Women Don
-
అరెస్టు చేయడానికి వెళ్తే బట్టలు చింపుకొని..
సాక్షి, న్యూఢిల్లీ : జీవితమంతా నేరాలు చేస్తూ బతికా. ఇంక ఈ బతుకు నాకొద్దు. ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా.. అంటోంది మామ అలియాస్ బసిరన్(62) అనే నేర సామ్రాజ్ఞి. దేశ రాజధాని ఢిల్లీలో తన ఎనిమిది మంది కొడుకులతో పలు నేరాలకు పాల్పడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై 89కేసులు నమోదు చేసి జైలుకు పంపించారు. వివారల్లోకి వెళ్తే రాజస్థాన్‌కు చెందిన బసిరన్ అనే మహిళ తన ఎనిమిది మంది కొడుకులు, నలుగురు కుమార్తెలతో 2000లో ఢిల్లీకి వలస వచ్చింది. మొదట్లో దొంగసారా విక్రయించడం మొదలు పెట్టింది. క్రమేణా నాలుగు లిక్కర్ దుకాణాలను తెరిచింది. వ్యాపారం పెరిగే కొద్దీ కొడుకులు చదువులు మానేసి తల్లి పనుల్లో భాగస్వాములయ్యారు. నేరాలకు పాల్పడ్డటం మొదలు పెట్టారు. అడ్డూ అదుపు లేకుండా నేరాలకు పాల్పడేవారు. పోలీసులకు లంచాలు ఇస్తూ నేరగాళ్లు, దొంగలకు ఆశ్రయం ఇవ్వడం అలవాటు చేసుకున్నారు. వీరి ముఠా ఎంతగా తెగించిందంటే ఎవరైనా పోలీసులు అరెస్టు చేయడానికి వెళ్తే బట్టలు చింపుకొని, కేకలు పెడుతూ వేధిస్తున్నారంటూ నానా హంగామా సృష్టించేది. దీంతో పోలీసులు ఏమీ చేయలేక వెనుదిరిగి వచ్చేవారు. అప్పుడప్పుడు పట్టుపడినా నిమిశాల్లోనే బయటకు వచ్చేవారు. ఇప్పటి వరకూ వీరిపై దాదాపు 100కు పైగా కేసులు నమోదైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ఎట్టకేలకు ఈ ముఠాకు చెక్‌పెట్టాలని పోలీసులు భావించారు. గత ఫిబ్రవరిలో సంగం విహార్‌లోని మామ మూడంతస్తుల సొంతింటిపై పోలీసులు మూకుమ్మడి దాడి చేశారు. బసిరన్‌తోపాటు ఎనిమిది మంది కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఈమొత్తం తతంగాన్ని వీడియోకూడా తీయించారు. దీంతో వారి నాటకాలకు తెరపడింది. నిందితులను కోర్టులో హాజరు పరచగా వారి నేరాలకు తగ్గట్టుగా కోర్టు శిక్షలు విధించింది. కొడుకుల్లో ఏడుగురు జైలు శిక్ష అనుభవిస్తుండగా మైనర్ కుమారుడిని జువైనల్ హోంకు తరలించారు. ఇంత జరుగుతున్నా బసిరన్ భర్త మల్కన్‌సింగ్ మాత్రం గొర్రెలు కాసుకుంటూ ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాడు. భార్య నేరాలకు అతడు మౌనసాక్షిగా మిగిలాడు. అంతేకాదు, ఈ దంపతుల నలుగురు కుమార్తెలపై కూడా ఎటువంటి కేసులు లేవు. వారిలో ఇద్దరికి పెళ్లిళ్లు కూడా అయ్యాయి.శిక్ష అనంతరం బయటకు వచ్చిన మామ(బసిరన్) నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని భావిస్తోంది. ఇందుకోసం ఢిల్లీలోని రూ.50లక్షల విలువ చేసే ఇంటిని అమ్మేసి ఫరిదాబాద్‌లో ప్రశాంత జీవనం గడపాలని భావిస్తోంది. -
‘ఎర్ర’ వనంలోకి మహిళా డాన్లు
⇒రూ.కోట్లు కూడబెడుతున్న వైనం ⇒నిన్న సంగీత.. నేడు జ్యోతి ⇒ నివ్వెరపోతున్న పోలీసులు చిత్తూరు (అర్బన్): ఇప్పటి వరకు మగవాళ్లు మాత్ర మే చేస్తున్న ఎర్ర చందనం స్మగ్లింగ్‌లోకి తాజాగా మహిళలు కూడా చేరారు. గతేడాది రంగుల లోకం సుందరి సంగీత చటర్జీని అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా జ్యోతి అనే మహిళా డాన్‌ను అరెస్టు చేశారు. వెలగని జ్యోతి... తమిళనాడులోని వేలూరు నగరం అళగిరినగర్‌కు చెంది న ఎన్.జ్యోతి, ఆమె భర్త, ఇద్దరు కొడుకుల్ని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రచందనం అక్రమ వ్యాపా రంలో జ్యోతి ప్రస్తావన తెలుసుకున్న పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి నాలుగో తరగతితోనే విద్యాభ్యాసాన్ని ముగించింది. భర్త నాగేంద్రన్ లారీ డ్రైవర్ కావడంతో ఇసుక లోడ్లు తీసుకెళుతూ ఎర్ర చం దనం స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకున్నాడు. ఈ విష యం జ్యోతికి చెప్పడంతో అవకాశాన్ని వదులుకోవద్దని భర్తకు చెప్పి తానూ 2013 నుంచి స్మగ్లింగ్‌లోకి అడుగుపెట్టింది. అనతికాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు చెందిన బడా స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుంది. వీరప్పన్ కంచుకోటైన జవ్వాదిమలై గ్రామం నుంచి చెట్లను నరికే కూలీలను పిలిపించి శేషాచలం అడవుల్లోకి పంపి ఎర్రచందనం దుంగలు తరలించడమే పనిగా పెట్టుకుంది. ఇలా మూడేళ్ల కాలంలో జిల్లా నుంచి వంద టన్నుల ఎర్రచందనం దుంగల్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసి రూ.10 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆమెపై జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జ్యోతి అరెస్టు కావడంతో ఆమె వెనుక ఉన్న బడా స్మగ్లర్లు రామ్‌నాథ్, రంగనాథ్, మాలూర్ బాషా కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. కనిపించని సంగీత మోడల్‌గా, ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్న సంగీత చటర్జి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ లక్ష్మణ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. భర్త జైల్లో ఉండగా అంతర్జాతీయ ఎర్రచందనం సామ్రాజాన్ని ఆమె చేతుల్లోకి తీసుకుంది. ఐదు రాష్ట్రాల్లోని బడా స్మగ్లర్లకు హవాలా రూపంలో రూ.కోట్లు సమకూర్చి వంద టన్నుల ఎర్రచందనం దుంగలను జిల్లా నుంచి విదేశాలకు పంపినట్లు జిల్లా పోలీస్ రికార్డులకెక్కింది. ఆమె బ్యాంకు లాకర్లను బద్దలుకొట్టిన పోలీసులు కిలోల లెక్కన బంగారు, రూ.కోట్ల విలువ చేసే స్థిరాస్తులను సీజ్ చేశారు. కోల్‌కతాకు చెందిన సంగీతపై చిత్తూరులో అరెస్టు వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. తమ కళ్లుగప్పి తిరుగుతున్న సంగీతను పట్టుకోవడం ఇప్పట్లో సాధ్యపడే విషయం కాదని పోలీసులు పెదవి విరుస్తున్నారు. -
ఎర్రక్వీన్ మోడల్ సంగీత ఏదీ..?
ఆర్నెళ్ల క్రితం పోలీసుల హడావుడి అరెస్టు వారెంట్లు ఉన్నా ఖాకీల చోద్యం చిత్తూరులో కొలిక్కిరాని కేసులు చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం స్మగ్లింగ్‌లో మహిళా డాన్, మాజీ ఎయిర్ హోస్టెస్, మోడల్ సంగీత చటర్జీ అరెస్టు వ్యవహారం మూలనపడింది. ఆర్నెళ్ల క్రితం ఆపరేషన్ రెడ్‌లో తెరపైకి వచ్చి హల్చల్ చేసిన సంగీత పేరు క్రమంగా కనుమరుగవుతోంది. చిత్తూరు కోర్టు ఆమె కు నాన్ బెరుులబుల్ అరెస్టు వారెంటు జారీ చేసినా, కోల్‌కతా కోర్టు మరో అరెస్టు వారెంటు జారీ చేసినా సంగీత జాడను పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. ఎర్రచందనం రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్‌గా, రెండుసార్లు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టుకు గురైన లక్ష్మణ్ రెండో భార్య సంగీత. లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్టు చేసిన తరువాత ఎర్రచందనం వ్యాపారాన్ని సంగీత దగ్గరుండి నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆమెపై జిల్లాలోని నాలుగు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది మే నెలలో కోల్‌కతాలో సంగీత ను అరెస్టు చేసి అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో సంగీతకు చెందిన పలు బ్యాంకు లాకర్లు స్వాధీనం చేసుకుని వాటిలో ఉన్న రూ.లక్ష ల విలువ చేసే బంగారు ఆభరణాలు, కీలక పత్రా లు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ట్రాన్సిట్ వారెంట్ కింద చిత్తూరు కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. కేసు నుంచి బయటపడడానికి సంగీత పలుమార్లు కోల్‌కతా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. మన పోలీసులు సైతం స్టేలను ఉప సంహరించేలా చేసి చిత్తూరు నుంచి అరెస్టు వారెంటు తీసుకున్నారు. తర్వాత ఏమైందో కానీ ఆర్నెళ్లుగా పెండింగ్‌లో ఉన్న వారెంట్లను అమలు చేయడంలో పోలీసులు స్తబ్దత పాటిస్తున్నారు. దీనికి తోడు మదనపల్లె సబ్‌జైలు నుంచి సంగీత భర్త లక్ష్మణ్ బెయిల్‌పై విడుదలవడానికి మార్గం సుగమమైంది. లక్ష్మణ్ బయటకొచ్చి భార్యను కలిసినప్పుడు అరెస్టు చేయాలని ఖాకీలు భావిస్తున్నారా..? కోల్‌కతాకు వెళ్లడానికి ఆపరేషన్ రెడ్‌కు డబ్బులు నిండుకున్నాయా అనే దానిసై స్పష్టత రావడంలేదు. సంగీతను అరెస్టు చేస్తే పలువురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది.