'రక్షక భటుడే భక్షక భటుడయ్యాడు'
మహబూబ్ నగర్ : రక్షక భటుడే భక్షక భటుడైన దారుణ సంఘటన మహబూబ్నగర్జిల్లాలో చోటుచేసుకుంది. అడ్డాకుల మండలం కందూరుకు చెందిన ఓ మహిళ 22 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటోంది. ఆస్పత్రిలో ఉన్న బంధువులను పరామర్శించి అర్థరాత్రి కొత్తకోట బస్టాండ్లో దిగిన ఆమెను అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ అటకాయించాడు. హోంగార్డు, మరో ఇద్దరు స్థానికులను కాపలాగా పెట్టి, మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు విచారణ చేపట్టారు.
మహిళపై అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ నాగేంద్ర కుమార్ వెల్లడించారు. ఆయన గురువారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులైన హోంగార్డ్, కానిస్టేబుల్లను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. ఈ సంఘటనపై నిందితులను కఠినంగా శిక్షించాలంటూ అన్ని రాజకీయ పార్టీలు రాస్తారోకో నిర్వహించాయి.