మోసగించిన భర్త ఆచూకీ కోసం...
కట్టుకున్నోడు వదిలి ఎక్కడికో వెళ్లిపోయాడు... న్యాయం చేయండంటూ ఓ మహిళ అర్జీ పెట్టుకున్నా స్పందన లేదు. రాజమండ్రి లింగంపేటకు చెందిన రామలక్ష్మి అనే వివాహిత న్యాయం చేయాలంటూ ఇటీవల రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారిని గ్రీవెన్స్ సెల్లో వేడుకుంది. ఆమె అర్జీని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు ఆర్డీఓ సిఫారసు చేశారు. రోజు గడుస్తున్నా దీనిపై ఏ పురోగతీ లేదు. త్రీ టౌన్ పోలీసు స్టేషన్లో దీనిపై వివరణ అడిగితే అసలు మాకెలాంటి సమాచారం రాలేదంటున్నారు. తన భర్త రాకకోసం బాధితురాలి ఎదురుచూపులు అలాగే కొనసాగుతున్నాయి... చీపుర్లు అమ్ముకుని జీవనం గడిపే నర్సయమ్మకు ముందూ వెనుకా ఎవరూ లేరు.
కుమార్తె రామలక్ష్మితో కలిసి రాజమండ్రిలోని లింగంపేటలో నివసిస్తోంది. వాసం శెట్టి శ్రీను అనే యువకుడు ఏడు నెలల కిందట తనది కాకినాడ అని, తనకు ఎవరూ లేరని చెప్పి వారింట చేరాడు. తమతో సన్నిహితంగా ఉండే రాము అనే వ్యక్తి అతడ్ని పరిచయం చేయడంతో వారు నమ్మారు. శ్రీను తన కూతురిని ఇష్టపడడంతో కుటుంబానికి అండగా ఉంటాడని భావించిన నర్సయమ్మ పశ్చిమగోదావరి జిల్లా గౌరీ పట్నం మేరీ మాత ఆలయంలో గత ఏడాది జూన్ మూడున వారికి పెళ్లి చేసింది. మూడు నెలలు బాగానే ఉన్నారు. ఆ తర్వాత కథ అడ్డం తిరిగింది.
‘పెళ్లయిన నెలకు లాలాచెరువు ఏరియాకు మారాము. అక్కడ శ్రీను ఒక హోటల్లో పనిచేసేవాడు. తన స్నేహితుడు బాబూరావు, అతని భార్యను ఇంటికి తీసుకు వచ్చేవాడు. వాళ్ల మాటలకు ప్రాధాన్యం ఇస్తూ తరచు నన్ను కొట్టేవాడు. దీంతో మా అమ్మ నన్ను లింగంపేట తీసుకుపోయింది. శ్రీను రాలేదు. అయితే బాబూరావుతో మాత్రం ఫోన్లో మాట్లాడుతున్నాడు. బాబూరావుని అడిగితే శ్రీను ఆచూకీ చెప్పడంలేదు. పైగా విడిపొమ్మని సలహా ఇస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆచూకీ మీరే వెతికి చెప్పండని అంటున్నార’ని బాధితురాలు తెలిపింది.