రెండేళ్ల క్రితం...ఇదే ఇంగ్లండ్ గడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఓటమిపాలైన అనంతరం న్యూజిలాండ్ ఆటగాళ్ల గుండె పగిలింది. అద్భుతమైన ఆటతీరు కనబర్చినా అసంబద్ధ ‘బౌండరీ కౌంట్’ నిబంధనతో ఆ జట్టు కప్‌ను చేజార్చుకుంది. ఇప్పుడు అదే ఇంగ్లండ్‌లో మరో ఫార్మాట్‌లో కివీస్ జట్టు విశ్వ విజేతగా నిలిచి మధురమైన విజయానుభూతులు కూడగట్టుకుంది. తమపై అంచనాలు తక్కువగా ఉన్నా... అటువైపు అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ప్రత్యర్థి అయినా సరే పక్కా ప్రణాళికతో టైటిల్‌కు గురి పెట్టిన విలియమ్సన్ సేన చివరకు దానిని సగర్వంగా అందుకుంది. ఆరో రోజు పదునైన బౌలింగ్‌తో విజయానికి బాటలు వేసుకున్న టీమ్ 139 పరుగుల లక్ష్యాన్ని ప్రశాంతంగా అధిగమించింది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు అన్ని రంగాల్లో అత్యుత్తమంగా కనిపించిన భారత జట్టు మరోసారి ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లో చతికిలపడింది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే పరిమితమైన జట్టు ప్రత్యర్థికి సవాల్ విసరడంలో విఫలమైంది. పిచ్‌ను పట్టించుకోకుండా తుది జట్టు ఎంపికలో చేసిన పొరపాటు కూడా టీమిండియా ఓటమికి ఒక కారణం కాగా, కివీస్ పట్టుదల ముందు జట్టు తలవంచింది. 2000లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన న్యూజిలాండ్ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ టోర్నీలో విజేతగా నిలవగా... నాటి తరహాలో ఈసారి కూడా భారత్‌నే ఆ జట్టు ఫైనల్లో ఓడించడం విశేషం.
సౌతాంప్టన్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)ను న్యూజిలాండ్ జట్టు సొంతం చేసుకుంది. రెండు రోజులు పూర్తిగా వర్షంతో తుడిచి పెట్టుకుపోయినా... ‘రిజర్వ్ డే’ కారణంగా ఉత్కంఠభరితంగా మారిపోయిన ఫైనల్లో న్యూజిలాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 64/2తో బుధవారం ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్ (88 బంతుల్లో 41; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, సౌతీ 4 వికెట్లతో దెబ్బ తీశాడు. అనంతరం మిగిలిన 53 కనీస ఓవర్లలో 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో 2 వికెట్లకు 140 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (89 బంతుల్లో 52 నాటౌట్; 8 ఫోర్లు), రాస్ టేలర్ (100 బంతుల్లో 47 నాటౌట్; 6 ఫోర్లు) మూడో వికెట్‌కు 96 పరుగుల అభేద్య భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన జేమీసన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. విజేతగా నిలిచిన న్యూజిలాండ్‌కు 16 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 87 లక్షలు)తోపాటు గద (ట్రోఫీ) లభించింది. రన్నరప్ భారత జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 5 కోట్ల 93 లక్షలు) ప్రైజ్‌మనీ దక్కింది.
పంత్ మినహా...
రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ పేసర్లను భారత బ్యాట్స్‌మెన్ సమర్థంగా ఎదుర్కోలేకపోయారు. తన వరుస ఓవర్లలో చక్కటి బంతులతో కోహ్లి (13), పుజారా (15)లను అవుట్ చేసి జేమీసన్ భారత పతనానికి శ్రీకారం చుట్టాడు. ఆశలు పెట్టుకున్న రహానే (15), జడేజా (16) కూడా నిలవలేకపోయారు. భారత్ ఈమాత్రం స్కోరు సాధించిందంటే అది పంత్ చలవే. జేమీసన్ బౌలింగ్‌లో 6 పరుగుల వద్ద సౌతీ సునాయాస క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన పంత్ ఆ తర్వాత కొన్ని చక్కటి షాట్లతో స్కోరు వేగం పెంచాడు. అయితే ఒకే ఓవర్లో పంత్, అశ్విన్ (7)లను పెవిలియన్ పంపించి బౌల్ట్ దెబ్బ తీశాడు. ఆపై మరో ఓవర్లో సౌతీ 2 వికెట్లతో భారత్ ఆట ముగించాడు.
అశ్విన్ జోరు...
లక్ష్యం చిన్నదే అయినా న్యూజిలాండ్ ఓపెనర్లు ఆరంభంలో చాలా జాగ్రత్తగా ఆడారు. 13.2 ఓవర్లలో లాథమ్ (9), కాన్వే (19) తొలి వికెట్‌కు 33 పరుగులే చేశారు. అయితే అశ్విన్ రాకతో ఆట మలుపు తిరిగినట్లు అనిపించింది. పదునైన బంతులతో ప్రత్యర్థిని కట్టిపడేసిన అశ్విన్ 11 పరుగుల వ్యవధిలో ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేశాడు. అయితే న్యూజిలాండ్ జట్టులో అందరికంటే సీనియర్లయిన ఇద్దరు ఆటగాళ్లు విలియమ్సన్, టేలర్ తమ అనుభవాన్నంతా జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. భారత బౌలర్ల నుంచి ఎదురైన ఒత్తిడిని తట్టుకుంటూ వీరిద్దరు పట్టుదలగా నిలబడ్డారు. ఒకదశలో వరుసగా 31 బంతుల పాటు ఒక్క పరుగు కూడా రాలేదు! అయితే కుదురుకున్న తర్వాత స్వేచ్ఛగా, చక్కటి ప్రణాళికతో ఆడిన వీరిద్దరు భారత్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కొన్ని ఉత్కంఠ క్షణాలను అధిగమించిన అనంతరం చకచకా పరుగులు రాబట్టి జట్టును విజయం దిశగా నడిపించారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 217; న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 249; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) సౌతీ 30; గిల్ (ఎల్బీ) (బి) సౌతీ 8; పుజారా (సి) టేలర్ (బి) జేమీసన్ 15; కోహ్లి (సి) వాట్లింగ్ (బి) జేమీసన్ 13; రహానే (సి) వాట్లింగ్ (బి) బౌల్ట్ 15; పంత్ (సి) నికోల్స్ (బి) బౌల్ట్ 41; జడేజా (సి) వాట్లింగ్ (బి) వాగ్నర్ 16; అశ్విన్ (సి) టేలర్ (బి) బౌల్ట్ 7; షమీ (సి) లాథమ్ (బి) సౌతీ 13; ఇషాంత్ (నాటౌట్) 1; బుమ్రా (సి) లాథమ్ (బి) సౌతీ 0; ఎక్స్‌ట్రాలు 11, మొత్తం (73 ఓవర్లలో ఆలౌట్) 170.
వికెట్ల పతనం: 1–24, 2–51, 3–71, 4–72, 5–109, 6–142, 7–156, 8–156, 9–170, 10–170.
బౌలింగ్: సౌతీ 19–4–48–4, బౌల్ట్ 15–2–39–3, జేమీసన్ 24–10–30–2, వాగ్నర్ 15–2–44–1.
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 9; కాన్వే (ఎల్బీ) (బి) అశ్విన్ 19; విలియమ్సన్ (నాటౌట్) 52; రాస్ టేలర్ (నాటౌట్) 47; ఎక్స్‌ట్రాలు 13, మొత్తం (45.5 ఓవర్లలో 2 వికెట్లకు) 140.
వికెట్ల పతనం: 1–33, 2–44. బౌలింగ్: ఇషాంత్ 6.2–2–21–0, షమీ 10.5–3–31–0, బుమ్రా 10.4–2–35–0, అశ్విన్ 10–5–17–2, జడేజా 8–1–25–0.
కేన్ బృందానికి నా అభినందనలు. ఆటలో నిలకడ, పట్టుదల చూపించిన కివీస్ విజయాన్నందుకుంది. మాపై మొదటి నుంచి ఒత్తిడి పెంచిన ప్రత్యర్థికే గెలిచే అర్హత ఉంది. చివరి రోజు వారి బౌలర్లు తమ ప్రణాళికలు పక్కాగా అమలు చేశారు. మేం మరో 30–40 పరుగులు చేయాల్సింది. నలుగురు పేసర్లను తీసుకోవాలంటే అందులో ఒకరు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయి ఉండాలి. అయినా ఇదే జట్టు ఇప్పటి వరకు భిన్న పరిస్థితుల్లో బాగా ఆడింది. ఆట ఇంకొంచెం ఎక్కువ సేపు సాగి ఉంటే స్పిన్నర్లు ఇంకా ప్రభావం చూపించేవారు. ఈ ఫలితం టెస్టు క్రికెట్‌కు మేలు చేస్తుంది. క్రికెట్‌కు గుండెచప్పుడులాంటి టెస్టులకు మరింత ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం ఉంది.
–కోహ్లి, భారత కెప్టెన్
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment