నారీ..... భేరి
సాక్షి నెట్‌వర్క్: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం మహిళాలోకం గర్జించింది. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించబోమంటూ నినదించింది. సమైక్య ఉద్యమ కార్యాచరణలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సోమవారం సీమాంధ్ర జిల్లాల్లోని వాడవాడలా మహిళలు విభిన్న రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. సోమవారం అట్లతద్దె కావడంతో మహిళలు రోడ్డుపైనే ఆ వేడుకలు నిర్వహించారు. పలుచోట్ల భారీవర్షాలు కురిసినా పార్టీ కార్యకర్తలు లెక్కచేయక ఆందోళనలు కొనసాగించారు. తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలం ముక్తేశ్వరంలో మహిళా గర్జన కార్యక్రమంలో భాగంగా గంటసేపు రహదారులను దిగ్బంధం చేశారు. అల్లవరం మండలం కోడూరుపాడు నుంచి మహిళలు పేరూరు ఎత్తు రోడ్డు వద్ద 216 జాతీయ రహదారి వరకూ వర్షంలో తడుస్తూ ప్రదర్శన చేపట్టారు.
అనంతరం జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్రప్రదేశ్ కావాలంటూ నినాదాలు చేశారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో సోనియా మాస్క్ ధరించిన మహిళను చెప్పులు చీపుర్లతో కొట్టుకుంటూ ఊరేగింపు నిర్వహించారు. కాకినాడ, కాట్రేనికోనలో మహిళలు అట్ల తద్దె సందర్భంగా రోడ్డుపైనే అట్లు వేసి నిరసన తెలిపారు. ఆలమూరులో జరిగిన మహిళా గర్జనలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి పాల్గొన్నారు. పిఠాపురంలో సమైక్యాంద్ర అట్లతద్దె నిర్వహించారు. పెద్దాపురం, ప్రతిపాడులో ప్రధాన రహదారిలో రోడ్డుపై అట్లు వేసి నిరసన తెలిపారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో వందలాదిమంది మహిళలు రాజానగరంలో జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు.
రోడ్డుపైనే సమైక్య గౌరీపూజలు
సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సమైక్య గౌరీ పూజలు నిర్వహించి అట్లతద్దె వేడుకలు జరిపారు. తాజా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో గౌరీ దేవి పూజలు, తెలంగాణ ఆడపడుచులకు అట్లతద్దె వాయినాలు ఇవ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. తణుకు, చింతలపూడిలో మహిళలు మానవహారం, ర్యాలీ నిర్వహించారు. భీమడోలులో జాతీయ రహదారిని దిగ్బంధించారు.
శ్రీకాకుళంలో మానవహారం నిర్వహించిన మహిళలు, అనంతరం ఇంటింటికి వెళ్లి బొట్టుపెట్టి సమైక్య శంఖారావం సభకు రావాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఆమదాలవలసలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. పాతపట్నం, పాలకొండ, రాజాం, టెక్కలి, రణస్థలంలలో మానవహారాలు నిర్వహించారు. విశాఖలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహిళలు ఆటాపాట నిర్వహించారు. గాజువాక, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలిలలో మహిళలు మానవహారాలు చేపట్టారు. భీమిలిలో వంటావార్పు చేపట్టారు. విజయనగరం జిల్లా ఎస్.కోటలో ఐదువేల మంది మహిళలతో పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. మైలవరం, నందిగామ,పెనమలూరుల్లో, పెడన, నూజివీడు, కైకలూరుల్లో మానవహారాలు చేపట్టారు. తిరువూరులో మహిళా పోరు పేరిట బహిరంగసభ నిర్వహించారు. విజయవాడ సింగ్‌నగర్‌లో పార్టీ మహిళా కార్యకర్తలు ఎమ్మెల్యే విష్ణు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా, పోలీసులు అరెస్టుచేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో కృష్ణా, గుం టూరు జిల్లాల పార్టీ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహిళలు మానవహారం నిర్వహించారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాల్లో మహిళల ర్యాలీలు, మానవహారాలు జరిగాయి.
హైవే దిగ్బంధం
కర్నూలు జిల్లా మంత్రాలయంలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ర్యాలీ నిర్వహించి రెండు గంటల పాటు రాయచూరు-కర్నూలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలులో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. కల్లూరులోని చెన్నమ్మ సర్కిల్ వద్ద గంటపాటు జాతీయ రహదారిని దిగ్బంధించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో మహిళా గర్జన, ఉరవకొండలో మహిళా విభాగం ఆధ్వర్యంలో ర్యాలీ, రాయదుర్గంలో మహిళల ర్యాలీ, రాస్తారోకో జరిగాయి. వైఎస్సార్ జిల్లా కడపలో మహిళలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పులివెందులలో మహిళల ర్యాలీని డాక్టర్ ఈసీ గంగిరెడ్డి సతీమణి సుగుణమ్మ ప్రారంభించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో మహిళా గర్జన, కుప్పంలో మహిళా గర్జన, చిత్తూరులో పార్టీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్ గాయత్రీదేవి ఆధ్వర్యంలో ధర్నా, బంగారుపాళ్యెంలో మహిళల ర్యాలీ, పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు, జరిగాయి. తిరుపతి తుడా సర్కిల్‌లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి దుస్తులు ఇస్త్రీ చేసి నిరసన తెలిపారు. మదనపల్లె, కుప్పంలలో మహిళా గర్జనలు నిర్వహించారు.