భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు: డీజీపీ
సాక్షి, హైదరాబాద్ : ‘భయపడకు తల్లీ.. నీ కొడుకు వచ్చేశాడు. నిన్ను క్షేమంగా ఆశ్రమానికి చేరుస్తాడు’అంటూ డీజీపీ మహేందర్రెడ్డి చేసిన ట్వీట్ పలువురి దృష్టిని ఆకర్షించింది. ఇంతకీ విషయం ఏంటంటే బేగంపేటలో ఓ వృద్ధురాలు ఒంటరిగా నడవలేని స్థితిలో నిస్సహాయంగా కనిపించింది. తన వివరాలేమీ చెప్పలేకపోతోంది. దీంతో స్థానికులు డయల్ 100కు సమాచారమిచ్చారు. వెంటనే అక్కడికి వచ్చిన పెట్రోకారు సిబ్బందిలో ఓ కానిస్టేబుల్ ఆ వృద్ధురాలిని కన్నతల్లిని ఎత్తుకున్న విధంగా రెండు చేతులతో మోస్తూ తీసుకెళ్లాడు. ఆమె వివరాలు ఆరా తీసి చివరికి ఇంటికి చేర్చారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ బేగంపేట పోలీసులను అభినందించారు. ప్రజలు ఎలాంటి ఆపదలో చిక్కుకున్నా కొడుకులా, సోదరుడిలా, తోబుట్టువులా, స్నేహితుడిలా పోలీసులు ఆపద్బాంధవుల్లా వస్తారని అభయమిచ్చారు.