మరో వివాదంలో గేల్
ఆసీస్ మాజీలను తిట్టిపోసిన క్రికెటర్
మెల్బోర్న్: టీవీ వ్యాఖ్యాతపై శృంగారపరమైన వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన విండీస్ డాషింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లో తన ప్రవర్తనను తప్పుబట్టిన ఆస్ట్రేలియా ప్రస్తుత, మాజీ ఆటగాళ్లపై గేల్ తిట్ల వర్షం కురిపించాడు. బీబీఎల్‌లో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడిన తర్వాత ట్విట్టర్లో ఇయాన్ చాపెల్, పాంటింగ్, క్రిస్ రోజర్స్, ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఫ్లింటాఫ్లను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన పదజాలంతో ట్వీట్లు చేశాడు.
‘నేనంటే గిట్టని వారికి మరోసారి కృతజ్ఞతలు. మీరంతా తప్పు అని అంటున్న అంశంపై.... నా ముందు నవ్వుతూ కనిపించే ప్రస్తుత, మాజీ క్రికెటర్లు బహిరంగంగా ఏదైనా మాట్లాడొచ్చు. కానీ దానికి కట్టుబడి ఉండే దమ్ము, ధైర్యం మీకు లేదు. నేను కనిపించినప్పుడు గేల్.. నీకు ఇలా జరిగి ఉండాల్సింది కాదు అన్నారు. ఇక నుంచి నాకు ఏదీ చెప్పొద్దు. ఆస్ట్రేలియా అంటే నాకు చాలా ఇష్టం. మరోసారి ఇక్కడికి వస్తాను కూడా’ అంటూ ధ్వజమెత్తిన గేల్ కొన్ని అసభ్య పదాలను వాడి ట్వీట్స్ చేశాడు.