women concern
-
ఉల్లి కోసం మహిళల ఆందోళన
హిందూపురం అర్బన్ : కిలో రూ.20తో ఉల్లిగడ్డలు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ హిందూపురం మార్కెట్‌యార్డులో సోమవారం మహిళలు ఆందోళన చేశారు. ఉదయమే పట్టణంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు పంపిణీ కేంద్రానికి చేరుకున్నారు. ఉల్లిగడ్డలు అయిపోయాయని సిబ్బంది చెప్పడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే బైఠాయించారు. నామమాత్రంగా ఒకరోజు ఇచ్చి చేతులు దులుపుకుంటారా అంటూ నిలదీశారు. ఎంతమందికి పంపిణీ చేశారో రికార్డు చూపాలంటూ పట్టుబట్టారు. ఇందుకు యార్డు అధికారులు చెత్తబుట్టలో ఉన్న స్లిప్పులు చూపడంతో మరింత ఆగ్రహించారు. ఇష్టమొచ్చినట్లు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. కొందరు నాయకుల పేర్లు చెప్పుకుని 10, 20 కిలోలు తీసుకెళ్లారని ఆరోపించారు. ఉల్లి ఇచ్చేవరకు కదిలేది లేదని భీష్మించారు. దీంతో యార్డు సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. ఉదయం ఎనిమిది నుంచి వేచి ఉన్నామని, తమకు ఉల్లిగడ్డలు ఇప్పించాలని కోరారు. యార్డు కార్యదర్శి కర్ణాటకలో ఉల్లిధరలు తెలుసుకోవడానికి వెళ్లారని, వచ్చిన తర్వాత పంపిణీ చేస్తామని సిబ్బంది సర్దిచెప్పడంతో మహిళలు వెనుదిరిగారు. శని, ఆదివారం ఇచ్చాం -కేదర్నాథ్, యార్డు ఉద్యోగి రెండోవిడతగా వచ్చిన 200 బస్తాల ఉల్లిని శని,ఆదివారం పంపిణీ చేసేశాం. పంపిణీ రికార్డును అధికారులు అనంతపురం తీసుకుపోయారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆందోళన
కరప :ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ముగ్గురు ఆడపిల్ల లు పుట్టిన తర్వాత వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపిస్తూ ఒక మహిళ ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ కరప పోలీసుస్టేషన్ వద్ద బైఠాయించి నిరసన తెలిపింది. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆమె ఆరోపించింది. పెనుగుదు రు గ్రామానికి చెందిన రమణమ్మ అదే గ్రామానికి చెంది న తుమ్మలపల్లి వేణు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లయి 19 ఏళ్లయిందని, ఆ తర్వాత వేణు తన అక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని రమణమ్మ తెలిపిం ది. ఆపైన మళ్లీ తనను హైదరాబాద్ తీసుకెళ్లాడని, గతయేడాది గ్రామానికి తీసుకొచ్చాడని చెప్పింది. ఆపైన కొన్నాళ్లకు తమను వదిలి వెళ్లిపోయాడని వాపోయింది. దీనిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేసినా పట్టించుకోవడంలేదని రవణమ్మ తెలిపింది. ముగ్గురు ఆడపిల్లలతో ఎలా బతకాలో అర్థం కావడంలేదని రోదించింది. తన భర్త బంధువుల ఇంటివద్దే ఉండి, లేడని చెప్పిస్తున్నాడని బాధితురాలు ఆరోపించింది. తనకు న్యాయం జరిగేవరకు పోరాడతానని ఆమె తెలిపింది. ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశానని పేర్కొంది. కరప ఎస్సై బి.వినయ్ప్రతాప్ను వివరణ కోరగా మార్చిలో ఈకేసు నమోదుచేశా మని, వేణు బంధువులను పిలిపించి విచారించామని చెప్పారు. కేసు విచారణలో ఉందని, నిందితుడి కోసం గాలిస్తున్నామని చెప్పారు. -
కామాంధుని కఠినంగా శిక్షించాలి
అమలాపురం రూరల్ : అమలాపురంలో పసిమొగ్గలపై అఘాయిత్యానికి పాల్పడిన వృద్ధ కామాంధుడు రెడ్డి సూర్యానారాయణను కఠినంగా శిక్షించాలని మహిళలు డిమాండ్ చేశారు. సోమవారం పట్టణ పోలీస్‌స్టేషన్ ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ఆందోళనకు దిగారు. ఐద్వా జిల్లా కార్యదర్శి సిహెచ్.రమణి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థినులపై అఘాయిత్యం చేయడం అమానుషమని పేర్కొన్నారు. సూర్యనారాయణకు బెయిల్ కూడా మంజూరు చేయవద్దని, అతని తరఫున న్యాయవాదులెవరూ వాధించరాదని విజ్ఞప్తి చేశారు. ఆందోళనలో సీఐటీయూ నాయకులు మోర్త రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ నాయకులు కె.శంకర్, పి.వసంత్‌కుమార్, ఐద్వా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు టి.నాగవరలక్ష్మి, జి.పద్మ, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కె.వెంకటేశ్వరరావు, బొక్కా విజయలక్ష్మి, కె.సరస్వతి, కౌన్సిలర్ దంగేటి గౌరి, టి.సాయిసుజాత, సిహెచ్.సూర్యకళ పాల్గొన్నారు. అనంతరం వారంతా పట్టణ ఎస్సై జి.వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. లైంగికదాడుల్లో నిందితులపై కఠిన చర్యలు అమలాపురం టౌన్ : అమలాపురంలో వృద్ధ కామాంధుడి అకృత్యానికి బలై అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నలుగురు బాలికలను, వారి తల్లిదండ్రులను హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోమవారం పరామర్శించారు. బాలికల ఆరోగ్య పరిస్థితులపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణవేణి హోంమంత్రికి వివరించారు. ఈ కేసులో నిందితుడిపై నిర్భయ చట్టంతోసహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు రాజప్ప బాధితుల తల్లిదండ్రులకు వివరించారు. లైంగిక వేధింపుల కేసులలో త్వరగా విచారణ చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా దర్యాప్తు చేయాలని రాజప్ప డీఎస్పీ ఎల్.అంకయ్యను ఆదేశించారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు రాజప్పతో ఉన్నారు. -
మహిళలపై ‘స్త్రీనిధి’ వడ్డీ భారం
జగిత్యాల రూరల్ : మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి వడ్డీలు భారమయ్యాయి. గతంలో వడ్డీలేని రుణాల కింద స్త్రీశక్తి రుణాలు మంజూరు చేసిన ప్రభుత్వం వాటిపై వడ్డీ వసూలు చేస్తుండడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయమని ప్రకటించిన ప్రభుత్వమే వడ్డీ వసూలు చేస్తుండడంతో ఏం చేయాలో తోచక ఆందోళన చెందుతున్నారు. 2012, జూలైలో మహిళా సంఘాలకు స్త్రీనిధి కింద వడ్డీలేని రుణాలు ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో ఈ పథకం కింద 24,031 సంఘాల్లోని 9,612 మంది మహిళలు రూ.121 కోట్ల రుణాలు పొందారు. వీటిని వడ్డీ లేకుండా ప్రతి నెల చెల్లిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం స్త్రీనిధి రుణాలకు సైతం వడ్డీ చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడంతో మహిళలు జంకుతున్నారు. జిల్లా వ్యాప్తంగా స్వయం ఉపాధి కోసం రుణాలు తీసుకున్న 9,612 మంది స్త్రీశక్తి రుణాలకు వడ్డీ చెల్లిస్తూ వస్తున్నారు. వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అసలుతోపాటు వడ్డీ చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. స్త్రీనిధి కింద రుణాలు పొందిన సభ్యులు ప్రతి నెల సజావుగా చెల్లించాలని నిబంధన ఉండడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. అసలుతోపాటు వడ్డీ.. మహిళా సంఘాల సభ్యులకు స్త్రీనిధి కింద వడ్డీలేకుండా రుణం ఇచ్చారు. కొద్దిరోజులుగా వడ్డీలేకుండా ప్రతి నెల చెల్లిస్తూ వచ్చాం. ప్రస్తుతం రెండు నెలలుగా వడ్డీతోపాటు రుణాలు చెల్లించాలని చెబుతున్నారు. దీంతో నెలనెలా అసలుతోపాటు వడ్డీ చెల్లించుకుంటూ వస్తున్నాం. - తోట జమున, రుణగ్రహీత, పొరండ్లవడ్డీ చెల్లిస్తున్నారు గతంలో మహిళాసంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే స్త్రీనిధి రుణాలను వడ్డీలేకుండా ఇచ్చారు. ప్రస్తుతం ఆ రుణాలకు వడ్డీ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం వడ్డీలను తర్వాత వారి ఖాతాల్లో జమచేస్తామంటున్నారు. - రమాదేవి, ఐకేపీ ఏపీఎం, జగిత్యాల -
నారీ..... భేరి
సాక్షి నెట్వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం మహిళాలోకం గర్జించింది. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించబోమంటూ నినదించింది. సమైక్య ఉద్యమ కార్యాచరణలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సోమవారం సీమాంధ్ర జిల్లాల్లోని వాడవాడలా మహిళలు విభిన్న రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. సోమవారం అట్లతద్దె కావడంతో మహిళలు రోడ్డుపైనే ఆ వేడుకలు నిర్వహించారు. పలుచోట్ల భారీవర్షాలు కురిసినా పార్టీ కార్యకర్తలు లెక్కచేయక ఆందోళనలు కొనసాగించారు. తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలం ముక్తేశ్వరంలో మహిళా గర్జన కార్యక్రమంలో భాగంగా గంటసేపు రహదారులను దిగ్బంధం చేశారు. అల్లవరం మండలం కోడూరుపాడు నుంచి మహిళలు పేరూరు ఎత్తు రోడ్డు వద్ద 216 జాతీయ రహదారి వరకూ వర్షంలో తడుస్తూ ప్రదర్శన చేపట్టారు. అనంతరం జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్రప్రదేశ్ కావాలంటూ నినాదాలు చేశారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో సోనియా మాస్క్ ధరించిన మహిళను చెప్పులు చీపుర్లతో కొట్టుకుంటూ ఊరేగింపు నిర్వహించారు. కాకినాడ, కాట్రేనికోనలో మహిళలు అట్ల తద్దె సందర్భంగా రోడ్డుపైనే అట్లు వేసి నిరసన తెలిపారు. ఆలమూరులో జరిగిన మహిళా గర్జనలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి పాల్గొన్నారు. పిఠాపురంలో సమైక్యాంద్ర అట్లతద్దె నిర్వహించారు. పెద్దాపురం, ప్రతిపాడులో ప్రధాన రహదారిలో రోడ్డుపై అట్లు వేసి నిరసన తెలిపారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో వందలాదిమంది మహిళలు రాజానగరంలో జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. రోడ్డుపైనే సమైక్య గౌరీపూజలు సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సమైక్య గౌరీ పూజలు నిర్వహించి అట్లతద్దె వేడుకలు జరిపారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో గౌరీ దేవి పూజలు, తెలంగాణ ఆడపడుచులకు అట్లతద్దె వాయినాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. తణుకు, చింతలపూడిలో మహిళలు మానవహారం, ర్యాలీ నిర్వహించారు. భీమడోలులో జాతీయ రహదారిని దిగ్బంధించారు. శ్రీకాకుళంలో మానవహారం నిర్వహించిన మహిళలు, అనంతరం ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి సమైక్య శంఖారావం సభకు రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఆమదాలవలసలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పాతపట్నం, పాలకొండ, రాజాం, టెక్కలి, రణస్థలంలలో మానవహారాలు నిర్వహించారు. విశాఖలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలు ఆటాపాట నిర్వహించారు. గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలిలలో మహిళలు మానవహారాలు చేపట్టారు. భీమిలిలో వంటావార్పు చేపట్టారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో ఐదువేల మంది మహిళలతో పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. మైలవరం, నందిగామ,పెనమలూరుల్లో, పెడన, నూజివీడు, కైకలూరుల్లో మానవహారాలు చేపట్టారు. తిరువూరులో మహిళా పోరు పేరిట బహిరంగసభ నిర్వహించారు. విజయవాడ సింగ్‌నగర్‌లో పార్టీ మహిళా కార్యకర్తలు ఎమ్మెల్యే విష్ణు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా, పోలీసులు అరెస్టుచేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణా, గుం టూరు జిల్లాల పార్టీ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు మానవహారం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో మహిళల ర్యాలీలు, మానవహారాలు జరిగాయి. హైవే దిగ్బంధం కర్నూలు జిల్లా మంత్రాలయంలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించి రెండు గంటల పాటు రాయచూరు-కర్నూలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద గంటపాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో మహిళా గర్జన, ఉరవకొండలో మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ, రాయదుర్గంలో మహిళల ర్యాలీ, రాస్తారోకో జరిగాయి. వైఎస్సార్ జిల్లా కడపలో మహిళలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో మహిళల ర్యాలీని డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సతీమణి సుగుణమ్మ ప్రారంభించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో మహిళా గర్జన, కుప్పంలో మహిళా గర్జన, చిత్తూరులో పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ గాయత్రీదేవి ఆధ్వర్యంలో ధర్నా, బంగారుపాళ్యెంలో మహిళల ర్యాలీ, పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు, జరిగాయి. తిరుపతి తుడా సర్కిల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దుస్తులు ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. మదనపల్లె, కుప్పంలలో మహిళా గర్జనలు నిర్వహించారు.