మహిళల అక్రమ రవాణాకు అడ్డుకట్ట
సాక్షి, ఏలూరు: మహిళల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత వెల్లడించారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు.జిల్లాలోని 13 మండలాల్లో మహిళల అక్రమ రవాణా అధికంగా సాగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఆయా మండలాలతోపాటు జిల్లా వ్యాప్తంగా పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపేందుకు, బాల్య వివాహాలను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.
జువెనైల్ హోమ్‌లో చిన్నారులు వారి తల్లిదండ్రుల మధ్య ఉన్నట్లు భావించేలా సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు. మహిళలు ఆర్థిక స్వావలంబన సాధిం చేందుకు కుటీర పరిశ్రమలు నెలకొల్పేలా ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఓటరుకు సెల్‌ఫోన్, పేదలకు ఉచిత విద్య, రుణమాఫీ వంటి హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, నిధుల కొరతవల్ల ఒక్కొక్కటిగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో 21 ఇసుక రీచ్‌లలో తవ్వకాలకు పర్యావరణ కమిటీకి ప్రతిపాదనలు పంపించామని, మరో 65 రీచ్‌లను త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని మంత్రి చెప్పారు.