ఇక వైర్లెస్ పవర్!
న్యూయార్క్: వైర్లెస్ ఫోన్.. వైర్లెస్ ఇంటర్నెట్.. ఇప్పుడు ఇదే కోవలోకి వైర్లెస్ పవర్(తీగలు లేకుండా విద్యుత్) అందుబాటులోకి రానుంది. ఈ దిశగా అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. తక్కువ సామర్థ్యం కలిగిన మాగ్నటిక్ ఫీల్డ్స్‌ను ఉపయోగించడం ద్వారా ట్రాన్స్‌మీటర్, రిసీవర్ల మధ్య కొద్ది దూరం ఎటువంటి తీగలూ లేకుండా విద్యుత్‌ను డ్యూక్ వర్సిటీ ప్రొఫెసర్లు విజయవంతంగా ట్రాన్స్ఫర్ చేశారు. ఇందుకోసం ఓ సూపర్లెన్స్ను రూపొందించారు. ఈ సూపర్లెన్స్ మాగ్నటిక్ ఫీల్డ్‌లోని ఒక పవర్ కాయిల్ నుంచి మరో కాయిల్‌కు విద్యుత్‌ను బదిలీ చేస్తుందని సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్ ప్రచురించింది. ఎటువంటి తీగలూ లేకుండా సురక్షితంగా.. విజయవంతంగా విద్యుత్‌ను బదిలీ చేయడం ఇదే తొలిసారి అని వెల్లడించింది.
ఈ సూపర్లెన్స్ చూసేందుకు కొన్ని డజన్ల రూబిక్ క్యూబ్‌లను వరుసగా పేర్చినట్టుగా ఉంటుంది. వీటి లోపలి, వెలుపలి గోడలు రాగి తీగతో చుట్టి మైక్రోచిప్‌కు అనుసంధానం చేస్తారు. సూపర్లెన్స్కు ఒకవైపు పరిశోధకులు చిన్న కాపర్ కాయిల్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారానే విద్యుత్ సరఫరా అవుతుంది. కాయిల్స్ సైజ్‌ను పెంచడం ద్వారా విద్యుత్‌ను బదిలీ చేసే దూరాన్ని పెంచవచ్చని వర్సిటీ ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ యరోస్లావ్ ఉర్జుమోవ్ వివరించారు.