శోభమ్మకు విజయంతో ఘననివాళి
శో..భా..నా..గి..రె..డ్డి..
ఈ ఆరు అక్షరాలు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతవరకు ఎన్నడూ లేని సరికొత్త రికార్డును సృష్టించాయి. స్వతంత్ర భారతదేశంలో మరణానంతరం ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక మహిళగా శోభా నాగిరెడ్డి చరిత్రపుటల్లో నిలిచిపోయారు. తన చిరకాల ప్రత్యర్థి , తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంగుల ప్రభాకర్ రెడ్డిపై ఆమె 17,928 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గతంలో ఆమె సాధించిన మెజారిటీ కంటే ఇది వెయ్యి ఓట్లు ఎక్కువ. ఏప్రిల్ 23వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు వైఎస్ షర్మిలతో కలిసి ప్రచారంలో పాల్గొని, తిరిగి ఇంటికి వెళ్తూ.. రోడ్డు ప్రమాదానికి గురైన ఆమె, 24వ తేదీన చికిత్స పొందుతూ హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో మరణించిన విషయం తెలిసిందే.
గతంలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా మరణిస్తే వెంటనే ఎన్నికను వాయిదా వేసి, తర్వాత ఉప ఎన్నిక నిర్వహించేవారు. అయితే.. కొంతకాలం తర్వాత వేర్వేరు కారణాలతో ఆ సంప్రదాయాన్ని ఎన్నికల కమిషన్ మానుకుంది. దాంతో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఎన్నిక యథాతథంగా కొనసాగుతుందని ఈసీ ప్రకటించింది. అయితే, తొలుత శోభా నాగిరెడ్డికి ఓట్లు వేస్తే, అవి చెల్లకుండా పోతాయన్న ప్రచారం జరిగినా.. తర్వాత మాత్రం ఈసీ ఆ విషయంలో స్పష్టత ఇచ్చింది. ఎక్కువ ఓట్లు వస్తే ఆమెనే విజేతగా ప్రకటిస్తామని విస్పష్టంగా ప్రకటించింది.
కర్నూలు జిల్లా ప్రజల గుండెల్లో గూడుకట్టుకుని ఉన్న శోభా నాగిరెడ్డి.. బ్రహ్మాండమైన మెజారిటీతో విజయం సాధించారు. ఆళ్లగడ్డవాసులు తమ ఆడబిడ్డపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. చిన్నవయసులోనే చురుకైన నాయకురాలిగా గుర్తింపు పొందిన శోభా నాగిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అగ్రనేతగా ఎదిగారు. తనకు అక్కలేని లోటును శోభే తీర్చేవారని.. ఆమె తనకు దేవుడిచ్చిన అక్క అని స్వయంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కూడా అన్నారు. తండ్రి వారసురాలిగానో, భర్త చాటుగానో కాకుండా.. నేరుగా తనకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వంతో దీటైన నాయకురాలిగా ఎదిగిన శోభమ్మకు ఆళ్లగడ్డ నియోజకవర్గం ఓట్లనే పుష్పాలుగా మార్చి పుష్పాంజలి ఘటించింది. దీంతో స్వతంత్ర భారతదేశంలో మరణానంతరం ఎన్నికైన మొట్టమొదటి ఎమ్మెల్యేగా శోభా నాగిరెడ్డి చరిత్ర సృష్టించారు.