భారత్‌తో టెస్టు సిరీస్‌లో సత్తా చాటిన విల్ యంగ్
ముంబై: న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్ 2020 డిసెంబర్‌లో టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే భారత్‌తో సిరీస్‌కు ముందు వరకు ఈ నాలుగేళ్లలో అతను 16 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. ప్రతీసారి రిజర్వ్ ఆటగాడిగానే ఎంపిక కావడం... విరామంలో సహచరులకు డ్రింక్స్ అందించడం మినహా అతనికి చెప్పుకోదగ్గ అవకాశాలే రాలేదు! జట్టులో ఎవరైనా గాయపడితే తప్ప యంగ్ పేరును టీమ్ మేనేజ్‌మెంట్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి.
గాయం నుంచి కేన్ విలియమ్సన్ కోలుకోకపోవడంతో ముందుగా తొలి టెస్టులో చాన్స్ లభించింది. ఆ తర్వాత విలియమ్సన్ తర్వాతి మ్యాచ్‌లూ ఆడలేడని ఖాయం కావడంతో యంగ్ చోటుకు ఢోకా లేకుండా పోయింది. చివరకు సిరీస్‌లో మొత్తం 244 పరుగులు సాధించి కివీస్ చారిత్రాత్మక విజయంలో కీలకపాత్ర పోషించిన అతను ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. డ్రింక్స్ అందించడమే తనకు అలవాటుగా మారిపోయిందని... ఇప్పుడు టీమ్‌ను గెలిపించడం తనకు గర్వంగా అనిపిస్తోందని విల్ యంగ్ వ్యాఖ్యానించాడు.
‘నాలుగేళ్లలో వేర్వేరు కారణాలతో నేను మైదానంలో కంటే బయటే ఎక్కువగా ఉన్నాను. ఎప్పుడూ రిజర్వ్ బ్యాటర్‌గానే నా పేరు ఉండేది. జట్టు సభ్యులకు డ్రింక్స్ అందించడమే ఒక అనుభవంగా మారిపోయింది. అయితే ఎప్పుడు అవకాశం వచ్చినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించా. విలియమ్సన్ స్థానంలో వచ్చి నా అతడిని అనుకరించకుండా నా సొంత ఆటనే ఆడాను. ఇప్పుడు నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది’ అని యంగ్ అన్నాడు. భారత్‌ను స్పిన్ పిచ్‌లపైనే చిత్తు చేయడం గొప్పగా అనిపించిందని యంగ్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment