అదో మామిడి తోట..అక్కడ ఎన్నో వింతలు..విశేషాలు.. అక్కడికి వెళితే తిరిగి వెనక్కి రావాలనిపించదు. లోపలకు అడుగు పెట్టగానే రంగు రంగుల, రకరకాల కోళ్లు దర్శనమిస్తాయి. ఇక లోపలకు వెళితే కొక్కొరోకో కూతలు...ఒకటా, రెండా వందల సంఖ్యలో కోడి పుంజులు, పెట్టలతో ఆహ్లాదకరమైన వాతావరణంలోకి అడుగుపెట్టినట్టు అనుభూతి కలుగుతుంది. అది చెబితే తనివి తీరదు. ఆ ఆనందాన్ని కనులారా చూడాల్సిందే.. అక్కడి ప్రత్యేకతలు చెవులారా వినాల్సిందే.
ఒంగోలు నగరానికి కూత వేటు దూరంలో యరజర్ల గ్రామం. 4 ఎకరాల్లో కోళ్ల ఫాం ఉంది. ఇక్కడ కోళ్ల పెంపకంలో ప్రత్యేకత ఉంది. మామిడి తోటలో ఉన్న ఈ వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. విభిన్న జాతి రకాల కోళ్లు, కోడి పుంజులను చిన్న పిల్లల్లా వీటిని కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతున్నారు. వీటికి ప్రత్యేక గదులు. దుప్పట్లు.. దోమ తెరలు ఏర్పాటు చేశారు. వీటికి ఆయుర్వేద వనమూలికతో ప్రత్యేక స్నానం. మటన్ కీమా, బాదం, పిస్తా, తేనె, అంజూర్.. ఇలా బలవర్ధకమైన ఆహారం. అనారోగ్యం పాలవకుండా మందులు.. ఇంకా ఎన్నో.. వీటిని సంరక్షించేందుకు నిత్యం పది మంది పనివారు. ఇక్కడ విదేశాల నుంచి తీసుకువచ్చిన కోళ్లు కూడా సందడి చేస్తాయి. ఎన్నో ఆసక్తి కలిగించే విషయాలు, విశేషాలు తెలుసుకుందామా మరి..
యరజర్లకు చెందిన టి.శ్రీనివాసరావు కోడి పుంజుల ఫాంను ఏర్పాటు చేశారు. ఇక్కడ పుంజులకు, బ్రీడర్లకు ప్రత్యేకంగా ఫాంలను ఏర్పాటు చేసి మరీ నిర్వహిస్తున్నారు. 20 ఏళ్ల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, కృష్ణా జిల్లా నున్నలోనూ పెంపకం కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనంతరం రెండేళ్లుగా స్వగ్రామం యరజర్లలోని తన మామిడి తోటను కోడి పుంజుల ఉత్పత్తి కేంద్రంగా మార్చేశారు.
కుక్కుట శాస్త్రంలోనూ లేని విధంగా.. ఎన్నో మెళకువలు
గుడ్డు పెట్టించటం మొదలుకొని పొదిగి పిల్ల తయారు, వాటి పెంపకం ...అన్ని దశల్లోనూ ఎన్నో మెళకువలు. వాటికి బలవర్ధకమైన ఆహారం ఇవ్వటం దగ్గర నుంచి ఆరోగ్య పరిరక్షణ వరకూ ఎన్నో జాగ్రత్తలు అన్నీ...ఇన్నీ కావు
స్పెషల్ మెనూ...
ఇక్కడ కోడి పుంజులకూ బలవర్ధకమైన మెనూ ఉందండీ. బాదం, ఖర్జూరం, అంజూర్, యాలుకలు, రసగుల్లాలు, రంగు రంగుల ద్రాక్షలు, కిస్ మిస్, నాటుకోడి గుడ్డు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉంది.. వాటికి పరగడపున మొదలుకొని సాయంత్రం వరకు మెనూ సమయాన్ని పాటిస్తారు.
ప్రతి రోజూ 30 గ్రాముల లడ్డూ...
ప్రతి రోజూ ఒక్కో పుంజుకు ఉదయం 30 గ్రాముల లడ్డూ పెడతారు. బాదం, పిస్తా, అంజూర్, ఖర్జూరం, రెండు మూడు రకాల ఎండు ద్రాక్ష, సొంటి, సోంపు, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు, యాలుక్కాయలు, రసగుల్లలు, పిట్ట దంట్లు వీటన్నింటినీ కలిపి పచ్చడి బండపై రుబ్బు రోలుతో కచ్చపచ్చాగా నూరి సమపాళ్లలో తేనె వేసి లడ్డూలుగా తయారు చేస్తారు. ప్రతి రోజు ఉదయాన్నే 30 గ్రాముల చొప్పున ఒక్కో పుంజుకు తినిపిస్తారు. ఆ తరువాత ఉదయం 10 గంటల లోపు ఉడకబెట్టిన నాటుకోడి గుడ్డు ఇస్తారు.
తర్వాత 30 గ్రాముల మటన్ కీమా..
► మధ్యాహ్నం ఒక్కో పుంజుకు నానబెట్టిన 8 బాదం పప్పు. వాటితో పాటు ఎండు ద్రాక్షలు, కిస్‌మిస్ ఒక్కోదానికి 10, ఆవుపాలలో నాన బెట్టిన అంజూర్‌ను తినిపిస్తారు. ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్‌ను కూడా..
► సాయంత్రం ధాన్యం, రాగులు, సజ్జలు, చిలకడ గుండ్లు, పిట్టగుండ్లు లాంటి వాటిని సరిపడా ఇస్తారు.
కొత్త జాతులు... ఇతర దేశాల జాతులతో సంపర్కం
ఇక్కడ రకరకాల కొత్త కోడి పుంజు జాతులను రూపొందిస్తున్నారు. భీమవరం కోడి పెట్ట జాతితో అరేబియా జాతి, ఆఫ్రికా జాతి, ఈము జాతి కోళ్లను సంపర్కం చేయించి మరీ కొత్త రకం జాతులను ఉత్పత్తి చేస్తున్నారు.
► అరేబియా జాతికి చెందిన పెట్టను రూ.70 వేలు వెచ్చించి మరీ ఇక్కడకు తెప్పించారు.
► రూ.3 లక్షల విలువచేసే భీమవరం జాతికి చెందిన సీతువా బ్రీడర్‌తో కూడా పిల్లల ఉత్పత్తి.
► ఈము పక్షితో భీమవరం జాతి బ్రీడర్‌ను సంక్రమింపజేసి కొత్త రకం జాతి ఉత్పత్తి చేశారు.
► ఆఫ్రికా రకం కోడి కాకి జాతి బ్రీడర్ పుంజుతో మరో రకం ఉత్పత్తి.
► అరేబియా జాతి మైల రకం కోడి ఉంది.
► తెల్ల కొక్కెర పెట్టతో ఇతర జాతుల ఉత్పత్తి
► ఇతర దేశాల జాతి పెట్టలతో దేశీరకం జాతులతో సంపర్కం చేయించి మరీ చురుకైన జాతులను ఉత్పత్తి చేస్తున్నారు.
ఆయుర్వేద మూలికలతో చేసిన నీళ్లు
మూడు నెలలకొకసారి ఆయుర్వేద స్నానం
కోడి పుంజుగా మూడు నెలల వయస్సు వచ్చే సరికి మొదటి ఆయుర్వేద స్నానం ప్రారంభిస్తారు. సాధారణంగా కోళ్లను నీటిలో వదలటం, ఈత కొట్టించటం సర్వసాధారణం. వాటితో పాటు శరీరం గట్టి పడటానికి, శరీరంలోని వృథా నీరు బయటకు పోవటానికి, ఉన్న కొవ్వు కరిగిపోవటానికి, శరీరం ‘‘వజ్రకాయం’’ కావటానికి దోహదపడేలా వాటిని తీర్చిదిద్దుతారు. అందుకే ఆయుర్వేద స్నానంతో పాటు స్టీమ్ బాత్ చేయిస్తారు.
తొలుత 50 లీటర్ల నీటిని తీసుకోవాలి. ఆ నీటిలో వెదురు ఆకు, వాయల ఆకు, నల్లతుమ్మ చెక్క, విప్ప పువ్వు, మోదుగు పువ్వు, పచ్చి పసుపు కొమ్ములు, మిరియాలు, స్ఫటిక, వాము, జాజికాయ, జాపత్రి, పచ్చ కర్పూరం కలిపి నీటిలో ఉడకబెట్టాలి. ఆ నీటిని 25 లీటర్ల వరకు వచ్చేలా మరిగించాలి. ఆ తరువాత కొంచెం చల్లనీళ్లలో కలిపి నులివెచ్చగా నీటిని తయారు చేసి ఆ నీటిలో పుంజును మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఆ నీటిలో ముంచిన గోనె సంచులను పిండి.. కింద ఒకటి, పైన ఒకటి గోనె సంచులు ఉంచి స్ట్రీమ్ బాత్‌లాగా వాటిని అందులో ఉంచాలి. ఆ పొగల్లో నుంచి పుంజు శరీరంలోని వృథా నీరు కాస్తా బయటకు వెళ్లిపోతాయి.
అరగంట సేపు ఆదమరిచి ఆ పుంజులు సొమ్మసిల్లుతాయి. అరగంట తరువాత ఆ గోనె సంచుల నుంచి వాటిని విడదీసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరల్లో ఉంచాలి. ఈ విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆయుర్వేద స్నానం చేయిస్తారు. ఆ తరువాత మూడో రోజు షాంపూలతో స్నానం చేయించటం ఇలా ఎన్నో జాగ్రత్తలు. దీనిద్వారా శరీరంలో ఉన్న రుగ్మతలు కూడా దరిచేరవు. ఆరు నెలలపాటు ప్రత్యేక ర్యాక్‌లలో పెంచుతారు. వీటి కోసం ప్రత్యేక బెడ్‌లు, దోమ తెరలు ఉంటాయి. ప్రత్యేకంగా తీసుకొచ్చిన గంపలో వీటిని ఉంచి కంటికి రెప్పలాగా కాపాడుతారు. అనారోగ్యం పాలవకుండా మందులు ఇస్తారు. ప్రత్యేక టానిక్‌లు కూడా వేస్తుంటారు. అంతేకాదండోయ్ ప్రతి చెట్టుకూ సీసీ కెమెరాలు కూడా అమర్చారు.
ఆసక్తితోనే పెంపకం..
కోళ్లపై చిన్ననాటి నుంచి ఉన్న ఆసక్తితోనే వీటిని పెంచుతున్నాను. వీటికి ఖరీదైన పౌష్టికాహారాన్ని అందించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేలా నిత్యం జాగ్రత్తలు తీసుకుంటాం. పుంజులు, పెట్టలను విడివిడిగా ప్రత్యేక గదుల్లో ఉంచుతాం. విదేశాల నుంచి అరుదైన జాతులను తీసుకువచ్చి క్రాస్ బీడింగ్ చేస్తున్నాం. పాముల నుంచి రక్షించేందుకు ప్రత్యేకంగా వలలను కూడా ఏర్పాటు చేశాం. – టీ శ్రీనివాసరావు, యర్లజర్ల
- పట్నాల రవిచంద్ర, ఒంగోలు డెస్క్
ఫోటోలు: ఎం ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment