మహిళ, యువకుడు పేల్చేసుకున్నారు
ఢాకా: బంగ్లాదేశ్‌లో ఓ మహిళ, ఓ యువకుడు తమను తాము పేల్చుకున్నారు. తనిఖీకి వచ్చిన పోలీసు బలగాల నుంచి బయటపడేందుకు తమను తాము బాంబులతో ఆత్మాహుతికి పాల్పడ్డారు. వారిని ఉగ్రవాదులుగా పోలీసులు భావిస్తున్నారు. ఓ మూడంతస్తుల భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢాకాలోని కేఫ్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు భయంకరమైన నరమేధానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించిన ఉగ్రవాదుల కోసం పోలీసులు గత కొన్ని నెలలుగా తీవ్ర గాలింపులు చేస్తున్నారు.
అయితే, శనివారం ఓ మూడంతస్తుల భవనంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలతో దాచుకొని ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఆ భవనాన్ని చుట్టుముట్టి వారిని లొంగిపోవాలని ఆదేశించారు. అందులో నుంచి తొలుత ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు బయటకు వచ్చి పోలీసులకు లొంగిపోగా మరో మహిళ, ఓ యువకుడు మాత్రం తమను తాము ఆ భవంతిలో పేల్చుకున్నారు. ఈ ఘటలో ఓ చిన్న బాలికకు స్వల్పగాయాలు అయ్యాయి. లొంగిపోయినవారు ఉగ్రవాద సంస్థ నియో జమాతన్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(నియో-జేఎంబీ)కి చెందినవారని తెలుస్తోంది.