WTC Final: అవసరమైతే ‘ఆరో రోజు’... | International Cricket Council working on sixth day | Sakshi
Sakshi News home page

WTC Final: అవసరమైతే ‘ఆరో రోజు’...

Published Thu, May 27 2021 3:59 AM | Last Updated on Thu, May 27 2021 8:13 AM

International Cricket Council working on sixth day - Sakshi

దుబాయ్‌: ఐదు రోజులు సాగే ఒక పూర్తి టెస్టు మ్యాచ్‌లో కనీసం 30 గంటల ఆట సాగాలి లేదా 450 ఓవర్లు పడాలి. ఇంత జరిగాక కూడా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో ఫలితం రాకుండా మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిస్తే ఎలా? విజేత ఎవరు? ఇలాంటి సందేహం సాధారణ అభిమానికి వస్తే తప్పు లేదు. కానీ మ్యాచ్‌ నిర్వహించే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) వద్దనే దీనిపై సమాచారం లేదు. జూన్‌ 18 నుంచి భారత్, న్యూజిలాండ్‌ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉండగా ‘ఫైనల్‌’ నిబంధనల విషయంలో ఐసీసీకి ఇంకా స్పష్టత రాలేదు.

ఈ మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిస్తే ఎలా అనేదానిపై ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. మొదటిసారి డబ్ల్యూటీసీ ప్రకటించిన సమయంలో ఇలాంటి పలు సందేహాలకు సమాధానమిచ్చిన ఐసీసీ... మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిస్తే సంయుక్త విజేతలుగా ప్రకటిస్తామని కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఐసీసీ వెబ్‌సైట్‌ నుంచి ఇవన్నీ తొలగించారు. తొలిసారి నిర్వహిస్తున్న చాంపియన్‌షిప్‌లో సంయుక్త విజేతలు అంటే ఏమాత్రం బాగుండదని, సాధ్యమైనంత వరకు ఫలితం కోసం ప్రయత్నించాలని కొన్ని సూచనలు వచ్చాయి.

‘డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ‘రిజర్వ్‌ డే’ ఉంచాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. దీని ప్రకారం ఐదు రోజుల్లో వాతావరణ సమస్య వల్ల 30 గంటలకంటే తక్కువ ఆట జరిగితే ఆరో రోజు కూడా టెస్టు ఆడించాలనేది ఒక ఆలోచన. అయితే గంటల లెక్కను చూస్తే స్లో ఓవర్‌ రేట్‌ సమస్య రావచ్చు కాబట్టి 450 ఓవర్లకంటే తక్కువ పడితే రిజర్వ్‌ డేను కొనసాగించాలనేది మరో ఆలోచన. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం’ అని ఐసీసీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.  

మరోవైపు అసలు రాబోయే రోజుల్లో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ కొనసాగుతుందా అనే అంశంపై కూడా సందేహాలు తలెత్తుతున్నాయి. అనుకున్న స్థాయిలో డబ్ల్యూటీసీ విజయవంతం కాలేదని, ఫార్మాట్, పాయింట్ల కేటాయింపు విధానంపై బాగా విమర్శలు వచ్చాయని పలువురు సభ్యులు భావిస్తున్నారు. పైగా ఏడాదిపాటు కరోనా కారణంగా షెడ్యూల్‌ మొత్తం దెబ్బతింది. దాంతో దీనిపై జూన్‌ 1న జరిగే ఐసీసీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement