పికాసో చిత్రానికి రూ. 1,154 కోట్లు
న్యూయార్క్ :కళాఖండాల అమ్మకంలో ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. ప్రఖ్యాత స్పానిష్ చిత్రకారుడు పాబ్లో పికాసో వేసిన ‘ఉమెన్ ఆఫ్ అల్జీర్స్(వెర్షన్ ఓ)’ చిత్రం రూ. 1,154 కోట్ల(17.9 కోట్ల డాలర్ల) రికార్డు ధర పలికింది. వేలంలో ఒక కళాఖండానికి అత్యధిక ధర పలకడం ఇదే తొలిసారి. స్విట్జర్లాండ్ శిల్పి జియకోమెతి చేసిన ‘పాయింటింగ్ మేన్’ అనే శిల్పం రూ. 909 కోట్ల(14.12 కోట్ల డాలర్లు)కు అమ్ముడుబోయింది. ఒక శిల్పానికి రికార్డు ధర పలకడం ఇదే తొలిసారి. క్రిస్టీస్ సంస్థ సోమవారం న్యూయార్క్లో వేసిన వేలంలో ఇవి అమ్ముడుబోయాయి. వీటిని కొన్నవారి పేర్లు బయటికి వెల్లడించలేదు.
వేలానికి ఉంచిన పలు కళాకతులు అమ్ముడుబోగా మొత్తం రూ. 4,500 కోట్లు వచ్చాయి. ఫ్రెంచి చిత్రకారుడు డెలక్రా వేసిన చిత్రం స్ఫూర్తితో పికాసో 1954-55 మధ్య ‘ఉమెన్ ఆఫ్ అల్జీర్స్’ పేరుతో 15 చిత్రాలు వేశారు. వీటిలో తాజాగా అమ్ముడైన చిత్రం ఒకటి. 2013లో రూ. 915 కోట్లు పలికిన బ్రిటన్ పెయింటర్ బేకన్ ‘త్రీ స్టడీస్ ఆఫ్ లూసియన్ ఫ్రాయిడ్’ చిత్రం రికార్డును ఇది బద్దలు కొట్టింది. జియకొమెతి శిల్పం గతంలో ఆయన పేరుతో ఉన్న రికార్డునే బద్దలు కొట్టడం విశేషం. 2013లో అతని ‘వాకింగ్ మేన్ 1’ శిల్పం రూ.610 కోట్లు పలికింది.