ఎర్రక్వీన్ మోడల్ సంగీత ఏదీ..?
ఎర్రక్వీన్ మోడల్ సంగీత ఏదీ..?
Published Thu, Nov 24 2016 3:13 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM
ఆర్నెళ్ల క్రితం పోలీసుల హడావుడి
అరెస్టు వారెంట్లు ఉన్నా ఖాకీల చోద్యం
చిత్తూరులో కొలిక్కిరాని కేసులు
చిత్తూరు (అర్బన్): ఎర్రచందనం స్మగ్లింగ్‌లో మహిళా డాన్, మాజీ ఎయిర్ హోస్టెస్, మోడల్ సంగీత చటర్జీ అరెస్టు వ్యవహారం మూలనపడింది. ఆర్నెళ్ల క్రితం ఆపరేషన్ రెడ్‌లో తెరపైకి వచ్చి హల్‌చల్ చేసిన సంగీత పేరు క్రమంగా కనుమరుగవుతోంది. చిత్తూరు కోర్టు ఆమె కు నాన్ బెరుులబుల్ అరెస్టు వారెంటు జారీ చేసినా, కోల్‌కతా కోర్టు మరో అరెస్టు వారెంటు జారీ చేసినా సంగీత జాడను పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. ఎర్రచందనం రవాణాలో అంతర్జాతీయ స్మగ్లర్‌గా, రెండుసార్లు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టుకు గురైన లక్ష్మణ్ రెండో భార్య సంగీత. లక్ష్మణ్‌ను పోలీసులు అరెస్టు చేసిన తరువాత ఎర్రచందనం వ్యాపారాన్ని సంగీత దగ్గరుండి నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఆమెపై జిల్లాలోని నాలుగు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది మే నెలలో కోల్‌కతాలో సంగీత ను అరెస్టు చేసి అక్కడి కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో సంగీతకు చెందిన పలు బ్యాంకు లాకర్లు స్వాధీనం చేసుకుని వాటిలో ఉన్న రూ.లక్ష ల విలువ చేసే బంగారు ఆభరణాలు, కీలక పత్రా లు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ట్రాన్సిట్ వారెంట్ కింద చిత్తూరు కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. కేసు నుంచి బయటపడడానికి సంగీత పలుమార్లు కోల్‌కతా కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. మన పోలీసులు సైతం స్టేలను ఉప సంహరించేలా చేసి చిత్తూరు నుంచి అరెస్టు వారెంటు తీసుకున్నారు.
తర్వాత ఏమైందో కానీ ఆర్నెళ్లుగా పెండింగ్‌లో ఉన్న వారెంట్లను అమలు చేయడంలో పోలీసులు స్తబ్దత పాటిస్తున్నారు. దీనికి తోడు మదనపల్లె సబ్‌జైలు నుంచి సంగీత భర్త లక్ష్మణ్ బెయిల్‌పై విడుదలవడానికి మార్గం సుగమమైంది. లక్ష్మణ్ బయటకొచ్చి భార్యను కలిసినప్పుడు అరెస్టు చేయాలని ఖాకీలు భావిస్తున్నారా..? కోల్‌కతాకు వెళ్లడానికి ఆపరేషన్ రెడ్‌కు డబ్బులు నిండుకున్నాయా అనే దానిసై స్పష్టత రావడంలేదు. సంగీతను అరెస్టు చేస్తే పలువురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది.
Advertisement
Advertisement