women protection cell
-
ఇక్కడ పెళ్లి.. అక్కడికి వెళ్లాక లొల్లి
సాక్షి, హైదరాబాద్: చట్టాలను ఎంత కఠినతరం చేసినా... ఎన్ఆర్ఐ వివాహాలు కొందరు అమ్మాయిల పాలిట శాపంగా మారుతున్నాయి. కోటి ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన వధువుకు ఆ సంతోషం మూన్నాళ్ల ముచ్చటవుతోంది. పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్లగానే వరుడు ముఖం చాటేయడంతో అమ్మాయి జీవితం ప్రశ్నార్ధకం అవుతోంది. భర్త విదేశాల్లో, భార్య ఇండియాలో పుట్టింట్లో ఉండటంతో కేసులు ఎటూ తేలడంలేదు. ఇటు తల్లిదండ్రులు, అటు అమ్మాయిలు ఏళ్ల కొద్ది వేచి చూడాల్సొస్తుంది. ఇలాంటి ఎన్ఆర్ఐ వివాహ కేసులను త్వరిగతిన కొలిక్కి తెచ్చేందుకు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఎన్ఆర్ఐ సెల్ కృషి చేస్తోంది. అందులో భాగంగా పోలీసులకు ఇటీవల ప్రత్యేకశిక్షణ ఇచ్చిన మహిళా భద్రతా విభాగం కేసుల పరిష్కారంపై పలు విషయాలను వెల్లడించింది. రెండేళ్లలో 222 ఫిర్యాదులు... రాష్ట్ర మహిళా భద్రతా విభాగంలో ఎన్ఆర్ఐ వివాహాల కేసులకు సంబంధించి ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ సెల్‌ను జూలై 2019లో పోలీస్ శాఖ ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు 222 ఫిర్యాదులపై కేసులు నమోదుచేసినట్టు మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతిలక్రా వెల్లడించారు. అయితే వీటిలో 38 కేసుల్లో భార్యాభర్తలు కాంప్రమైజ్ కాగా, 174 కేసులు పెండింగ్ దశలో ఉన్నాయన్నారు. 35 కేసులు దర్యాçప్తు దశలో ఉండగా, మిగిలిన 139 కేసులు పెండింగ్ ట్రయల్స్ దశలో ఉన్నాయని స్వాతిలక్రా తెలిపారు. 8 కేసుల్లో సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పాస్‌పోర్టులను రద్దు చేసినట్టు చెప్పారు. మరో 23 మందిపై లుక్ ఔట్ నోటీసులు జారీచేసి ఎన్ఆర్ఐ భర్తను కోర్టుకు హాజరయ్యేలా చేశామని తెలిపారు. పోలీసులకు ప్రత్యేక శిక్షణ... ఎన్ఆర్ఐ కేసుల్లో త్వరితగతిన న్యాయం అందించడం కోసం విదేశాల్లోని స్వచ్చంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్టు స్వాతిలక్రా తెలిపారు. బాధితులు తమకు కేసులను పర్యవేక్షణ చేసుకునేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులు, నారీ గ్లోబల్ ఫౌండేషన్ అమెరికా లాంటి స్వచ్ఛంద సంస్థలతో అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. విదేశాల్లోని భారత రాయభార కార్యాలయాల్లో ఎలా ఫిర్యాదు చేయాలి, కేంద్ర విదేశాంగ శాఖతో పాటు మహిళా కమిషన్ల నుంచి సహాయం ఎలా పొందాలన్న అంశాలపై ఇన్వెస్టిగేషన్ అధికారుల ద్వారా బాధితులకు సూచనలు, సలహాలు అందిస్తున్నట్టు తెలిపారు. ఎన్ఆర్ఐ వివాహాలపై వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి, కేసుల నమోదు, దర్యాప్తు వ్యవహారాల్లో అధికారులకు ఎప్పటికప్పుడు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్టు స్వాతిలక్రా వెల్లడించారు. కేసు నమోదు సమయంలో ఎలాంటి అంశాలను బాధితుల నుంచి తీసుకోవాలి, ఆ వివరాలను ఎలా పొందుపర్చాలన్న విషయాల్లోనూ దర్యాప్తు అధికారులకు తర్ఫీదునిస్తున్నామన్నారు. ఇక్కడ ఫిర్యాదు చేయొచ్చు... విదేశాల్లో భర్తలు మోసం చేసిన సందర్భాల్లో ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా కింది సంస్థలకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం సూచిస్తోంది. - కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో పాటు, జాతీయ మహిళా కమిషన్‌కు గృహ హింసపై ఫిర్యాదు చేయవచ్చు. - విచారణకు రాకపోతే విదేశాల్లోని భారత రాయభార కార్యాలయానికి కేసు వివరాలతో ఫిర్యాదు చేయవచ్చు. - విదేశాల్లో భర్త పనిచేస్తున్న కంపెనీకి కేసు వివరాలను పంపించి విచారణకు హాజరయ్యేలా చేయొచ్చు. - సహాయం కోసం విదేశాల్లోని స్వచ్ఛంద సంస్థలను సంప్రదించవచ్చు. -
మహిళల కోసం ‘సైబర్ రక్షక్’
సాక్షి, హైదరాబాద్ : మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సైబర్ రక్షక్’ కార్యక్రమం సోమవారం ప్రారంభమయ్యింది. ముఖ్య అతిథిగా హాజరైన డీజీపీ మహేందర్‌రెడ్డి సైబర్ రక్షక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరాల్లో మహిళల భద్రత కోసం సైబర్ రక్షక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. సైబర్ క్రైమ్‌ని అరికట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు గురయ్యే మహిళలకు భరోసా ఇవ్వడం కోసం రూపొందించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామ’ని తెలిపారు. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ.. ‘మహిళా రక్షణ కోసం 2014లో షీ టీమ్స్ ఏర్పాటు చేశాం. అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ప్రవేశపెట్టిన ‘సైబర్ రక్షక్’.. సైబర్ మోసాల బారిన పడకుండా తోడ్పడతుంది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలు, పాఠశాలల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తాం. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సైబర్ రక్షక్ బృందాలుగా నియమిస్తాం. తెలంగాణను సైబర్ క్రైం ఫ్రీ స్టేట్‌గా చేయడమే మా టార్గెట్’ అని తెలిపారు. -
మహిళకు సు‘భద్రతా’ వాహిని
సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) : రైళ్లలో మహిళా ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం ముకుల్ శరణ్మాథుర్ తెలిపారు. సోమవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో రైల్వే భద్రతా దళం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఆర్పీఎఫ్, కమర్షియల్ సిబ్బందితో ప్రత్యేక రక్షణ విభాగం ‘సుభద్ర వాహిని’ని ఆయన సోమవారం ప్రారంభించారు. సుభద్ర వాహినికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను ఆయన ప్రారంభించారు. ఈ టీమ్‌లో 10 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది, 10 మంది మహిళా టికెట్ తనిఖీ సిబ్బంది ఉంటారు. ఈ టీమ్‌కు ప్రత్యేక డ్రెస్‌ను కూడా ఆవిష్కరించి వారికి అందజేశారు. ఈ సందర్భంగా శరణ్మాథుర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రత్యేకంగా కేటాయించిన టోల్‌ఫ్రీ నంబరు 182ను ఏ సమయంలోనైనా వినియోగించి ఫిర్యాదులు అందజేయవచ్చన్నారు. రైళ్లల్లో మహిళలకు ఎదురైయ్యే సమస్యలను ఈ బృందం పరిష్కరించడంలో సహకరిస్తారన్నారు. రైళ్లలో గానీ, రైల్వేస్టేషన్లలో గానీ మహిళలకు ఇబ్బందులు ఎదురుకాకుండా వీరు పని చేస్తుంటారు. ఒకొక్కసారి పురుష భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయడానికి మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అందుకే వాల్తేరు డివిజన్లో మొట్టమొదటిసారిగా సుభద్రవాహిని టీంను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దేశంలోనే ఇటువంటి టీంను ఏర్పాటు చేయడం ఇదే ప్రథమమని ఆయన తెలిపారు. ఈ కమిటీలో సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్(ఆర్పీఎఫ్), సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్లు సభ్యులుగా ఉన్నారు. ఎవరైనా 182 నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని, లేదా వాట్సాప్ నెంబరు 8978080777కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ విధంగా అందిన ఫిర్యాదులకు వెంటనే సమీప ఆర్పీఎఫ్ సిబ్బందికి చేరవేయడం ద్వారా వారిని అప్రమత్తం చేస్తారని, తద్వారా వెంటనే తప్పు చేసిన వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సీనియర్ డీఎస్పీ జితేంద్ర శ్రీ వాత్సవ, డివిజనల్ కమర్షియల్ మేనేజర్ అశోక్‌కుమార్, సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చారుమతి, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మావోయిస్టులతో చర్చలకు సిద్ధం: హోం మంత్రి
జనజీవన స్రవంతిలోకి రావాలని మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప పిలుపునిచ్చారు. మావోయిస్టులతో చర్చలకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. మహిళల రక్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అందుకు సంబంధించిన ఫైల్‌పై చినరాజప్ప సంతకం చేశారు. అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ... రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను పూర్తిగా అరికడతామని తెలిపారు. శేషాచల అడవుల్లో యథేచ్చగా సాగుతున్న స్మగ్లింగ్‌ను కట్టడి చేయడమే కాకుండా స్మగ్లర్లను పూర్తిగా నిర్మూలిస్తామని వెల్లడించారు. ఈ సందర్బంగా పలువురు పోలీసు ఉన్నతాధికారులు, టీడీపీ నాయకులు చినరాజప్పను కలసి అభినందనలు తెలిపారు.