5 రోజులు.. 4.5 లక్షల ఎకరాల్లో నష్టం
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో గత ఐదు రోజుల్లోనే ఏకంగా 4.5 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగిందని వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. అంతేకాదు గత నెల రోజుల్లో రెండు సార్లు కురిసిన గాలివానలు, వడగళ్లతో మొత్తంగా 9.5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు గుర్తించింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా 3.5 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నదని అంచనా.
మామిడి, మొక్కజొన్న, నువ్వులు, పెసర, జొన్న, పొద్దు తిరుగుడు, బొప్పాయి, నిమ్మ, ఇతర పండ్ల తోటలు, కూరగాయల పంటలకూ భారీగానే నష్టం వాటిల్లింది. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పంట నష్టం వాటిల్లగా.. పలు జిల్లాల్లో ఐదు రోజులపాటు వరుసగా భారీ వర్షాలు కురవడం, వడగళ్ల కారణంగా ఎక్కువ నష్టం జరిగింది.
అత్యధికంగా జగిత్యాల జిల్లాలో పంట నష్టం జరిగిందని.. తర్వాత సూర్యాపేట, కరీంనగర్, జనగామ, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉందని వ్యవసాయశాఖ నిర్ధారించింది. గాలివానలు ఇలా కొనసాగితే ఇంకా నష్టం సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక పంట నష్టంపై వ్యవసాయ విస్తరణాధికారులు గ్రామాల్లో సర్వే చేస్తున్నారు.
రైతులకు అందని పరిహారం
గత నెల 17 నుంచి 22వ తేదీ వరకు కురిసిన వర్షాలతో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతు సంఘాలు అంచనా వేశాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం 2.28 లక్షల ఎకరాలుగా తేలి్చంది. అందులోనూ 1.51 లక్షల ఎకరాలకు నష్టపరిహారంగా రూ.151 కోట్లు కేటాయించింది. ఈ సొమ్ము ఇంకా రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది.
క్షేత్రస్థాయికి వెళ్లని ఉన్నతాధికారులు
రాష్ట్రంలో ఇంతగా పంట నష్టం జరిగినా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి పెద్ద విపత్తు సంభవిస్తే అన్ని జిల్లాలకు నోడల్ ఆఫీసర్లను నియమించాలి. వారి నేతృత్వంలో బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి జిల్లా స్థాయి అధికారులకు సూచనలు ఇవ్వాలి.
రైతుల వేదనను తెలుసుకోవాలి. కానీ వ్యవసాయ కమిషనర్ రఘునందన్‌రావు, ప్రత్యేక కమిషనర్ హనుమంతుతోపాటు అడిషనల్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు ఎవరూ జిల్లాలకు వెళ్ల లేదన్న విమర్శలు వస్తున్నాయి. కనీసం రైతులకు తగిన సలహాలు, సూచనలైనా ఇవ్వడం లేదని.. వానల తర్వాత పంటల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలతో అవగాహన కల్పించే ప్రయత్నమూ చేయడం లేదని వ్యవసాయ నిపుణులు మండిపడుతున్నారు.
కమిషనరేట్‌లో రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు ఎవరూ రైతులకు అందుబాటులో ఉండటం లేదని, మీడియా ద్వారా రైతులకు సమాచారం ఇవ్వడంలోనూ వైఫల్యం కనిపిస్తోందని, కనీసం ఫోన్లలోనూ అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వ్యవసాయశాఖకు కమిషనర్, కార్యదర్శి ఒకరే కావడంతో సమస్యలు వస్తున్నాయని.. కమిషనర్ వారానికోసారి వచ్చిపోతుండటంతో రైతులు, రైతు ప్రతినిధులు కలసి విజ్ఞప్తులు చేసే పరిస్థితి లేదని విమర్శలు ఉన్నాయి.