రసవత్తర స్థితిలో... | New Zealand lead by 143 runs in the third test | Sakshi
Sakshi News home page

రసవత్తర స్థితిలో...

Published Sun, Nov 3 2024 4:03 AM | Last Updated on Sun, Nov 3 2024 5:00 AM

New Zealand lead by 143 runs in the third test

చివరి టెస్టులో రెండో రోజు 15 వికెట్లు 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 263 ఆలౌట్‌ 

రాణించిన గిల్, పంత్‌ 

రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ 171/9 

తిప్పేసిన జడేజా, అశ్విన్‌ 

ఆఖరి మూడో టెస్టును స్పిన్నే దున్నేస్తోంది. రెండో రోజు 15 వికెట్లు కూలాయి. ఇంతలా గింగిర్లు తిరుగుతున్న పిచ్‌పై రిషభ్‌ పంత్‌ టెస్టులో టి20 ఆట ఆడేశాడు. దీంతో తొలి సెషన్‌లో ఆతిథ్య జట్టు వేగంగా పరుగులు సాధించింది. రెండో సెషన్‌లో ఎజాజ్‌ స్పిన్‌ భారత్‌ను చుట్టేసింది. 

అయితే మూడో సెషన్‌లో మన స్పిన్‌ ద్వయం జడేజా,  అశ్విన్‌లు చెలరేగడంతో భారత్‌ పట్టు బిగించినట్లు కనిపించింది. ప్రస్తుతం న్యూజిలాండ్‌ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. నామమాత్రమైన ఆఖరి వికెట్‌ మిగిలుంది. ఇలాంటి కఠిన పిచ్‌పై ఇది కూడా చిన్న లక్ష్యమేమీ కాదు కాబట్టి మూడో రోజూ హోరాహోరీ పోరు ఖాయం.  

ముంబై: చివరి టెస్టు రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. అటో... ఇటో... ఎవరివైపో కానీ ఈ మ్యాచ్‌ అయితే మూడు రోజుల్లో ముగియడం ఖాయమైంది. ప్రత్యర్థి స్పిన్‌కు ఎదురీదితే భారత్‌ 1–2తో సిరీస్‌లో పరువు నిలుపుకుంటుంది. ఉచ్చులో పడితే మాత్రం సొంతగడ్డపై వైట్‌వాష్‌ అవుతుంది. రెండో రోజు ఆటలో మాత్రం భారత బ్యాటర్లే కాస్త పైచేయి సాధించారని చెప్పొచ్చు. 6 వికెట్లు సమర్పించుకున్న టీమిండియా క్రితం రోజు స్కోరుకు 177 పరుగులు జత చేసింది. 

శుబ్‌మన్‌ గిల్‌ (146 బంతుల్లో 90; 7 ఫోర్లు, 1 సిక్స్‌), రిషభ్‌ పంత్‌ (59 బంతుల్లో 60; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టారు. ఎజాజ్‌ పటేల్‌కు 5 వికెట్లు దక్కాయి. భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 28 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది.  అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు చేజార్చుకున్న న్యూజిలాండ్‌ 171 పరుగులు చేసింది. విల్‌ యంగ్‌ (100 బంతుల్లో 51; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. జడేజా 4, అశ్విన్‌ 3 వికెట్లు తీశారు. 

పంత్‌ ధనాధన్‌ ఫిఫ్టీ 
తొలి సెషన్‌లో భారత బ్యాటర్లు రిషభ్‌ పంత్, శుబ్‌మన్‌ నిలకడగా ఆడటంతో కివీస్‌ బౌలర్ల ఆటలు సాగలేదు.  సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ చాప్‌మన్‌ లాంగాన్‌లో గిల్‌ ఇచ్చిన క్యాచ్‌ను, లాంగాఫ్‌లో పంత్‌ క్యాచ్‌ను మ్యాట్‌ హెన్రీ వదిలేశారు. దీన్ని సద్వినియోగం చేసుకొన్న బ్యాటర్లు ఇద్దరూ అర్ధ సెంచరీలతో ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు.  శనివారం 86/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 59.4 ఓవర్లలో 263 పరుగుల వద్ద ఆలౌటైంది.

పంత్, గిల్‌ కివీస్‌ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ పరుగులు సాధించారు. ముఖ్యంగా రిషభ్‌ టి20 ఫార్మాటల్లే చెలరేగిపోయాడు. ఎజాజ్‌ పటేల్, ఫిలిప్స్‌ బౌలింగ్‌లో చూడచక్కని బౌండరీలు, భారీ సిక్సర్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో 29వ ఓవర్లోనే భారత్‌ స్కోరు 150 పరుగులను దాటింది. మరుసటి ఓవర్లోనే ఇద్దరి ఫిఫ్టీలు పూర్తయ్యాయి.

30వ ఓవర్‌ తొలి బంతికి సింగిల్‌ తీసిన గిల్‌ 66 బంతుల్లో, నాలుగో బంతికి పరుగు తీసిన రిషభ్‌ 36 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. కాసేపటి తర్వాత ఇష్‌ సోధి... పంత్‌ను ఎల్బీగా అవుట్‌ చేయడంతో ఐదో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రవీంద్ర జడేజా (14) క్రీజులోకి రాగా, టీమిండియా లంచ్‌ విరామానికి  195/5 స్కోరు చేసింది. అప్పటికి ఇంకా ఆతిథ్య జట్టు 40 పరుగులు వెనుకబడే ఉంది. 

ఎజాజ్‌ దెబ్బ 
రెండో సెషన్‌లో ఎజాజ్‌ పటేల్‌ స్పిన్‌ మాయాజాలం మొదలవడంతో భారత్‌ ఇబ్బందుల్లో పడింది. జట్టు స్కోరు 200 దాటగానే జడేజాను ఫిలిప్స్‌ అవుట్‌ చేయగా, స్వల్ప వ్యవధిలో ఎజాజ్‌... సర్ఫరాజ్‌ (0), గిల్, అశ్విన్‌ (6)ల వికెట్లను పడగొట్టడంతో గిల్‌ 10 పరుగుల దూరంలో సెంచరీ అవకాశాన్ని కోల్పోగా... భారత్‌ భారీ ఆధిక్యం సాధించలేకపోయింది.

ఆకాశ్‌దీప్‌ (0) రనౌట్‌ కావడంతో టీ విరామానికి ముందే భారత్‌ 263 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. అయితే వికెట్‌ పూర్తిగా స్పిన్‌కు అనువుగా మారిపోవడంతో భారత సీనియర్‌ స్పిన్‌ ద్వయం అశ్విన్‌–జడేజా కివీస్‌ రెండో ఇన్నింగ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. వన్‌డౌన్‌ బ్యాటర్‌ విల్‌ యంగ్‌ తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు.

మిచెల్‌ (21; 1 ఫోర్, 1 సిక్స్‌), ఫిలిప్స్‌ (26; 1 ఫోర్, 3 సిక్స్‌లు)ల అండతో యంగ్‌ 95 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. 171 పరుగుల వద్ద హెన్రీ (10)ని జడేజా బౌల్డ్‌ చేయడంతో రెండో రోజు ఆటను ముగించారు. ఆకాశ్‌దీప్, వాషింగ్టన్‌ సుందర్‌ చెరో వికెట్‌ తీశారు.  ప్రస్తుతం కివీస్‌ 143 పరుగుల ముందంజలో ఉంది. 

స్కోరు వివరాలు 
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 235 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (బి) ఎజాజ్‌ 30; రోహిత్‌ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 18; గిల్‌ (సి) మిచెల్‌ (బి) ఎజాజ్‌ 90; సిరాజ్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎజాజ్‌ 0; కోహ్లి రనౌట్‌ 4; పంత్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) సోధి 60; జడేజా (సి) మిచెల్‌ (బి) ఫిలిప్స్‌ 14; సర్ఫరాజ్‌ (సి) బ్లన్‌డెల్‌ (బి) ఎజాజ్‌ 0; సుందర్‌ నాటౌట్‌ 38; అశ్విన్‌ (సి) మిచెల్‌ (బి) ఎజాజ్‌ 6; ఆకాశ్‌దీప్‌ రనౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (59.4 ఓవర్లలో ఆలౌట్‌) 263. వికెట్ల పతనం: 1–25, 2–78, 3–78, 4–84, 5–180, 6–203, 7–204, 8–227, 9–247, 10–263. 
బౌలింగ్‌: మ్యాట్‌ హెన్రీ 8–1–26–1, విలియమ్‌ ఓ రూర్కే 2–1–5–0, ఎజాజ్‌ పటేల్‌ 21.4–3– 103–5, గ్లెన్‌ ఫిలిప్స్‌ 20–0–84–1, రచిన్‌ రవీంద్ర 1–0–8–0, ఇష్‌ సోధి 7–0–36–1. 

న్యూజిలాండ్‌ రెండోఇన్నింగ్స్‌: లాథమ్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 1; కాన్వే (సి) గిల్‌ (బి) సుందర్‌ 22; యంగ్‌ (సి అండ్‌ బి) అశ్విన్‌ 51; రచిన్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అశ్విన్‌ 4; మిచెల్‌ (సి) అశ్విన్‌ (బి) జడేజా 21; బ్లన్‌డెల్‌ (బి) జడేజా 4; ఫిలిప్స్‌ (బి) అశ్విన్‌ 26; ఇష్‌ సోధి (సి) కోహ్లి (బి) జడేజా 8; హెన్రీ (బి) జడేజా 10; ఎజాజ్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (43.3 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–2, 2–39, 3–44, 4–94, 5–100, 6–131, 7–148, 8–150, 9–171. బౌలింగ్‌: ఆకాశ్‌దీప్‌ 5–0–10–1, వాషింగ్టన్‌ సుందర్‌ 10–0–30–1, అశ్విన్‌ 16–0–63–3, జడేజా 12.3–2–52–4.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement