దుబాయ్: వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చే మహిళల వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌కు భారత మహిళల జట్టు నేరుగా అర్హత సాధించిందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. 2017 వరల్డ్‌కప్ రన్నరప్ భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఈ మెగా ఈవెంట్‌కు బెర్త్‌లు ఖాయం చేసుకున్నాయి.
ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా 2017 నుంచి 2020 మధ్యకాలంలో ఆయా జట్ల మధ్య జరగని సిరీస్‌లకు సంబంధించి అన్ని జట్లకు సమంగా పాయింట్లు ఇవ్వాలని ఐసీసీ నిర్ణయించింది. దాంతో పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (37 పాయింట్లు), ఇంగ్లండ్ (29), దక్షిణాఫ్రికా (25), భారత్ (23) తొలి నాలుగు స్థానాల్లో నిలిచి నేరుగా వరల్డ్‌కప్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాయి. ఆతిథ్య దేశం హోదాలో న్యూజిలాండ్ పాల్గొంటుంది. జూలై 3 నుంచి 19 వరకు శ్రీలంకలో జరిగే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ ద్వారా మిగిలిన మూడు బెర్త్‌లు ఖాయమవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment