డ్వాక్రా మహిళలతో శానిటరీ మార్ట
ఏలూరు (సెంట్రల్): జిల్లాలోని ప్రతి మండల కేంద్రంలో డ్వాక్రా మహిళలతో శానిటరీ మార్ట్ ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్ నుంచి బుధవారం ఎంపీడీవోలు, తహసిల్దార్లు, వ్యవసాయ, గృహనిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్స్‌లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ఖరీఫ్ సాగు, ఎల్ఈసీ కార్డుల పంపిణీ, ఉపాధి హామీ పథకం అమలు అంశాలపై సమీక్షించారు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు సంబంధిత శానిటరీ తదితర సామగ్రి తక్కువధరకే అందించే ఉద్దేశంతో మండల కేంద్రాల్లో డ్వాక్రా మహిళలతో శానిటరీ మార్ట్ ఏర్పాటుచేయదలిచామన్నారు. మార్ట్ ఏర్పాటుకు రూ.5 లక్షల పెట్టుబడి సొమ్ము అందిస్తామని చెప్పారు. గ్రామాల్లో కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2 లక్షలు మంజూరు చేస్తామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు నూరుశాతం ప్రారంభం కావాలన్నారు. గత నెలలో రోజుకు 1.92 లక్షల మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటే ప్రస్తుతం 68 వేల మంది కూలీలకు తగ్గడంపై ఎంపీడీవోలను వివరణ కోరారు. నెలాఖరులోపు 3.25 లక్షల మందికి ఎల్ఈసీ కార్డులు అందిస్తామని చెప్పారు. డీఆర్వో కె.ప్రభాకరరావు, సీపీవో కె. సత్యనారాయణ పాల్గొన్నారు.