ఎయిర్ హోస్టెస్..ఆపై మోడల్..ఇప్పుడు స్మగ్లర్
ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం. పాశ్చాత సంస్కృతిని తలపించే విధంగా పబ్బులు, డిస్కోల్లో తైతక్కలు. అబ్బో.. ఇక చెప్పుకుంటూ వెళ్తే అంతటితో ఆగదు. పైగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయిస్తూ స్మగ్లర్లకు రూ. కోట్లలో నగదు పంపిణీ. ఇంత చేస్తున్నదీ ఓ యువతి. ఆమె పేరే సంగీత చటర్జీ. వైఫ్ ఆఫ్ లక్ష్మణ్.. చిత్తూరు పోలీసులు రెండు రోజుల క్రితం నిర్వహించిన ఆపరేషన్ రెడ్‌లో అరెస్టయ్యింది. ఈనెల 18న యువతిని చిత్తూరుకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
చిత్తూరు (అర్బన్): సంగీత చటర్జీ పేరు ఆపరేషన్ రెడ్‌లో కొత్తగా తెర పైకి వచ్చి న పేరు. ఇప్పటికే ఈమె భర్త లక్ష్మణ్‌పై జిల్లాలో పదుల సంఖ్యలో కేసులున్నా యి. ఎర్రచందనం దుంగల్ని చెన్నై, ముంబాయ్‌తో పాటు విదేశాలకు సైతం తరలించేవాడు. 2014 జూన్‌లో ఇతన్ని అరెస్టు చేసిన చిత్తూరు పోలీసులు 2015 జూలై వరకు పీడీ యాక్టు కింద జైల్లో ఉంచారు. బెయిల్‌పై వచ్చిన లక్ష్మణ్ తన ప్రధాన అనుచరుడు విక్రమ్‌మెహందీతో కలిసి మళ్లీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో చిత్తూరు పోలీసులకు పట్టుబడ్డారు. తీగ లాగిన పోలీసులకు సంగీత విషయం వెలుగు చూసింది.
లక్ష్మణ్ అయిదేళ్ల క్రి తం సంగీతను రెండో పెళ్లి చేసుకున్నా డు. విలాసవంతమైన జీవనం సంగీత ప్రపంచం. కోల్‌కతాలో ఎయిర్హోస్ట్గా పనిచేసేప్పుడు పలువురు అంతర్జాతీ య స్మగ్లర్లతో ఈమెకు పరిచయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల తరువాత మోడల్‌గా రాణించి పలు యాడ్స్‌లో సైతం నటించింది. అయితే లక్ష్మణ్ జైల్లో ఉన్న సమయంలో ఉత్తర భారతానికి చెందిన పలువురు స్మగ్లర్లకు భారీగా నగదు ముట్టచెప్పి ఎర్రచందనం దుంగల్ని విదేశాలకు తరలినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై లోతుగా విచారిస్తే సంగీత చటర్జీ పేరు బయటకొచ్చింది. బర్మా నుంచి సంగీత హవాలా రూపంలో చెన్నైకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ మోజెస్ ద్వారా రూ.10 కోట్లకు పైగా చెల్లింపులు చేసినట్లు గుర్తించారు.
ఈమెను పట్టుకోవడానికి చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. చిత్తూరు మహిళా డీఎస్పీ గిరిధర్, పశ్చిమ సీఐ ఎం.ఆదినారాయణ తమ సిబ్బందితో కలిసి కోల్‌కతాకు చేరుకున్నారు. శనివారం సంగీత చటర్జీను కోల్‌కతాలోని న్యూగరియాలో అరెస్టు చేశారు. ట్రాన్సిట్ వారెంట్‌పై చిత్తూరుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తే స్థానికంగా ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఆమెను అక్కడి కోర్టులో అరెస్టు చూపించారు. ఒకరోజు తరువాత సంగీత బెయిల్‌పై విడుదలైంది.
ఈమెపై జిల్లాలో నాలుగు పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయి. యాదమరి, గుడిపాల, కల్లూరు, నిండ్ర స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కోల్‌కతాలో బెయిల్ వచ్చినప్పటికీ ఈనెల 18న చిత్తూరుకు తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక సంగీత అరెస్టు సమయంలో సీజ్ చేసిన ఆరు బ్యాంకు ఖాతాలు, ఓ లాకర్ తాళాలు చిత్తూరు పోలీసుల వద్ద ఉన్నాయి. వీటిని తీసి చూస్తే మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసు అధి కారులు చెబుతున్నారు.