ఘోర ప్రమాదం
పసిడి పంటలతో అలరారే పచ్చని సీమ నెత్తుటేళ్ల ప్రవాహంతో ఎర్రబారింది. దైవదర్శనానికని బయలుదేరిన వారి బతుకులు ‘తూర్పు’ తెల్లారకుండానే తెల్లారిపోయాయి. మొక్కుబడి చెల్లించుకోకుండానే వారు మృత్యు ఒడికి చేరిపోయారు. మోడేకుర్రువద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మహిళలు మృతి చెందిన ఘటన మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
తూర్పు గోదావరి జిల్లా/ కొత్తపేట : దైవ దర్శనానికని ఎంతో ఆనందంగా పయనమైన మూడు కుటుంబాలకు చెందిన మహిళలు.. మార్గం మధ్యలో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటన తీరని విషాదాన్ని నింపింది. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఏడు వారాల మొక్కు ఎంతో ప్రాచుర్యం పొందింది. జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ప్రతి శనివారం ఈ మొక్కు చెల్లించుకొనేందుకు అక్కడకు వెళ్తుంటారు. అదేవిధంగా మండల కేంద్రమైన అల్లవరం మంచినీటి చెరువు గట్టు ప్రాంతానికి చెందిన 12 మంది మహిళలు.. మూడేళ్ల చిన్నారితో కలిసి నాలుగో వారం మొక్కు చెల్లించుకొనేందుకు వాడపల్లికి ఆటోలో బయలుదేరారు.
తెల్లవారేకొద్దీ రద్దీ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో తెల్లవారుజామునే బయలుదేరారు. తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో వారు ప్రయాణిస్తున్న ఆటో కొత్తపేట మండలం మోడేకుర్రు శివారు చిట్టూరివారిపాలెంవద్దకు చేరుకొంది. అదే సమయంలో బ్లాక్మెటల్ చిప్స్ లోడుతో రాంగ్రూటులో అతి వేగంగా దూసుకువస్తున్న ఐదు యూనిట్ల లారీ వారి ఆటోను బలంగా ఢీకొంది. అదే వేగంలో ఆ లారీ ఆటోను కొంత దూరం ఈడ్చుకుపోయింది. ఆటో నుజునుజ్జయిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో తలలకు తీవ్ర గాయాలవడంతో ఐదుగురు మహిళలు చీకట్ల నాగమణి (46), పేరాబత్తుల అనంతలక్ష్మి (36), పిల్లా గంగాభవాని (25), పులిమే అనంతలక్ష్మి (45), పిల్లా పార్వతి (48) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అదే ఆటోలో ఉన్న పిల్లా దుర్గ, పిల్లా జగదీశ్వరి, పిల్లా వీర వెంకటలక్ష్మి, పిల్లా మాణిక్యం, చీకట్ల అనంతలక్ష్మి, పిల్లా భూలక్ష్మి, గరగ శిరీషపాటు ఆటో డ్రైవర్ ఆకుల విజయభాస్కర్ తీవ్రంగా గాయపడ్డారు. మూడేళ్ల చిన్నారి పిల్లా హర్షిణి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడింది.
ప్రమాదం జరిగిన సమయంలో అటుగా వెళ్తున్నవారు సమాచారం ఇవ్వడంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకొని, క్షతగాత్రులను అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో మరో మహిళ పిల్లా దుర్గ (40) మృతి చెందింది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్, రావులపాలెం సీఐ బి.పెద్దిరాజు, కొత్తపేట ఎస్సై డి.విజయకుమార్, అదనపు ఎస్సై కేఎం జోషి, ఏఎస్సై ఎ.గరగారావు, స్టేషన్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ఆర్డీఓ వెంకటరమణ, తహసీల్దార్ ఎన్ శ్రీధర్, ఎంపీడీఓ పి.వీణాదేవి ప్రమాద స్థలంలో సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అమలాపురం డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ పర్యవేక్షణలో సీఐ పెద్దిరాజు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెల్లాచెదరైన పూజాసామగ్రి
వేంకటేశ్వరస్వామికి సమర్పించేందుకు ఆ మహిళలు ఎంతో భక్తితో పసుపు, కుంకుమ, పువ్వులు, కొబ్బరి కాయలు తదితర పూజా సామగ్రిని కూడా తీసుకువెళ్తున్నారు. మార్గం మధ్యలో జరిగిన ఘోర ప్రమాదంలో ఆ పూజాసామగ్రి మహిళల మృతదేహాల వద్ద చెల్లాచెదరుగా పడిపోవడం పలువురి హృదయాలను కలచివేసింది.
మిన్నంటిన రోదనలు
ఆరుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడకు చేరుకొని గుండెలవిసేలా రోదించారు. మృతి చెందిన పలువురు మహిళల భర్తలు రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. ‘తెల్లవారుజామునే వెళ్తే తక్కువ మంది భక్తులుంటారని, తెల్లారేకొద్దీ రద్దీ పెరిగిపోతుందన్న ఉద్దేశంతో అర్ధరాత్రి రెండు గంటలకే లేచి తయారై వెళ్లి, మేం నిద్ర లేచేసరికి వచ్చేవారు. ఈ రోజేమిటో దేవుడు ఇలా తీసుకుపోయాడు?’ అంటూ వారు తీవ్రంగా రోదించారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
గతంలోనూ ఘోరం
ప్రస్తుత దుర్ఘటన జరిగిన ప్రాంతానికి చేరువలోనే గతంలో ఘోర ప్రమాదం చోటు చేసుకొంది. 2014 జనవరిలో ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన ఒక కుటుంబ సభ్యులు రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు గ్రామానికి బారసాలకు ఆటోలో వెళ్తుండగా.. గొలకోటివారిపాలెం వంతెన వద్ద ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీకొంది. నాడు జరిగిన ఆ ప్రమాదంలో ఏకంగా 11 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దాదాపు అదే ప్రాంతంలో జరిగిన ఆటో ప్రమాదం పలువురిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో ఓ చిన్నారి సురక్షితంగా బయటపడగా, అప్పట్లో జరిగిన ప్రమాదంలో కూడా ఒక బాబు ప్రాణాలతో బయటపడడం గమనార్హం.