చిరునామా
ఆరోగ్యదాయకమైన చిరుధాన్యాలను 16 ఏళ్ల కిత్రం నుంచే సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడమే కాకుండా ప్రధాన ఆహారంగా తింటున్న విలక్షణ రైతు మౌలాలి. ఎడారీకరణ బారిన పడుతున్న అనంతపురం జిల్లా ముదిగుబ్బ పట్టణంలో రైతు కుటుంబంలో పుట్టారు. ఎమ్మే సోషియాలజీ చదివినప్పటికీ.. బతుకును పండించే చిరుధాన్య పంటల విశిష్టతను గుర్తెరిగారు. అరికలు, సామలు, ఊదలు, వరిగలు, కొర్రలు, అండు కొర్రల సాగులో ప్రయోగాలు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు.
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో సామాన్య శాస్త్రంలో ఎమ్మే చదివిన మౌలాలి(53) స్వచ్ఛంద సంస్థల్లో కొంతకాలం పనిచేసి.. చివరకు చిరుధాన్యాల సాగుపైనే మనసును కేంద్రీకరించారు. అరికలు, సామలు, ఊదలు, వరిగలు, కొర్రలు, అండు కొర్రలు వంటి చిరుధాన్యాలను తన ఆరెకరాల పొలంలో సాగు చేయడంతో పాటు.. పొడులు, బిస్కెట్లు, బన్ను, కేక్, మిక్చర్, మురుకులు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ పనుల వల్ల అదనపు ఆదాయం సమకూరుతున్నప్పటికీ.. ప్రకృతిలో మమేకమై వ్యవసాయం చేస్తున్నప్పుడు లభించే ఆనందం, ఆత్మసంతృప్తి మరెందులోనూ లేదంటారు మౌలాలి. ‘2002లో మొదటి పంటగాఎకరాకు 3 కిలోల కొర్రలు విత్తాను. ఆ ఏడాది విపరీతమైన కరువు, వర్షపు చుక్క లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎకరాకు 10 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. రూ. 12 వేల ఖర్చులు పోను రూ.12 వేల నికరాదాయం వచ్చింది. ఆదాయానికి తోడు, చిరుధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అవగతమయ్యే కొద్దీ.. వాటిని పండించడంపై మక్కువ అధికమవుతూ వచ్చింటారు మౌలాలి.
పర్యావరణహిత వ్యవసాయం
చిరుధాన్యాలు పండించే ముందు అనేక రాష్ట్రాల్లో పర్యటించి వివిధ వ్యవసాయ పద్ధతులను అధ్యయనం చేశారు. ‘అనేక ప్రాంతాలు పర్యటించి ఒక అవగాహన వచ్చినకు తరువాత, చిరుధాన్య పంటలు పండించాలని నిర్ణయించుకున్నాను. కుటుంబానికి చెందిన 6 ఎకరాల మెట్ట భూమిని సాగుకు అనువుగా మార్చడం మొదలు పెట్టాను. బరువైన యంత్రాలు ఉపయోగించి చేసే యాంత్రిక వ్యవసాయం కాకుండా పశువుల సాయంతో పర్యావహణహితంగా వ్యవసాయం చేసి భూమి పైభాగంలో ఉండే సూక్ష్మ జీవులకు హాని కలుగకుండా చూసుకున్నాను.
ఫలితం స్పష్టంగా కనిపించింది. భూసారం పెంచే రకరకాల క్రిములు, సూక్ష్మజీవులు వృద్ధి చెందాయి. కొన్ని సందర్భాల్లో కందిని అంతర్ పంటగా వేసి భూసారాన్ని పెంచుకున్నాను. జీవవైవిధ్యం పట్ల అవగాహనతో పర్యావరణహిత వ్యవసాయం చేస్తున్నప్పటికీ, కూలీల కొరత వల్ల ఈ పద్ధతులను పూర్తి స్థాయిలో పాటించలేకపోతున్నాను అన్నారాయన. ఈ ఏడాది జూలైలో అండుకొర్ర పంట వేశారు. అప్పటి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకూ వర్షం లేదు. అయినా పంట బాగానే ఉంది. కొన్నిరోజుల క్రితం కురిసిన కొద్దిపాటి వర్షానికే పంట పూర్తి స్థాయిలో పుంజుకుంది. ఇంత కరువు లోనూ 8–10 క్వింటాళ్ళ దిగుబడి వస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు.
కట్టెల బూడిద.. భూమికి బలిమి
తొలిసారిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నట్లయితే కట్టెలు కాల్చి, బూడిదను భూమిలో చల్లితే 15 సంవత్సరాల వరకూ భూమికి సరిపడే కర్బన అవసరాల పోషకాలు లభిస్తాయి. మల్లి జాతి కలుపు ప్రతి చిరుధాన్యపు పంటకు ప్రమాదకారి. పంట వేసిన 30 రోజుల్లోగా ఈ కలుపు కనిపిస్తే వెంటనే నివారించకపోతే పూర్తి పంటను నష్టపోవాల్సి వస్తుంది. ఈ కలుపు బారిన పడకుండా ఉండేందుకు ఎకరాకు అర కిలో వాము రాత్రంతా నానబెట్టి, ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక గంట పాటు గాలికి ఆరబెట్టి చిరుధాన్యాల విత్తనాలతో కలిపి భూమిలో చల్లాలి. చిరుధాన్యాలకు ప్రధానంగా రెండు రకాలైన పురుగులు ఆశిస్తాయి. వర్షాభావం వల్ల ఆకు పీల్చే రసం పురుగు పంటను ఆశిస్తుంది. వెన్ను ఏర్పడే సమయంలో సుడి దోమ ఆశిస్తుంది. 1 లీటరు వేప నూనెను 10 లీటర్ల నీటిలో కిరోసిన్‌తో కలిపి చల్లుకొని నివారించుకోవచ్చు.
అంగుళం నీటితో 4 ఎకరాల్లో పంట
రసాయనిక ఎరువులు అవసరం లేకుండా వీటిని పండించే వీలున్నందున రైతు పెట్టుబడి చాలా తక్కువని చెప్పారు. కేవలం వర్షాధారంగా లేదా తక్కువ నీటితో చిరుధాన్య పంటలు పండించవచ్చంటారు మౌలాలి. ఒక అంగుళం నీరున్న బోరు ద్వారా 4 ఎకరాల్లో పంట పడించవచ్చని తెలిపారు. పరిమితమైన నీటి వనరులున్న ప్రాంతాలకు చిరుధాన్య పంటలు ఎంతో అనుకూలమని చెప్పారు.
అంతర్ పంటగానూ..
పండ్ల తోటల్లో కూడా చిరుధాన్యాలను అంతర పంటగా వేసుకుని అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చని, ఈ పంటల అవశేషాల ద్వారా భూమికి కావలసిన పోషకాలు అందుతాయన్నారు. తద్వారా బహుళప్రయోజనాలు పొందవచ్చన్నారు. చిరుధాన్యాల విత్తనాలు రకాన్ని బట్టి గరిష్టంగా ఏడు సంవత్సరాలు నిల్వ ఉంటాయన్నారు.
పక్షులు, అడవిపందుల నుంచి రక్షణ
అలాగే ఈ పంటలకు ప్రధాన శత్రువైన పక్షుల బెడద తప్పించుకోవడానికి స్థానికంగా లభించే వస్తువులతో తానే స్వయంగా తక్కువ ఖర్చుతో గాలిమర తయారు చేసి, అది చేసే చప్పుడు వల్ల పక్షులను తరిమి పంటను కాపాడుకుంటున్నారు. ఈ గాలిమర ఉపయోగించడం వల్ల 20 నుంచి 30 అడుగుల దూరం వరకూ పక్షులు వాలవని, రాత్రి వేళల్లో పంటను ఆశించే అడవి పందులను కూడా వీటివల్ల దూరం ఉంచవచ్చు అంటారు మౌలాలి. ఎకరాకు 8 గాలిమరలు అమరిస్తే ఫలితం బాగా ఉంటుందని చెప్పారు.
ఆయుర్దాయాన్ని పెంచిన చిరుధాన్యాలు
మధుమేహం, పక్షవాతంతోపాటు ఇతర వ్యాధుల వల్ల మౌలాలి∙భార్య కొన్ని సంవత్సరాల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమె బతకడం కష్టమని చెప్పిన వైద్యులు డిశ్చార్జి చేశారు. ఇంటికి తీసుకువచ్చిన తరువాత.. చిరుధాన్యాలు ఆహారంగా ఇవ్వడం మొదలు పెట్టడంతో కొద్దిరోజుల్లోనే ఆమె కోలుకోవడంతోపాటు ఏడేళ్లు బతికారని మౌలాలి తెలిపారు.
‘అప్పటి నుంచి ఇంటిల్లిపాదీ ఆహారపు అలవాట్లు, జీవన శైలి మార్చుకుంటూ వచ్చాం. ప్రస్తుతం నేను వారానికి ఒకసారి మాత్రమే వరి అన్నం తింటాను. మిగిలిన రోజుల్లో చిరుధాన్యంతో చేసిన ఆహారం తీసుకుంటాను’ అన్నారు మౌలాలి. చిరుధాన్య పంటల్లో ఎర్ర నేలల్లో ఎకరాకు 8–10 క్వింటాళ్ళు, నల్ల రేగడి నేలల్లో 15–20 క్వింటాళ్ళ దిగుబడి తీయవచ్చని ఆయన అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో తాను చేసిన ప్రయోగాల ఫలితాలను రైతులు తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చి ప్రత్యక్షంగా చూడవచ్చని మౌలాలి(94905 62614) చెప్పారు.
– ప్రసన్న కుమార్, బెంగళూరు