అతడికి ఏమైంది..?
సాక్షి, హైదరాబాద్: దేశంలో నమోదవుతున్న ఆత్మహత్య కేసుల్లో మహిళల కంటే పురుషులే ఎక్కువ ఉంటున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ)–2019 గణాంకాలు పేర్కొంటున్నాయి. మనోనిబ్బరం విషయంలో మహిళలకంటే పురుషులే బలహీనంగా ఉండటం దీనికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది దేశ వ్యాప్తంగా సరాసరిన రోజుకు 381 ఆత్మహత్య ఘటనలు జరగ్గా.. వీటిలో 267 మంది పురుషులే ఉన్నారు. దేశంలో నమోదయిన వాటిలో 5 శాతం తెలంగాణకు సంబంధించినవి. ఇక్కడ గత ఏడాది మొత్తం 7,675 సూసైడ్స్ జరిగాయి. అన్నింటా మహిళలపై ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించే పురుషులు కష్టాలు ఎదురవగానే డీలాపడిపోతున్నారు. అర్ధాంతరంగా జీవితాలు ముగించేందుకు మొగ్గు చూపుతున్నారు. గతేడాది దేశ వ్యాప్తంగా 1,39,122 ఆత్మహత్యలు రికార్డుల్లోకి ఎక్కాయి.
వీటిలో 17 మంది ట్రాన్స్‌జెండర్స్‌ను మినహాయిస్తే.. మిగిలిన వారిలో పురుషులు 97,613 మంది ఉండగా.. స్త్రీలు 41,493 మంది ఉన్నారు. అంటే మహిళల కంటే పురుషులు రెట్టింపు సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో 30–60 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువ మంది ఉంటున్నారని ఎన్సీఆర్బీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ బలవన్మరణాలకు కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, వివాహ సంబంధిత అంశాలు, నిరుద్యోగం, ప్రేమ వ్యవహారం వంటి అనేక సమస్యలు దోహదం చేస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా బలవన్మరణాలకు పాల్పడటానికి కుటుంబ కలహాలే ఎక్కువగా దోహదం చేస్తున్నాయి. మొత్తం మృతుల్లో వివాహితులే 92,756 మంది వివాహితులే ఉన్నారు. ఈ వివాహితుల్లోనూ అత్యధికంగా 66,815 మంది పురుషులు, 25,941 మంది మహిళలు ఉన్నారు.