Womens Cricket World Cup
-
టీమిండియా బ్యాటర్ల విధ్వంసం.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం
బెనోని: తొలి అండర్–19 టి20 ప్రపంచకప్‌ను భారత మహిళల జట్టు ఘన విజయంతో మొదలు పెట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా అండర్–19 మహిళల టీమ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగా... భారత్ 16.3 ఓవర్లలో 3 వికెట్లకు 170 పరుగులు చేసింది. షబ్నమ్ వేసిన తొలి ఓవర్లోనే 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టి వాన్ రెన్స్‌బర్గ్ (23) సఫారీ జట్టుకు శుభారంభం అందించగా, సోనమ్ వేసిన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి సిమోన్ లోరెన్స్ (44 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్) 4 ఫోర్లు, సిక్స్ బాదింది. అయితే ఆ తర్వాత ప్రత్యర్థిని భారత బౌలర్లు కట్టడి చేయడంలో సఫలం కాగా, మ్యాడిసన్ ల్యాండ్స్‌మన్ (17 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. ఛేదనలో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్వేత సెహ్రావత్ (57 బంతుల్లో 92 నాటౌట్; 20 ఫోర్లు), కెప్టెన్ షఫాలీ వర్మ (16 బంతుల్లో 45; 9 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగిపోయారు. నిని వేసిన ఓవర్లో షఫాలీ వరుసగా 4, 4, 4, 4, 4, 6తో ఆధిపత్యం ప్రదర్శించింది. మరోవైపు శ్వేత తన దూకుడును తగ్గించకుండా దూసుకుపోయింది. గొంగడి త్రిష (15) తొందరగానే వెనుదిరిగినా... శ్వేత చివరి వరకు నిలబడటంతో భారత్‌కు గెలుపు సులువైంది. ఓపెనర్ శ్వేత 7 ఓవర్లలో కనీసం రెండు ఫోర్ల చొప్పున కొట్టడం విశేషం. ఇతర మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ ఏడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై, యూఏఈ ఆరు వికెట్ల తేడాతో స్కాట్లాండ్పై, శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో అమెరికాపై గెలిచాయి. -
ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ సమరం
-
వన్డే ప్రపంచకప్‌కు భారత మహిళల జట్టు అర్హత
దుబాయ్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చే మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు భారత మహిళల జట్టు నేరుగా అర్హత సాధించిందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. 2017 వరల్డ్‌కప్ రన్నరప్ భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఈ మెగా ఈవెంట్‌కు బెర్త్‌లు ఖాయం చేసుకున్నాయి. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా 2017 నుంచి 2020 మధ్యకాలంలో ఆయా జట్ల మధ్య జరగని సిరీస్‌లకు సంబంధించి అన్ని జట్లకు సమంగా పాయింట్లు ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. దాంతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (37 పాయింట్లు), ఇంగ్లండ్ (29), దక్షిణాఫ్రికా (25), భారత్ (23) తొలి నాలుగు స్థానాల్లో నిలిచి నేరుగా వరల్డ్‌కప్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాయి. ఆతిథ్య దేశం హోదాలో న్యూజిలాండ్ పాల్గొంటుంది. జూలై 3 నుంచి 19 వరకు శ్రీలంకలో జరిగే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ద్వారా మిగిలిన మూడు బెర్త్‌లు ఖాయమవుతాయి. -
సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్
సిడ్నీ: ‘హ్యాట్రిక్’ విజయంతో దక్షిణాఫ్రికా... మూడో గెలుపుతో ఇంగ్లండ్ జట్లు మహిళల టి20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఆదివారం జరిగిన గ్రూప్ ‘బి’ లీగ్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 17 పరుగుల ఆధిక్యంతో పాకిస్తాన్‌పై... ఇంగ్లండ్ 46 పరుగుల ఆధిక్యంతో వెస్టిండీస్‌పై గెలుపొందాయి. గ్రూప్ ‘బి’లో తమ నాలుగు లీగ్ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న ఇంగ్లండ్ మూడు విజయాలతో ఆరు పాయింట్లు సంపాదించింది. దక్షిణాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఆరు పాయింట్లతో ఇంగ్లండ్‌తో సమఉజ్జీగా ఉంది. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా ఇంగ్లండ్ ఈ గ్రూప్‌లో టాప్ ర్యాంక్‌లో ఉంది. మంగళవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడిస్తే దక్షిణాఫ్రికా గ్రూప్ టాపర్‌గా నిలుస్తుంది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 136 పరుగులు చేసింది. లారా వోల్వార్ట్ (36 బంతుల్లో 53 నాటౌట్; 8 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. మారిజన్ కాప్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్) కూడా రాణించింది. 137 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 119 పరుగులు చేసి ఓడిపోయింది. జవేరియా ఖాన్ (31; 4 ఫోర్లు), అలియా రియాజ్ (39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) రాణించినా ఫలితం లేకపోయింది. మాజీ చాంపియన్ వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 143 పరుగులు చేసింది. నటాలీ షివెర్ (56 బంతుల్లో 57; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. అనంతరం వెస్టిండీస్ 17.1 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌటైంది. సోఫీ ఎకిల్‌స్టోన్ 7 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి విండీస్‌ను దెబ్బతీసింది. నేటి గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌తో శ్రీలంక; ఆస్ట్రేలియాతో న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ విజేత ఈ గ్రూప్ నుంచి రెండో జట్టుగా సెమీఫైనల్ చేరుకుంటుంది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచి భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న సంగతి తెలిసిందే. -
ఇంగ్లండ్ విజయం
లీస్టర్ (ఇంగ్లండ్): మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నమెంట్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు తొలి విజయం నమోదు చేసింది. పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 107 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 377 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ హీథెర్‌నైట్ (109 బంతుల్లో 106; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), నటాలీ సివెర్ (92 బంతుల్లో 137; 14 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలు చేయడం విశేషం. వీరిద్దరూ మూడో వికెట్‌కు 213 పరుగులు జోడించారు. అనంతరం పాకిస్తాన్ 29.2 ఓవర్లలో 3 వికెట్లకు 109 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో మిగతా ఓవర్ల ఆట సాధ్యపడలేదు. డక్‌వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం మ్యాచ్ నిలిచే సమయానికి పాకిస్తాన్ 214 పరుగులు చేయాల్సింది. బుధవారం జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో దక్షిణాఫ్రికా ఆడుతుంది.