Pandem kollu
-
పందెం కోళ్లను ఈతకు తీసుకెళ్లి..తండ్రీ, ఇద్దరు కొడుకులు మృతి
పెదవేగి : పందెం కోళ్ల పెంపకం సరదా ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. వాటికి ఈతలో శిక్షణను ఇద్దామనుకున్న ఆ తండ్రీ కొడుకులు ప్రమాదవశాత్తూ కాల్వలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవ్వగుంటలో చోటుచేసుకున్న ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. కవ్వగుంట గ్రామానికి చెందిన శెట్టిపల్లి వెంకటేశ్వరరావు (45) రైతు. సంక్రాంతికి ఏలూరు జిల్లా కోడిపందేలకు ప్రసిద్ధి. దీంతో వెంకటేశ్వరరావు తన పందెం కోళ్లను తన వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్నాడు. వాటికి శిక్షణలో భాగంగా ఈతకూ తీసుకెళ్తుంటారు. దీంతో తమకు సమీపంలో ఉన్న పోలవరం కుడికాలువలో ఈత శిక్షణ ఇచ్చేందుకు వాటిని తీసుకువెళ్లాడు. వెంకటేశ్వరరావుతోపాటుగా అతని ఇద్దరు కుమారులు శెట్టిపల్లి మణికంఠ (16), శెట్టిపల్లి సాయి (14)లు సైతం తోడుగా వెళ్లారు. కాలువలో లోతును గ్రహించని ముగ్గురూ కాలువలో ఉన్నపళంగా మునిగిపోయారు. ఈత రాకపోవడంతో వారు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకునేలోపే వారు మృతిచెందారు. సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై రాజేంద్రప్రసాద్ ఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ బృందం, స్థానికుల సాయం మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పండగ సమయంలో ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులు చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త, ఇద్దరు కుమారులు విగత జీవులుగా కళ్లముందు కనిపించడంతో భార్య దేవి, ఇతర కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. -
సంక్రాంతికి సింహపురి ‘కోడ’ల్లుళ్లు
సాక్షి, భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): సంక్రాంతి కోడి పందేలకు గోదావరి జిల్లాల్లో ఉండే క్రేజే వేరు. పందెం పుంజులకూ డిమాండ్ భారీగానే ఉంటుంది. సాధారణంగా సంక్రాంతి పందేల కోసం స్థానికులే పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తుంటారు. కాగా.. కోవిడ్ తరువాత సింహపురి (నెల్లూరు) ప్రాంత వ్యాపారులు పందెం పుంజులను గోదావరి జిల్లాలకు తెచ్చి అమ్మకాలు చేస్తున్నారు. పండుగ రోజుల్లో పూర్వ గోదావరి జిల్లాల్లోని ప్రధాన బరుల్లో ఒక్కొక్క చోట రోజుకు 25 నుంచి 30 వరకు పందేలు జరిగితే.. గ్రామాల్లోని చిన్న బరుల్లో జరిగే పందేలకు లెక్కే ఉండదు. పండుగ మూడు రోజుల్లో వేలాదిగా జరిగే పందేలకు రెట్టింపు సంఖ్యలో కోడి పుంజులు అవసరమవుతాయి. సంక్రాంతి పందేల కోసం కోడి పుంజుల పెంపకం ద్వారా గోదావరి జిల్లాల్లో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. వీటి అమ్మకాల రూపంలో ఏటా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి మరీ.. కోవిడ్ అనంతరం సింహపురి ప్రాంతానికి చెందిన వారు పందెం పుంజుల పెంపంకంపై ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లూరు జిల్లాతోపాటు సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన నాటుకోళ్ల పెంపకందారులు, వ్యాపారులు గోదావరి జిల్లాల్లో అమ్మకాలు చేసేందుకు కోడి పుంజులతో తరలివస్తున్నారు. ఒక్కొక్కరు 20 వరకు పుంజులతో.. నలుగురైదుగురు కలిసి ప్రత్యేక వాహనాల్లో వస్తున్నారు. విజయవాడ–కాకినాడ హైవే వెంట తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం, పెరవలి, సిద్ధాంతం, గుండుగొలను తదితర ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా ఉండే రద్దీ రోడ్లలో ఖాళీ ప్రదేశాల వద్ద కోడి పుంజులను ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, సేతువ తదితర జాతులు, వివిధ రంగుల్లో వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. పుంజు రంగు, ఎత్తు, బరువును బట్టి ఒక్కో పుంజు రూ.3 వేల నుంచి రూ.10 వేల ధర పలుకుతున్నాయి. రోజుకో చోట విక్రయం స్థానికంగా పందేల కోసం సిద్ధం చేసే పుంజుల ధర అధికంగా ఉంటోంది. వాటికి అందించే ఆహారం, శిక్షణను బట్టి ఒక్కొక్క పుంజు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతాయి. నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి తెచ్చే పుంజులు ఇక్కడి పుంజులకు ఏమాత్రం తీసిపోని విధంగా మంచి సైజు, రంగుల్లో ఉంటున్నాయి. ఇక్కడ పెంచే పుంజులతో పోలిస్తే నెల్లూరు ప్రాంత పుంజుల ధర తక్కువగా ఉండటంతో పందేల రాయుళ్లు వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. పుంజుల్ని అమ్ముతున్న చోటే డింకీ పందాలు కట్టి బాగున్న పుంజులను ఎంపిక చేసుకుని తీసుకుంటున్నారు. పందెంలో అదృష్టం కలిసొస్తే తమకు పెద్ద పండుగేనంటున్నారు. తెచ్చిన పుంజులు మూడు నాలుగు రోజుల్లో అమ్ముడవుతున్నాయని.. ఒక్కోరోజు ఒక్కోచోట అమ్మకాలు చేస్తుంటామని నెల్లూరుకు చెందిన కోళ్ల పెంపకందారుడు వెంకటరమణ తెలిపాడు. నాలుగేళ్లుగా ఏటా వస్తున్నామని, అమ్మకాలు బాగానే ఉంటున్నాయని వివరించాడు. హోటళ్లు.. లాడ్జిలకు డిమాండ్ కోళ్ల కుంభమేళాగా పిలిచే సంక్రాంతి పందేలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని హోటళ్లు, లాడ్జిలకు డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది నవంబర్ నెల నుంచి హోటల్స్, లాడ్జి రూమ్‌ల ముందస్తు బుకింగ్ ముమ్మరంగా సాగుతోంది. బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, ఏపీలోని విశాఖ, విజయవాడతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్దఎత్తున పందేలరాయుళ్లు, పందేలను వీక్షించేందుకు వివిధ వర్గాల ప్రజలు ఇక్కడకు తరలి వస్తుంటారు. దీంతో అతిథుల కోసం ఈ ప్రాంతాల వారు జిల్లాలోని హోటల్స్‌లో బస ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దృష్ట్యా సాధారణ లాడ్జిలతోపాటు పేరొందిన హోటల్స్‌లో రూమ్‌లను జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు అడ్వాన్స్‌గా బుక్ చేస్తున్నారు. జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం పట్టణాలతో పాటు ఆచంట, పెనుగొండ, అత్తిలి తదితర ప్రాంతాల్లోని హోటల్స్, లాడ్జిలలో ఇప్పటికే 70 శాతం రూమ్‌లు బుక్ అయ్యాయి. మరో వారం రోజులు గడిస్తే రూమ్‌లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. రూమ్ రూ.5 వేల నుంచి రూ.10 వేలు సంక్రాంతికి అడ్వాన్స్‌గా బుక్ చేసే హోటల్స్ రూమ్‌ల ధరలు ఆయా హోటల్స్ బట్టి 24 గంటలకు రూ.5 వేల నుంచి డిమాండ్ బట్టి రూ.10 వేల వరకు ఉంటోంది. ధర ఎక్కువైనా రూమ్ కచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ముందస్తుగానే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం బుక్ చేసుకుంటున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు దిగే డీలక్స్, సూట్ రూమ్‌లకు సైతం డిమాండ్ భారీగా పెరిగింది. పండుగ నాలుగు రోజుల ప్యాకేజీ రూపంలో అయితే రూమ్‌ను బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటోంది. 24 గంటలకు అయితే రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలుకుతున్నాయి. -
పందెం కోళ్ళు...సంక్రాంతి ప్రత్యేకం
-
పుంజు భళా.. మటన్ కీమా, గుడ్డు, బాదం, ఆయుర్వేద స్నానం.. కనులారా చూడాల్సిందే..
అదో మామిడి తోట..అక్కడ ఎన్నో వింతలు..విశేషాలు.. అక్కడికి వెళితే తిరిగి వెనక్కి రావాలనిపించదు. లోపలకు అడుగు పెట్టగానే రంగు రంగుల, రకరకాల కోళ్లు దర్శనమిస్తాయి. ఇక లోపలకు వెళితే కొక్కొరోకో కూతలు...ఒకటా, రెండా వందల సంఖ్యలో కోడి పుంజులు, పెట్టలతో ఆహ్లాదకరమైన వాతావరణంలోకి అడుగుపెట్టినట్టు అనుభూతి కలుగుతుంది. అది చెబితే తనివి తీరదు. ఆ ఆనందాన్ని కనులారా చూడాల్సిందే.. అక్కడి ప్రత్యేకతలు చెవులారా వినాల్సిందే. ఒంగోలు నగరానికి కూత వేటు దూరంలో యరజర్ల గ్రామం. 4 ఎకరాల్లో కోళ్ల ఫాం ఉంది. ఇక్కడ కోళ్ల పెంపకంలో ప్రత్యేకత ఉంది. మామిడి తోటలో ఉన్న ఈ వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. విభిన్న జాతి రకాల కోళ్లు, కోడి పుంజులను చిన్న పిల్లల్లా వీటిని కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతున్నారు. వీటికి ప్రత్యేక గదులు. దుప్పట్లు.. దోమ తెరలు ఏర్పాటు చేశారు. వీటికి ఆయుర్వేద వనమూలికతో ప్రత్యేక స్నానం. మటన్ కీమా, బాదం, పిస్తా, తేనె, అంజూర్.. ఇలా బలవర్ధకమైన ఆహారం. అనారోగ్యం పాలవకుండా మందులు.. ఇంకా ఎన్నో.. వీటిని సంరక్షించేందుకు నిత్యం పది మంది పనివారు. ఇక్కడ విదేశాల నుంచి తీసుకువచ్చిన కోళ్లు కూడా సందడి చేస్తాయి. ఎన్నో ఆసక్తి కలిగించే విషయాలు, విశేషాలు తెలుసుకుందామా మరి.. యరజర్లకు చెందిన టి.శ్రీనివాసరావు కోడి పుంజుల ఫాంను ఏర్పాటు చేశారు. ఇక్కడ పుంజులకు, బ్రీడర్లకు ప్రత్యేకంగా ఫాంలను ఏర్పాటు చేసి మరీ నిర్వహిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, కృష్ణా జిల్లా నున్నలోనూ పెంపకం కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనంతరం రెండేళ్లుగా స్వగ్రామం యరజర్లలోని తన మామిడి తోటను కోడి పుంజుల ఉత్పత్తి కేంద్రంగా మార్చేశారు. కుక్కుట శాస్త్రంలోనూ లేని విధంగా.. ఎన్నో మెళకువలు గుడ్డు పెట్టించటం మొదలుకొని పొదిగి పిల్ల తయారు, వాటి పెంపకం ...అన్ని దశల్లోనూ ఎన్నో మెళకువలు. వాటికి బలవర్ధకమైన ఆహారం ఇవ్వటం దగ్గర నుంచి ఆరోగ్య పరిరక్షణ వరకూ ఎన్నో జాగ్రత్తలు అన్నీ...ఇన్నీ కావు స్పెషల్ మెనూ... ఇక్కడ కోడి పుంజులకూ బలవర్ధకమైన మెనూ ఉందండీ. బాదం, ఖర్జూరం, అంజూర్, యాలుకలు, రసగుల్లాలు, రంగు రంగుల ద్రాక్షలు, కిస్ మిస్, నాటుకోడి గుడ్డు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉంది.. వాటికి పరగడపున మొదలుకొని సాయంత్రం వరకు మెనూ సమయాన్ని పాటిస్తారు. ప్రతి రోజూ 30 గ్రాముల లడ్డూ... ప్రతి రోజూ ఒక్కో పుంజుకు ఉదయం 30 గ్రాముల లడ్డూ పెడతారు. బాదం, పిస్తా, అంజూర్, ఖర్జూరం, రెండు మూడు రకాల ఎండు ద్రాక్ష, సొంటి, సోంపు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, యాలుక్కాయలు, రసగుల్లలు, పిట్ట దంట్లు వీటన్నింటినీ కలిపి పచ్చడి బండపై రుబ్బు రోలుతో కచ్చపచ్చాగా నూరి సమపాళ్లలో తేనె వేసి లడ్డూలుగా తయారు చేస్తారు. ప్రతి రోజు ఉదయాన్నే 30 గ్రాముల చొప్పున ఒక్కో పుంజుకు తినిపిస్తారు. ఆ తరువాత ఉదయం 10 గంటల లోపు ఉడకబెట్టిన నాటుకోడి గుడ్డు ఇస్తారు. తర్వాత 30 గ్రాముల మటన్ కీమా.. ► మధ్యాహ్నం ఒక్కో పుంజుకు నానబెట్టిన 8 బాదం పప్పు. వాటితో పాటు ఎండు ద్రాక్షలు, కిస్మిస్ ఒక్కోదానికి 10, ఆవుపాలలో నాన బెట్టిన అంజూర్ను తినిపిస్తారు. ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్‌ను కూడా.. ► సాయంత్రం ధాన్యం, రాగులు, సజ్జలు, చిలకడ గుండ్లు, పిట్టగుండ్లు లాంటి వాటిని సరిపడా ఇస్తారు. కొత్త జాతులు... ఇతర దేశాల జాతులతో సంపర్కం ఇక్కడ రకరకాల కొత్త కోడి పుంజు జాతులను రూపొందిస్తున్నారు. భీమవరం కోడి పెట్ట జాతితో అరేబియా జాతి, ఆఫ్రికా జాతి, ఈము జాతి కోళ్లను సంపర్కం చేయించి మరీ కొత్త రకం జాతులను ఉత్పత్తి చేస్తున్నారు. ► అరేబియా జాతికి చెందిన పెట్టను రూ.70 వేలు వెచ్చించి మరీ ఇక్కడకు తెప్పించారు. ► రూ.3 లక్షల విలువచేసే భీమవరం జాతికి చెందిన సీతువా బ్రీడర్తో కూడా పిల్లల ఉత్పత్తి. ► ఈము పక్షితో భీమవరం జాతి బ్రీడర్‌ను సంక్రమింపజేసి కొత్త రకం జాతి ఉత్పత్తి చేశారు. ► ఆఫ్రికా రకం కోడి కాకి జాతి బ్రీడర్ పుంజుతో మరో రకం ఉత్పత్తి. ► అరేబియా జాతి మైల రకం కోడి ఉంది. ► తెల్ల కొక్కెర పెట్టతో ఇతర జాతుల ఉత్పత్తి ► ఇతర దేశాల జాతి పెట్టలతో దేశీరకం జాతులతో సంపర్కం చేయించి మరీ చురుకైన జాతులను ఉత్పత్తి చేస్తున్నారు. ఆయుర్వేద మూలికలతో చేసిన నీళ్లు మూడు నెలలకొకసారి ఆయుర్వేద స్నానం కోడి పుంజుగా మూడు నెలల వయస్సు వచ్చే సరికి మొదటి ఆయుర్వేద స్నానం ప్రారంభిస్తారు. సాధారణంగా కోళ్లను నీటిలో వదలటం, ఈత కొట్టించటం సర్వసాధారణం. వాటితో పాటు శరీరం గట్టి పడటానికి, శరీరంలోని వృథా నీరు బయటకు పోవటానికి, ఉన్న కొవ్వు కరిగిపోవటానికి, శరీరం ‘‘వజ్రకాయం’’ కావటానికి దోహదపడేలా వాటిని తీర్చిదిద్దుతారు. అందుకే ఆయుర్వేద స్నానంతో పాటు స్టీమ్ బాత్ చేయిస్తారు. తొలుత 50 లీటర్ల నీటిని తీసుకోవాలి. ఆ నీటిలో వెదురు ఆకు, వాయల ఆకు, నల్లతుమ్మ చెక్క, విప్ప పువ్వు, మోదుగు పువ్వు, పచ్చి పసుపు కొమ్ములు, మిరియాలు, స్ఫటిక, వాము, జాజికాయ, జాపత్రి, పచ్చ కర్పూరం కలిపి నీటిలో ఉడకబెట్టాలి. ఆ నీటిని 25 లీటర్ల వరకు వచ్చేలా మరిగించాలి. ఆ తరువాత కొంచెం చల్లనీళ్లలో కలిపి నులివెచ్చగా నీటిని తయారు చేసి ఆ నీటిలో పుంజును మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఆ నీటిలో ముంచిన గోనె సంచులను పిండి.. కింద ఒకటి, పైన ఒకటి గోనె సంచులు ఉంచి స్ట్రీమ్ బాత్లాగా వాటిని అందులో ఉంచాలి. ఆ పొగల్లో నుంచి పుంజు శరీరంలోని వృథా నీరు కాస్తా బయటకు వెళ్లిపోతాయి. అరగంట సేపు ఆదమరిచి ఆ పుంజులు సొమ్మసిల్లుతాయి. అరగంట తరువాత ఆ గోనె సంచుల నుంచి వాటిని విడదీసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో ఉంచాలి. ఈ విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆయుర్వేద స్నానం చేయిస్తారు. ఆ తరువాత మూడో రోజు షాంపూలతో స్నానం చేయించటం ఇలా ఎన్నో జాగ్రత్తలు. దీనిద్వారా శరీరంలో ఉన్న రుగ్మతలు కూడా దరిచేరవు. ఆరు నెలలపాటు ప్రత్యేక ర్యాక్‌లలో పెంచుతారు. వీటి కోసం ప్రత్యేక బెడ్లు, దోమ తెరలు ఉంటాయి. ప్రత్యేకంగా తీసుకొచ్చిన గంపలో వీటిని ఉంచి కంటికి రెప్పలాగా కాపాడుతారు. అనారోగ్యం పాలవకుండా మందులు ఇస్తారు. ప్రత్యేక టానిక్‌లు కూడా వేస్తుంటారు. అంతేకాదండోయ్ ప్రతి చెట్టుకూ సీసీ కెమెరాలు కూడా అమర్చారు. ఆసక్తితోనే పెంపకం.. కోళ్లపై చిన్ననాటి నుంచి ఉన్న ఆసక్తితోనే వీటిని పెంచుతున్నాను. వీటికి ఖరీదైన పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా నిత్యం జాగ్రత్తలు తీసుకుంటాం. పుంజులు, పెట్టలను విడివిడిగా ప్రత్యేక గదుల్లో ఉంచుతాం. విదేశాల నుంచి అరుదైన జాతులను తీసుకువచ్చి క్రాస్ బీడింగ్ చేస్తున్నాం. పాముల నుంచి రక్షించేందుకు ప్రత్యేకంగా వలలను కూడా ఏర్పాటు చేశాం. – టీ శ్రీనివాసరావు, యర్లజర్ల - పట్నాల రవిచంద్ర, ఒంగోలు డెస్క్ ఫోటోలు: ఎం ప్రసాద్ -
ఒరేయ్ ఈరిగా.. నా నెమలి నాలుగు పందేలు చేసిందిరా
సాక్షి, కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లాలో సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. కోడి పందేలరాయుళ్ల హడావుడి ప్రారంభమైంది. ఏ రంగుపై ఏ రంగు వదలాలి, ఏది గెలుస్తుంది, ఏది ఓడిపోతుందనే కబుర్లు మొదలయ్యాయి. ఒరేయ్ ఈరిగా... పోయిన పండక్కి నా నెమలి నాలుగు పందేలు చేసిందిరా అంటే... నీ నెమలి నాలుగు పందేలే చేసింది... నా కక్కిరి అయితే నీచు తగలకుండా సంపేసిందిరా సూరిగా అంటూ పందెంరాయుళ్లు మాట్లాడుకోవటం మొదలుపెట్టేశారు. ఇదిలా ఉండగా వచ్చే పండుగను దృష్టిలో పెట్టుకుని పందెంరాయుళ్లు పుంజుల కోసం జల్లెడ పడుతున్నారు. చిన్న చిన్న పందెంగాళ్లు సండే మార్కెట్లోకి వచ్చే పుంజులను బేరసారాలు చేసి కొనుక్కుంటుండగా పెద్ద పందెగాళ్లు కోడి రంగు, వాటం, వాటి చూపును చూసి కొనుగోలు చేస్తున్నారు. కోడికూత వినబడితే చాలు చటుక్కున ఆగి కోళ్ల యజమానితో బేరసారాలు మొదలెడుతున్నారు. రంగును బట్టి ధర నిర్ణయించి డబ్బులు విరజిమ్ముతున్నారు. పుంజు వాటంతో పాటు రంగు రూపు నచ్చితే ధర ఎంతైనా కొనేందుకు వెనుకాడటంలేదు. పందేనికి సిద్ధం చేసేందుకు రకరకాల మేతలను తయారుచేసి పుంజుల శరీరాన్ని జిమ్ బాడీల్లా సిద్ధం చేసేందుకు పూనుకుంటున్నారు. రంగును బట్టి పందెంకోళ్లకు గిరాకీ ఉండటంతో పెంపకందారులు ఈ సీజనులో కాసులు పోగుజేసుకుంటున్నారు. కాకి, పచ్చకాకి, డేగ, కాకిడేగ, నెమలి, సీతువా, కక్కిరి, పింగళా ఇలా రంగులను బట్టి ఒక్కో పందెం కోడి ధర సుమారు రూ.5 వేలు, ఇవే రంగుల్లో జాతికోళ్లు అయితే రూ.15 వేల నుంచి మొదలై లక్షల్లో పలుకుతున్నాయి. అయితే రంగు నచ్చి కోడి మీద పందెంరాయుళ్లకు మోజు పుడితే చాలు ధర ఎంతైనా చెల్లించి పుంజును పట్టుకుపోతున్నారు. యుద్ధానికి సిద్ధమవుతున్న పందెంకోళ్లు పండుగ సమీపిస్తుండటంతో పందెంరాయుళ్లు పందెం కోళ్లను యుద్ధానికి సిద్ధమయ్యే సైనికుల్లా తయారు చేస్తున్నారు. పందెంరాయుళ్లు పెడుతున్న పుష్టికరమైన తిండి తింటూ పందెం కోళ్లు బరిలోకి దిగేందుకు సై అంటే సై అంటూ సిద్ధమవుతున్నాయి. కత్తి కట్టేందుకు కాలు దువ్వుతున్నాయి. ఇప్పటివరకు తవుడు ముద్దలు, ఒడ్డు, సోళ్లు వంటి వాటిని ఆహారంగా అందించిన పందెంరాయుళ్లు పండుగ దగ్గర పడటంతో పుంజులను మరింత బలంగా పెంచేందుకు జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా వంటి ఖరీదైన ఆహారాన్ని అందిస్తూ కోళ్లను మేపుతున్నారు. -
పందెం కోడి రూ.30 వేలు.. 31 కోళ్లకు రూ.4.46 లక్షల ఆదాయం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థావరంలో స్వాధీనం చేసుకున్న పందెం కోళ్లకు శనివారం సంగారెడ్డిలోని ఎక్సైజ్ కోర్టు వేలం పాట నిర్వహించింది. ఇందులో అత్యధికంగా ఓ పందెం కోడి రూ.30 వేలు పలికింది. మొత్తం 31 కోళ్లకు రూ.4.46 లక్షల ఆదాయం లభించింది. 46 మంది వేలంపాటలో పాల్గొన్నారు. చింతమనేని ప్రభాకర్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిన్న కంజర్ల గ్రామ శివారులో ఓ ఫాంహౌస్‌లో పెద్ద ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఈనెల 7వ తేదీ రాత్రి కోళ్ల పందేల స్థావరంపై దాడి చేశారు. అక్కడ 22 మందిని అదుపులోకి తీసుకోగా, వారి వద్ద రూ.13.12 లక్షల నగదు, 24 సెల్ఫోన్లు, 31 చిన్న కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో ఏ1గా ఉన్న చింతమనేని ప్రభాకర్ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకున్నారు. తాను కోడిపందేల స్థావరం వద్ద లేనని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చింతమనేని సోషల్ మీడియాలో బుకాయించారు. అయితే పోలీసులకు లభించిన వీడియోలను పరిశీలించగా చింతమనేని అక్కడే ఉన్నట్టు స్పష్టమైంది. పోలీసులు రావడం చూసి ఆయన అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం స్పష్టంగా కనిపించింది. పరారీలో ఉన్న ఏ1 చింతమనేనిని పట్టుకోవడం కోసం సంగారెడ్డి జిల్లా పోలీసు అధికారులు మూడు బృందాలను నియమించారు. కాగా వేలం పాటలో వచ్చిన రూ.4.46 లక్షలను ప్రభుత్వ ఖాతాలో జమ చేసినట్లు ఎక్సైజ్ కోర్టు మేజిస్ట్రేట్ హన్మంతరావు పేర్కొన్నారు. -
సంక్రాంతి 2020; పందెం రాయుళ్ల అరెస్టు
సాక్షి, తూర్పుగోదావరి/పశ్చిమగోదావరి : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతో ఈసారి కోడి పందేల శిబిరాల వద్ద పేకాట, మద్యం విక్రయాల జాడేలేకుండా పోయింది. గతంలో కోడి పందేల బరుల వద్దే అనధికారికంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగేవి. దాంతోపాటు పేకాట, గుండాట, కోతాట వంటివి పెద్ద ఎత్తున ఆడేవారు. కాగా, 2020 సంక్రాంతి సంబరాల్లో జూదాన్ని కట్టడి చేసేందుకు పోలీసుల చర్యలు ఫలించాయి. ఇక సంప్రదాయ కోడి పందాల్లో కత్తి కట్టడం లేదని నిర్వాహకులు చెప్తున్నారు. మూడు రోజులపాటు సరదాగా గడిపేందుకు, ఏళ్ల నుంచి కొనసాగుతున్న సంప్రదాయ కోడి పందేల్ని వీక్షించేందుకు వచ్చామని ఔత్సాహికులు వెల్లడించారు. అయితే, అన్ని బరులపై నిఘా పెట్టామని.. నిబంధనలు ఉల్లంఘించి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. (చదవండి : కొక్కొరొకో.. వేడు‘కోళ్లు’ వినవలె) బరిలో నిలిచిన పందెం కోళ్లు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజు కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పందాల్లో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల నుంచి పందెం రాయుళ్లు జిల్లాకు చేరుకున్నారు. భీమవరం, నరసాపురం, ఆచంటతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో 100కు పైగా బరుల్లో కోడి పందాలు జరుగుతున్నాయి. జిల్లాలోని ఉంగుటూరు మండలం గొల్లగూడెం, బాదంపూడి, నల్లమాడు గ్రామాల్లో కోడిపందాలపై పోలీసులు దాడులు చేసి.. ఆరుగురు పందెం రాయుళ్లను అరెస్టు చేశారు. 3 కోళ్లు, రూ.4 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. పాలకొల్లు మండలం పూలపల్లిలో పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసుల అరెస్టు చేశారు. రూ. 4780 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉండి సంక్రాంతి సంబరాల్లో తలసాని తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేను గత సంవత్సరం వచ్చినప్పుడు చెప్పా ప్రభుత్వం మారుతుందని. మా రాష్ట్రం నుంఛఙ ఒకాయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పాం అలాగే ఇచ్చాం. ఒక పెద్ద భవనం కట్టి హైదరాబాద్ నేనే డెవలప్ చేశానని చెప్పుకునే తిరిగి ఒకాయన మూలన పడ్డాడు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవడం మంచి పరిణామం. కేసు నమోదు.. సాక్షి, చిత్తూరు : పీలేరులో రెండుచోట్ల (జాండ్ల, యర్రగుంట్ల వద్ద) కోడి పందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని చుట్టుముట్టి 10 మంది పందెం రాయుళ్లని, 2 కోడి పుంజులను లక్షా వెయ్యి రూపాయల నగదు , 54 కోడి కత్తులు, ఒక కారు , రెండు మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పందెం రాయుళ్లపై కేసు నమోదు చేశారు. జిల్లాలోని బి.కొత్తకోటలో ఆరు మంది పందెం రాయుళ్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి.. రెండు కోళ్లు, మూడు ద్విచక్ర వాహనాలు, రూ.15 వేల 620 ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా వాజేడు మండలానికి సమీపంలో ఉన్న చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కోడి పందాలకు భారీ ఏర్పాట్లు జరిగినట్టు సమాచారం. పందాల్లో పాల్గొనేందకు రాష్ట్రం నుంచి గుట్టుగా పోయేందుకు పందెం రాయుళ్లు సిద్ధమయ్యారు. అసలే ఏజెన్సీ అందులోనూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో.. పోలీసులకు కోడి పందాల కట్టడి చేయడం కష్టతరంగా మారింది. -
కొక్కొరొకో.. వేడు‘కోళ్లు’ వినవలె
అమ్మో నాకు చావు తప్పేట్టు లేదు. కాలికి కత్తి కట్టుకుని కదనరంగంలో నెత్తురోడుతూ దిక్కుమాలిన చావు నా నుదిటిన రాసిపెట్టినట్టుంది. వేకువజామునే అందరినీ మేలుకొలిపే నేను సంక్రాంతి మలిపొద్దు ఉంటానో.. ఉండనో..! న్యాయస్థానం ఆదేశాలు.. ఖాకీల హెచ్చరికలు ఇప్పటివరకూ కొండంత ధైర్యం నింపాయి.. ఖద్దరు నేతల ధీమా చూస్తే మాత్రం నా ప్రాణంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. పోలీసోళ్లు బరులను ధ్వంసం చేస్తున్నా.. హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా.. పందెం రాయుళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పందేలకు అనుమతులొచ్చేస్తాయన్న ధీమా మా యజమాని ముఖంలో స్పష్టంగా కనబడుతోంది. హుషారుగా, కూనిరాగాలు తీస్తూ ఈల పాటలు వేసుకుంటూ నోట్ల కట్టలు లెక్కపెట్టుకుంటూ పందేలకు సిద్ధమైపోతున్నాడు నాకు చావు ఘడియలు సమీపించినట్టే అనిపిస్తోంది. కనీసం కత్తులు కట్టకుండా డింకీ పందేలు వేసినా.. ఓపికున్నంత సేపు కొట్టుకుని చావుదెబ్బలతోనైనా బయటపడేవాళ్లం. పందేలు సంప్రదాయమని, వీటిని ఎవరూ ఆపలేరని నేతలు మా ప్రాణాలను బలిపీఠం ఎక్కిస్తున్నారు. సంక్రాంతిపండగ అందరిలోనూ ఆనందం నింపుతుంటే నాకు మాత్రం కొన్నిరోజులుగా నిద్రాహారాలు లేవు. ప్రాణాలరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నా. జీడిపప్పులు, బాదం పిస్తాలు, వేటమాంసం కీమా ఉండలు. రాగులు, గంట్లు, గుడ్లు.. ఏంపెట్టినా నోటికి సహించడం లేదు. ఏదీ తినబుద్ధి కావడం లేదు. సంక్రాంతి వచ్చేసింది. హరిదాసు కీర్తనలు వినిపిస్తున్నాయి. రంగురంగుల రంగవల్లులతో లోగిళ్లు కళకళలాడుతున్నాయి. అందరూ ఆనందంగా ఊళ్లకు పయనమవుతున్నారు. అదిగో అప్పుడే భోగి పండగ వచ్చేసింది. ఆ మంటల వెచ్చదనం నా శరీరాన్ని తాకుతోంది. నా చావు ముహూర్తం దగ్గర పడుతుందన్న సంకేతం పంపుతోంది. నా కోజ మాంసం బిర్యానీలో కలిసిపోవాల్సిందేనేమో..! ఇంతకాలం ఎంతో డాబు, దర్పంతో మహారాజులా బతికాను. ఇంత బతుకూ పందేల్లో చావుకే అన్నట్టు ఉంది. ఇంతకాలం నా యజమాని బలవర్ధక ఆహారం పెడుతుంటే.. కుటుంబ సభ్యులనూ పట్టించుకోకుండా నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంటే ఆయనకు నాపై ఎంత ప్రేమ అని పొంగిపోయాను. రోజూ తిన్నంత తిండి, తిన్నది అరగడానికి మందులు.. కాలక్షేపానికి జీడి పిక్కలు.. బోరుగా ఉంటే బాదం పిస్తాలు... బ్రేక్‌ఫాస్ట్‌గా వేట మాంసం కీమా ఉండలు.. గుడ్లు, పాలు.. రాగులు, సజ్జలు.... ఇవన్నీ తినేసినా... కొవ్వు పెరగకుండా రోజూ వ్యాయామాలు.. కాస్త దగ్గినా, తుమ్మినా క్షణాల్లో వాలిపోయే వైద్యులు.. ఇప్పుడర్థమవుతోంది ఆ రాజభోగమంతా సంక్రాంతి పందేల్లో చచ్చేందుకేనని.. ఇంతకాలం నా యజమాని దేవుడనుకున్నాను. ఇప్పుడు నా పాలిట యముడిలా మారాడు. ఒకవేళ నా అదృష్టం బాగుండి పందేలు గెలిచి బతికినా ఒళ్లంతా గాయాలతో, జీవచ్ఛవంలా మారాల్సిందే. ఏదేమైనా నా యజమాని రుణం తీర్చుకునేందుకు ఇది మంచి అవకాశం. విజయమో వీరస్వర్గమో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నా. కనీసం ఒక పందెం అయిగా గెలిచి అతనికి బహుమతిగా ఇవ్వాలన్నదే నా ఆశయం. పైకి ఇన్ని డాంబికాలు పోతున్నా.. లోలోపల ఏదో తెలీని ప్రాణభీతి నన్ను కుంగదీస్తోంది. ప్రాణాలంటే ఎవరికి తీపి కాదు. అదిగో నా యజమాని ఫోన్లో మాట్లాడుతున్నాడు. పందేలు కచ్చితంగా జరుగుతాయని చెబుతున్నాడు. ఇంకా కాసేపట్లో నా బతుకేంటో తేలిపోతుంది. ఓరి భగవంతుడా.. మళ్లీ జన్మంటూ ఉంటే కోడిజాతిలో పుట్టించకు. ఒకవేళ పుట్టించినా. పందెం కోడిగా మాత్రం పుట్టించకు. ఒక వేళ పుట్టించినా.. పండగ మాటున మూగజీవాల ఉసురు తీసుకునే విష సంస్కృతి ఉన్న సమాజంలో మాత్రం పుట్టించకు.. ఇదే నా వేడుకోలు.. వినవలె.. – ఇట్లు మీ పందెం కోడి(–గణపవరం) -
సంక్రాంతి పోరుకు పొరుగు పుంజులు
ఆకివీడు: సంక్రాంతి పండుగ దగ్గర పడటంతో పందెంకోళ్లకు డిమాండ్ పెరిగింది. ఇతర జిల్లాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి పందెం కోళ్లను తీసుకువచ్చి జిల్లాలోని పలు గ్రామాల్లో విక్రయిస్తున్నారు. కోడి పందాలకు ప్రసిద్ధి గాంచిన పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, భీమవరం, జువ్వలపాలెం, పెద అమిరం, మహదేవపట్నం, తదితర ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన పందెంకోళ్లను విక్రయిస్తున్నారు. కోడి ఒక్కింటికి రూ.5 వేలు నుండి రూ.10 వేల వరకూ ధర పలుకుతోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పెంచే పందెం కోళ్ల ధరలు ఎక్కువగా ఉండటంతో ఇతర రాష్ట్రాల కోడి పుంజుల్ని పందెంరాయుళ్లు బాగానే కొనుగోలు చేస్తున్నారు. తనిఖీల్లో కనపడకుండా పలుచటి గోనె సంచుల్లో కోడి పుంజుల్ని ఉంచి రవాణా చేస్తున్నారు. తమ రాష్ట్రంలో కోడి పుంజులకు అంతగా డిమాండ్ లేదని, అందువల్ల ఇక్కడ విక్రయిస్తున్నామని తమిళనాడుకు చెందిన ఓ విక్రయదారుడు తెలిపాడు. -
సత్తా ఉన్న కథ
ధనుష్, తాప్సీ జంటగా తమిళంలో ఘనవిజయం సాధించిన ‘ఆడు కళమ్’ చిత్రం తెలుగులో ‘పందెం కోళ్లు’ పేరుతో విడుదల కానుంది. సన్ పిక్చర్స్, సమూహ టాకీస్ పతాకంపై ఎ. శేఖర్‌బాబు, ఎం. కిశోర్‌కుమార్ రెడ్డి తెలుగులోకి అనువదించారు. జీవీ ప్రకాశ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాతల మండలి అధ్యక్షుడు ఎన్వీ ప్రసాద్ విడుదల చేసి, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డికి ఇచ్చారు. బిగ్ సీడీని నిర్మాత సురేశ్ కొండేటి విడుదల చేశారు. జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ -‘‘ఇటీవల విడుదలైన ధనుష్ ‘రఘువరన్ బీటెక్’ ఘనవిజయం సాధించింది. ‘పందెం కోళ్లు’ తమిళంలో ఘనవిజయం సాధించడంతో పాటు ఉత్తమ నటుడిగా ధనుష్‌కి జాతీయ అవార్డు కూడా వచ్చింది’’ అని చెప్పారు. అనువాద చిత్రాల్లో మంచి చిత్రంగా నిలిచే సత్తా ఉన్న కథతో ఈ చిత్రం రూపొందిందని ఎన్వీ ప్రసాద్ అన్నారు.