విద్యుత్ హైటెన్షెన్ వైర్లు తాకి లారీ కాలిపోయిన ఘటన అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివారులోని 63వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఉరవకొండకు గాలిమరల టవర్స్ లోడ్‌తో వెళ్తున్న లారీ గుత్తి శివారుకు చేరుకోగానే రోడ్డు పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తగిలాయి.
దీంతో మంటలు ఎగిసిపడి లారీకి అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో లారీ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. డ్రైవర్ చిన్నదురైకు తీవ్రగాయాలయ్యాయి. అగ్నిప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. డ్రైవర్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.