తప్పని మద్యం కొరత?
28 నుంచి వచ్చే నెల 6 వరకు బేవరేజెస్‌కు సెలవు
సాక్షి, విజయవాడ : జిల్లాలో మరో మూడు రోజుల్లో మద్యం కొరత ఏర్పడనుంది. అంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో మద్యం బేవరేజేస్‌లో లెక్కలు చూడటానికి వీలుగా వారం రోజులు సెలవులు ప్రకటించారు. దీంతోపాటు వైన్‌షాపుల లెసైన్స్ కాలపరిమతి జూన్‌తో ముగియనుండటంతో జిల్లాలో మద్యం కొరత తలెత్తే అవకాశాలున్నాయి. దీంతో బేవరేజేస్ అధికారులు, ఎక్సైజ్ అధికారులు సమన్వయంతో కొరతను అధిగమించటానికి చర్యలు చేపట్టారు.
అయితే నిల్వలను పెంచారు కాని షాపుల వారీగా కోటాను నిర్ణయించకపోవడంతో కొరత అనివార్యంగా మారనుంది. ఎందుకంటే పెరిగిన మొత్తాన్ని సిండికేట్ వ్యాపారులే కొనుగోలు చేసే అవకాశం ఉండడం చిన్న వ్యాపారులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. జిల్లాలో 296 వైన్‌షాపులు, సుమారు 175 బార్లున్నాయి. వీటి ద్వారా నెలకు జిల్లాలో సుమారు 105 కోట్లరూపాయల మద్యం వ్యాపారం సాగుతుంది. ఇప్పటి వరకు వివిధ డిస్టిలరీస్ నుంచి వచ్చే మద్యంకు ఎక్సైజ్ స్టిక్టర్లతో బేవరేజ్‌ల ద్వారా విక్రయాలు జరిపేవారు.
అయితే ఇప్పుడు రాష్ట్ర విభజన జరగటంతో ఎక్సైజ్, బేవరేజ్‌లు అంధ్ర, తెలంగాణా రాష్ట్రాల వారీగా విభజన జరుగుతుంది. దీంతో జూన్ నుంచి రెండు రాష్ట్రాలకు సంబంధించిన స్టికర్లతో విక్రయాలు జరుగుతాయి. దీంతో ఈనెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు బేవరేజ్‌కు సెలవులు ప్రకటించారు. జిల్లాలోని 20 ఎక్సైజ్ సర్కిళ్లపరిధిలో ఉన్న వైన్‌షాపులు, బార్లకు గుడివాడ, విజయవాడలోని బేవరేజేస్ ద్వారా మద్యం విక్రయిస్తుంటారు.
మచిలీపట్నం డివిజన్ పరిధిలోని 9 సర్కిళ్లకు గుడివాడ నుంచి విజయవాడ డివిజన్లోని 11 సర్కిళ్లకు విజయవాడ బేవరేజ్ నుంచి నిల్వలు అందుతాయి. ప్రతి నెల జిల్లాలో సగటున 3 లక్షల కేసుల మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. అయితే పది రోజులు శెలవులు రావటంతో అధికంగా న్విల్ని బేవరేజ్ ద్వారా విక్రయాలు చేయటానికి కసరత్తు చేసి నిల్వలు పెంచారు.
జిల్లాలో నెలవారీ కోటా మూడు లక్షల కేసులతో పాటు అదనంగా మరో 70 వేల కేసులు మంజూరు చేయాలని ఎక్సైజ్ , బేవరేజ్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో జిల్లాలో మరో 70 వేల కేసులు మద్యం విక్రయాలకు అంగీకారం లభించింది. 24 వతేదీ లోపు డీడీ తీసిన వ్యాపారులకు మాత్రమే 27 వరకు నిల్వలు ఇస్తారు. దీంతో వ్యాపారులు పోటీపడి మరీ మద్యం నిల్వలు కొనుగోలు చేస్తున్నారు. మళ్లీ జూన్ 7 నుంచి యధావిధిగా కొత్త రాష్ట్రం స్టికర్లతో విక్రయాలు సాగుతాయి.