పందెం కోళ్లను ఈతకు తీసుకెళ్లి..తండ్రీ, ఇద్దరు కొడుకులు మృతి | Father and two sons died | Sakshi
Sakshi News home page

పందెం కోళ్లను ఈతకు తీసుకెళ్లి..తండ్రీ, ఇద్దరు కొడుకులు మృతి

Published Thu, Oct 10 2024 5:24 AM | Last Updated on Thu, Oct 10 2024 5:24 AM

Father and two sons died

పోలవరం కుడికాలువలో దుర్ఘటన

ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంటలో విషాదం

పెదవేగి : పందెం కోళ్ల పెంపకం సరదా ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వాటికి ఈతలో శిక్షణ­ను ఇద్దామనుకున్న ఆ తండ్రీ కొడుకులు ప్ర­మా­ద­వశాత్తూ కాల్వలో మునిగి ప్రాణాలు కోల్పో­యారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంటలో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

పోలీసుల కథ­నం ప్రకారం.. కవ్వగుంట గ్రామానికి చెందిన శెట్టిప­ల్లి వెంకటేశ్వరరావు (45) రైతు. సంక్రాంతికి ఏలూరు జిల్లా కోడిపందేలకు ప్రసిద్ధి. దీంతో వెంకటేశ్వరరావు తన పందెం కోళ్లను తన వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్నాడు. వాటికి శిక్షణలో భాగంగా ఈతకూ తీసుకెళ్తుంటారు. దీంతో తమకు సమీ­పంలో ఉన్న పోలవరం కుడికాలువలో ఈత శిక్షణ ఇచ్చేందుకు వాటిని తీసుకువెళ్లాడు. వెంకటేశ్వర­రావుతోపాటుగా అతని ఇద్దరు కుమారులు శెట్టిపల్లి మణికంఠ (16), శెట్టిపల్లి సాయి (14)లు సైతం తోడుగా వెళ్లారు. 

కాలువలో లోతును గ్రహించని ముగ్గురూ కాలువలో ఉన్నపళంగా మునిగిపో­యారు. ఈత రాకపోవడంతో వారు ముగ్గురూ ప్రా­ణా­లు కోల్పోయారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకునేలోపే వారు మృతిచెందారు. సీఐ వెంక­టేశ్వరరావు, ఎస్సై రాజేంద్రప్రసాద్‌ ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందం, స్థానికుల సాయం మృతదేహాలను వెలికితీ­శారు. 

పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వా­సుపత్రికి తరలించారు. పండగ సమయంలో ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకు­న్నాయి. భర్త, ఇద్దరు కుమారులు విగత జీవులుగా కళ్లముందు కనిపించడంతో భార్య దేవి, ఇతర కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement