ్రత వివరాలు
సోమవారం: తిరుపతి-17, కుప్పం - 14, మదనపల్లి-15 డిగ్రీల సెల్సియస్
మంగళవారం: తిరుపతి -22, కుప్పం, పలమనేరు-18, మదనపల్లి 17
బుధవారం: తిరుపతి -22, కుప్పం, పలమనేరు-18, మదనపల్లి 17
గురువారం: తిరుపతి -21, కుప్పం, మదనపల్లి-17
శుక్రవారం: తిరుపతి -15.5, కుప్పం, పలమనేరు -14, మదనపల్లి-14.5
శనివారం: తిరుపతి -14, కుప్పం, పలమనేరు-13, మదనపల్లి -14,
ఆదివారం: తిరుపతి 19, కుప్పం, పలమనేరు, మదనపల్లి -17.5 డిగ్రీల సెల్సియస్.