అమ్మో నాకు చావు తప్పేట్టు లేదు. కాలికి కత్తి కట్టుకుని కదనరంగంలో నెత్తురోడుతూ దిక్కుమాలిన చావు నా నుదిటిన రాసిపెట్టినట్టుంది. వేకువజామునే అందరినీ మేలుకొలిపే నేను సంక్రాంతి మలిపొద్దు ఉంటానో.. ఉండనో..! న్యాయస్థానం ఆదేశాలు.. ఖాకీల హెచ్చరికలు ఇప్పటివరకూ కొండంత ధైర్యం నింపాయి.. ఖద్దరు నేతల ధీమా చూస్తే మాత్రం నా ప్రాణంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి. పోలీసోళ్లు బరులను ధ్వంసం చేస్తున్నా.. హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా.. పందెం రాయుళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. పందేలకు అనుమతులొచ్చేస్తాయన్న ధీమా మా యజమాని ముఖంలో స్పష్టంగా కనబడుతోంది. హుషారుగా, కూనిరాగాలు తీస్తూ ఈల పాటలు వేసుకుంటూ నోట్ల కట్టలు లెక్కపెట్టుకుంటూ పందేలకు సిద్ధమైపోతున్నాడు
నాకు చావు ఘడియలు సమీపించినట్టే అనిపిస్తోంది. కనీసం కత్తులు కట్టకుండా డింకీ పందేలు వేసినా.. ఓపికున్నంత సేపు కొట్టుకుని చావుదెబ్బలతోనైనా బయటపడేవాళ్లం. పందేలు సంప్రదాయమని, వీటిని ఎవరూ ఆపలేరని నేతలు మా ప్రాణాలను బలిపీఠం ఎక్కిస్తున్నారు. సంక్రాంతిపండగ అందరిలోనూ ఆనందం నింపుతుంటే నాకు మాత్రం కొన్నిరోజులుగా నిద్రాహారాలు లేవు. ప్రాణాలరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నా. జీడిపప్పులు, బాదం పిస్తాలు, వేటమాంసం కీమా ఉండలు. రాగులు, గంట్లు, గుడ్లు.. ఏంపెట్టినా నోటికి సహించడం లేదు. ఏదీ తినబుద్ధి కావడం లేదు. సంక్రాంతి వచ్చేసింది. హరిదాసు కీర్తనలు వినిపిస్తున్నాయి. రంగురంగుల రంగవల్లులతో లోగిళ్లు కళకళలాడుతున్నాయి. అందరూ ఆనందంగా ఊళ్లకు పయనమవుతున్నారు. అదిగో అప్పుడే భోగి పండగ వచ్చేసింది.
ఆ మంటల వెచ్చదనం నా శరీరాన్ని తాకుతోంది. నా చావు ముహూర్తం దగ్గర పడుతుందన్న సంకేతం పంపుతోంది. నా కోజ మాంసం బిర్యానీలో కలిసిపోవాల్సిందేనేమో..! ఇంతకాలం ఎంతో డాబు, దర్పంతో మహారాజులా బతికాను. ఇంత బతుకూ పందేల్లో చావుకే అన్నట్టు ఉంది. ఇంతకాలం నా యజమాని బలవర్ధక ఆహారం పెడుతుంటే.. కుటుంబ సభ్యులనూ పట్టించుకోకుండా నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంటే ఆయనకు నాపై ఎంత ప్రేమ అని పొంగిపోయాను. రోజూ తిన్నంత తిండి, తిన్నది అరగడానికి మందులు.. కాలక్షేపానికి జీడి పిక్కలు.. బోరుగా ఉంటే బాదం పిస్తాలు... బ్రేక్‌ఫాస్ట్‌గా వేట మాంసం కీమా ఉండలు.. గుడ్లు, పాలు.. రాగులు, సజ్జలు.... ఇవన్నీ తినేసినా... కొవ్వు పెరగకుండా రోజూ వ్యాయామాలు.. కాస్త దగ్గినా, తుమ్మినా క్షణాల్లో వాలిపోయే వైద్యులు.. ఇప్పుడర్థమవుతోంది ఆ రాజభోగమంతా సంక్రాంతి పందేల్లో చచ్చేందుకేనని.. ఇంతకాలం నా యజమాని దేవుడనుకున్నాను.
ఇప్పుడు నా పాలిట యముడిలా మారాడు. ఒకవేళ నా అదృష్టం బాగుండి పందేలు గెలిచి బతికినా ఒళ్లంతా గాయాలతో, జీవచ్ఛవంలా మారాల్సిందే. ఏదేమైనా నా యజమాని రుణం తీర్చుకునేందుకు ఇది మంచి అవకాశం. విజయమో వీరస్వర్గమో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నా. కనీసం ఒక పందెం అయిగా గెలిచి అతనికి బహుమతిగా ఇవ్వాలన్నదే నా ఆశయం. పైకి ఇన్ని డాంబికాలు పోతున్నా.. లోలోపల ఏదో తెలీని ప్రాణభీతి నన్ను కుంగదీస్తోంది. ప్రాణాలంటే ఎవరికి తీపి కాదు. అదిగో నా యజమాని ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. పందేలు కచ్చితంగా జరుగుతాయని చెబుతున్నాడు. ఇంకా కాసేపట్లో నా బతుకేంటో తేలిపోతుంది. ఓరి భగవంతుడా.. మళ్లీ జన్మంటూ ఉంటే కోడిజాతిలో పుట్టించకు. ఒకవేళ పుట్టించినా. పందెం కోడిగా మాత్రం పుట్టించకు. ఒక వేళ పుట్టించినా.. పండగ మాటున మూగజీవాల ఉసురు తీసుకునే విష సంస్కృతి ఉన్న సమాజంలో మాత్రం పుట్టించకు.. ఇదే నా వేడుకోలు.. వినవలె..
– ఇట్లు మీ పందెం కోడి(–గణపవరం)
Comments
Please login to add a commentAdd a comment