కండలు చూపిందని మహిళా బాడీ బిల్డర్‌ను..
మెలితిరిగిన కండలు కనబడేలా ఫొటోకు పోజిచ్చిన ఈమెను పోలీసులు అరెస్ట్‌చేశారు. కారణం.. ఆ ఫొటోలో ఆమె చేతులు, కాళ్లూ కనిపించడం! షరియత్ చట్టాలు కఠినంగా అమలయ్యే ఇరాన్లో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటన చర్చనీయాంశమైంది.
మహిళలు తమ శరీరభాగాలు కనిపించేలా దుస్తులు ధరించడం ఇరాన్లో నిషేధం. అతిక్రమించినవారికి కఠినశిక్షలు, భారీ జరిమానాలు విధిస్తారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర ఫొటోలు పోస్ట్చేసినందుకుగానూ ఈ బాడీ బిల్డర్‌కు కూడా స్థానిక అధికారులు 50వేల యూఎస్డాలర్ల జరిమానా విధించారు. అయితే ఆమె దగ్గర అంత డబ్బు లేకపోవడంతో ప్రతిగా జైలుశిక్షను అనుభవిస్తోంది.
'ఇటీవలే తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్చేసిన మహిళా బాడీ బిల్డర్‌ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు'అని వార్తలు ప్రసారం చేసిన ఇరానీ మీడియా.. సదరు మహిళ పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ మహిళా బిల్డర్ ఫొటోల నేపథ్యంలో ఇరాన్ పోలీసులు స్థానిక జిమ్‌లకు కఠిన ఆదేశాలు జారీచేశారు. మహిళల కోసం రహస్యంగా జిమ్ నిర్వహించడంలాంటివి చేస్తే శిక్షలకు గురవుతారని హెచ్చరించారు.