Womens labor
-
మహిళా కూలీలకు రక్షణేది?
లింగాల: ఉన్న ఊరిలో ఉపాధి లేక పొట్టచేతబట్టుకొని హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వలసవెళ్లిన మహిళా కూలీలకు రక్షణ లేకుండాపోయింది. పనిప్రదేశంలో వారు అఘాయిత్యాలకు గురవుతున్నారు. గుంపుమేస్త్రీల లాభాపేక్షకు వారు బలవుతున్నారు. వెలుగుచూసినవి కొన్నే అయినా బయటికి తెలియని ఎన్నో దారుణాలు ఉన్నాయి. తాజాగా లింగాల మండలానికి చెందిన ఓ గిరిజన మహిళ(21)పై హైదరాబాద్‌లో దుండగులు గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడడం సంచలనం రేకెత్తించింది. తన భర్తతో కలిసి ఉపాధి కోసం నగరానికి వె ళ్లింది. పనికి వెళ్తున్న ఆమెను హైదరాబాద్- వరంగల్ హైవేకు సమీపంలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి నారపల్లిని ఆనుకొని ఉన్న అటవీప్రాంతానికి తీసుకెళ్లి ఐదుగురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. తనపై జరిగిన దారుణాన్ని భర్త, మరిది సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2013 ఆగస్టు 3న మండల పరిధిలోని కొత్తచెర్వుతండాకు చెందిన ఓ గిరిజన వివాహిత మహిళ సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురంలో ఇంటి వద్ద ఉండగానే అత్యాచారానికి గురైంది. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ సంఘటన మరువకముందే సోమవారం రాత్రి లింగాలకు చెందిన ఓ వివాహిత సామూహిక అత్యాచానికి గురికావడం ఈ ప్రాంతంలోని వలసకూలీలను భయాందోళనకు గురిచేసింది. మం డలం నుంచి జీవనోపాధికి వందల కుటుంబాలు హైదరాబాద్‌కు వెళ్తున్నా యి. పనిచేసే చోట ప్రమాదాలకు గురవడం, అత్యాచారాలకు బలవుతుండడం వలసకూలీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దుండగులను శిక్షించాలి అచ్చంపేట టౌన్: లింగాలకు చెందిన గిరిజన మహిళా వలసకూలీపై హైదరాబాద్‌లో దారుణానికి ఒడిగట్టిన దుండగులను శిక్షించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీ జీవీపీ జిల్లా ఇన్చార్జి విజయరామరాజు మాట్లాడుతూ..దుండగులను గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థినులు, మహిళలపై అరాచకాలు జరుగుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. బస్టాండ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీస్ పికెట్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు శ్రీనునాయక్, గౌస్, గౌతం, రాధాకృష్ణ, వెంకటేష్ పాల్గొన్నారు. -
పొట్టకూటికోసం వచ్చి..మృత్యువాత
ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మహిళా కూలీల మృతి పలువురికి గాయాలు శోకసంద్రంలో బత్తులవారిగూడెం రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో వీడని విషాదం అలముకుంది. కూలి పనుల కోసం వచ్చినవారిలో ఇద్దరు మహిళలతో పాటు ఇంటర్ విద్యార్థిని మృతిచెందటంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి స్వగ్రామమైన బత్తులవారిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గన్నవరం, న్యూస్‌లైన్ : పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చిన ముగ్గురు మహిళా కూలీల నిండు ప్రాణాలు ట్రాక్టర్ ప్రమాదంలో గాలిలో కలిసిపోయాయి. మామిడి కాయలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి గోతిలోకి బోల్తా కొట్టడంతో ఈ ఘటన జరిగింది. మండలంలోని కొండపావులూరు గ్రామసమీపంలో బుధవారం జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామానికి చెందిన 23 మంది కూలీలు మామిడికోతల పనుల నిమిత్తం రెండు రోజులుగా మండలంలోని కొండపావులూరు గ్రామ సమీపంలోని వెంకట తిరుమల కృష్ణారావు తోటలోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నున్న మామిడి మార్కెట్‌కు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌పై సూరంపల్లి వరకు వెళ్లేందుకు ఎక్కారు. కొంతమంది లోడుపై ఎక్కగా, మరికొంతమంది ట్రాక్టర్ ఇంజన్ భాగంలో కూర్చున్నారు. ట్రాక్టర్ తోటలో నుంచి కొంతదూరం వెళ్లిన తర్వాత ఎత్తుగా ఉన్న గట్టు ఎక్కించే క్రమంలో డ్రైవర్ గంగుల బుడ్డయ్య తడబడ్డాడు. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి గట్టుపై నుంచి ఒక్కసారిగా వెనక్కి జారిపోయి ట్రక్కుతో సహా పక్కనే ఉన్న గోతిలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇంజిన్ భాగంలో కూర్చున్న బత్తుల కాసులు (34) తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ట్రక్కుపై ఉన్న కొంతమంది కూలీ లు కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. మిన్నంటిన హాహాకారాలు... ఈ ప్రమాదంలో మరికొంత మంది కూలీలు ట్రాక్టర్ లోడు సహా గోతిలోకి పడిపోయారు. దీంతో రక్షించమంటూ హాహాకారాలు చేశారు. కిందకు దూకిన కూలీలు షాక్ నుంచి తేరుకుని ట్రక్కులో చిక్కుకున్న కూలీలను బయటకు లాగే ప్రయత్నం చేశారు. లోడు కింద చిక్కుకున్న చెన్ను కుమారి, చెన్ను సునీత లను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికి సాధ్యం కాలేదు. విషయం తెలుసుకున్న కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో వారి సహాయంతో తిరగబడిన ట్రక్కును పైకి లేపారు. మామిడికాయల మధ్య చిక్కుకుని కుమారి, సునీతలు ఊపిరాడక అప్పటికే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన తిరుపతమ్మ (45), మురళీ (40)లను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. విషాదఛాయలు... తల్లిదండ్రులకు సహాయపడేందుకు వేసవి సెలవుల్లో బంధువులతో కలిసి మామిడికోత పనులకు వచ్చిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేసుకున్న సునీత మృత్యువాతకు గురవడం అందరినీ కలచివేసింది. సమాచారం తెలుసుకున్న ఆమె తండ్రి వెంకటేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని విగతజీవిగా ఉన్న కుమార్తెను భోరున విలపించారు. మృతి చెందిన కాసులు, కుమారి కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బత్తులవారిగూడెంలో విషాదఛాయలు నూజివీడు రూరల్ : ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు మహిళల స్వగ్రామమైన నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో విషాదఛాయలు అలముకున్నాయి. పేద కుటుంబాలకు చెందిన వీరు కూలి పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతుండగా ట్రాక్టర్ ప్రమాదం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మృతిచెందిన బత్తుల వడ్డీకాసులుకు భర్త సాంబశివరావుతో పాటు ఇద్దరు పిల్లలు, చెన్ను కుమారికి భర్త నాగేశ్వరరావుతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెన్ను సునీత పట్టణంలోని ఒక కాలేజీలో ఇంటర్ చదువుతూ సెలవులు కావడంతో మామిడి కోతలకు వెళుతోంది.