పొట్టకూటికోసం వచ్చి..మృత్యువాత | Tractor over and killed three women workers | Sakshi
Sakshi News home page

పొట్టకూటికోసం వచ్చి..మృత్యువాత

Published Thu, May 29 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:59 AM

పొట్టకూటికోసం వచ్చి..మృత్యువాత

పొట్టకూటికోసం వచ్చి..మృత్యువాత

  • ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మహిళా కూలీల మృతి
  •  పలువురికి గాయాలు
  •  శోకసంద్రంలో బత్తులవారిగూడెం
  •  రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబాల్లో వీడని విషాదం అలముకుంది. కూలి పనుల కోసం వచ్చినవారిలో ఇద్దరు మహిళలతో పాటు ఇంటర్ విద్యార్థిని మృతిచెందటంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి స్వగ్రామమైన బత్తులవారిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
     
    గన్నవరం, న్యూస్‌లైన్ : పొట్టకూటి కోసం కూలి పనులకు వచ్చిన ముగ్గురు మహిళా కూలీల నిండు ప్రాణాలు ట్రాక్టర్ ప్రమాదంలో గాలిలో కలిసిపోయాయి. మామిడి కాయలతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి గోతిలోకి బోల్తా కొట్టడంతో ఈ ఘటన జరిగింది. మండలంలోని కొండపావులూరు గ్రామసమీపంలో బుధవారం జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

    నూజివీడు మండలం బత్తులవారిగూడెం గ్రామానికి చెందిన 23 మంది కూలీలు మామిడికోతల పనుల నిమిత్తం రెండు రోజులుగా మండలంలోని కొండపావులూరు గ్రామ సమీపంలోని వెంకట తిరుమల కృష్ణారావు తోటలోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నున్న మామిడి మార్కెట్‌కు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌పై సూరంపల్లి వరకు వెళ్లేందుకు ఎక్కారు. కొంతమంది లోడుపై ఎక్కగా, మరికొంతమంది ట్రాక్టర్ ఇంజన్ భాగంలో కూర్చున్నారు.

    ట్రాక్టర్ తోటలో నుంచి కొంతదూరం వెళ్లిన తర్వాత ఎత్తుగా ఉన్న గట్టు ఎక్కించే క్రమంలో డ్రైవర్ గంగుల బుడ్డయ్య తడబడ్డాడు. దీంతో ట్రాక్టర్ అదుపుతప్పి గట్టుపై నుంచి ఒక్కసారిగా వెనక్కి జారిపోయి ట్రక్కుతో సహా పక్కనే ఉన్న గోతిలోకి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇంజిన్ భాగంలో కూర్చున్న బత్తుల కాసులు (34) తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ట్రక్కుపై ఉన్న కొంతమంది కూలీ లు కిందకు దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు.
     
    మిన్నంటిన హాహాకారాలు...

    ఈ ప్రమాదంలో మరికొంత మంది కూలీలు ట్రాక్టర్ లోడు సహా గోతిలోకి పడిపోయారు. దీంతో రక్షించమంటూ హాహాకారాలు చేశారు. కిందకు దూకిన కూలీలు షాక్ నుంచి తేరుకుని ట్రక్కులో చిక్కుకున్న కూలీలను బయటకు లాగే ప్రయత్నం చేశారు. లోడు కింద చిక్కుకున్న చెన్ను కుమారి, చెన్ను సునీత లను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికి సాధ్యం కాలేదు. విషయం తెలుసుకున్న కొంతమంది గ్రామస్తులు అక్కడికి చేరుకోవడంతో వారి సహాయంతో తిరగబడిన ట్రక్కును పైకి లేపారు. మామిడికాయల మధ్య చిక్కుకుని కుమారి, సునీతలు ఊపిరాడక అప్పటికే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన తిరుపతమ్మ (45), మురళీ (40)లను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద అనంతరం డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
     
    విషాదఛాయలు...

    తల్లిదండ్రులకు సహాయపడేందుకు వేసవి సెలవుల్లో బంధువులతో కలిసి మామిడికోత పనులకు వచ్చిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పూర్తిచేసుకున్న సునీత మృత్యువాతకు గురవడం అందరినీ కలచివేసింది. సమాచారం తెలుసుకున్న ఆమె తండ్రి వెంకటేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని విగతజీవిగా ఉన్న కుమార్తెను భోరున విలపించారు. మృతి చెందిన కాసులు, కుమారి కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
     
    బత్తులవారిగూడెంలో విషాదఛాయలు

    నూజివీడు రూరల్ : ట్రాక్టర్ ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు మహిళల స్వగ్రామమైన నూజివీడు మండలం బత్తులవారిగూడెంలో విషాదఛాయలు అలముకున్నాయి. పేద కుటుంబాలకు చెందిన వీరు కూలి పనులు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతుండగా ట్రాక్టర్ ప్రమాదం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మృతిచెందిన బత్తుల వడ్డీకాసులుకు భర్త సాంబశివరావుతో పాటు ఇద్దరు పిల్లలు, చెన్ను కుమారికి భర్త నాగేశ్వరరావుతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెన్ను సునీత పట్టణంలోని ఒక కాలేజీలో ఇంటర్ చదువుతూ సెలవులు కావడంతో మామిడి కోతలకు వెళుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement