బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్‌ | Telangana Government Appoints Dedicated Commission for BC Reservations | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్‌

Published Tue, Nov 5 2024 5:33 AM | Last Updated on Tue, Nov 5 2024 5:33 AM

Telangana Government Appoints Dedicated Commission for BC Reservations

విశ్రాంత ఐఏఎస్‌ బూసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం 

నెలరోజుల్లో అధ్యయనం పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశం

గతంలో నియమించిన బీసీ కమిషన్లు సేకరించిన సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచన

హైకోర్టు ఆదేశాల మేరకు నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌:  స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్దేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్‌ (ప్రత్యేక) కమిషన్‌ను ఏర్పాటు చేసింది. మాజీ ఐఏఎస్‌ అధికారి బూసాని వెంకటేశ్వరరావు ఈ కమి షన్‌కు చైర్మన్‌గా వ్యవ హరిస్తారు. రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యం, రిజర్వేషన్లలో లోటుపాట్లు, ఇతర అంశాలపై కమిషన్‌ సమగ్ర విచారణ చేపట్టనుంది. రాజ్యాంగంలో ని నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నెలరోజుల్లో నివేదిక సమరి్పంచాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం సోమవారం ఉత్తర్వులుజారీ చేశారు. బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్య దర్శి బి.సైదులు ఈ కమిషన్‌కు కార్యదర్శిగా వ్యవహరిస్తూ సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  

న్యాయస్థానం ఆదేశాలకు కట్టుబడి.. 
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సెపె్టంబర్‌ 6వ తేదీన జి.నిరంజన్‌ చైర్మన్‌గా బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అధ్యయనం కోసం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కానీ రాజ్యాంగ నిబంధనలకు లోబడి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల అధ్యయనానికి ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలంటూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో ఆదివారం తన నివాసంలో లోతుగా చర్చించి ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. 

ఆ సమాచారాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి 
తాజాగా ఏర్పాటైన ప్రత్యేక కమిషన్‌ అధ్యయనం పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించే క్రమంలో గతంలో నియమించిన బీసీ కమిషన్లు సేకరించిన సమాచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కమిషన్లు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు, ప్రముఖులు, కీలక వ్యక్తుల నుంచి సమాచారం సేకరించడంతో పాటు గణాంకాలు తీసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. అవసరాన్ని బట్టి నిపుణులు, పరిశోధకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని, అధ్యయనానికి సంబంధించి పర్యటనలు చేపట్టవచ్చని, పరిశోధన సంస్థల నుంచి సమాచారం తీసుకోవచ్చని తెలిపింది. డెడికేటెడ్‌ కమిషన్‌కు అవసరమైన సిబ్బంది, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.  

వివిధ శాఖల్లో విశేష సేవలు 
వెనుకబడిన తరగతులకు చెందిన బూసాని వెంకటేశ్వరరావు బీఈ (ఎలక్ట్రానిక్స్‌), ఎంఈ (సాలిడ్‌ స్టేట్‌ ఎల్రక్టానిక్స్‌), ఎల్‌ఎల్‌బీ చదివారు. ఈయన 1993 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. 1987లో గ్రూప్‌–1 (స్టేట్‌ సివిల్‌ సరీ్వసు) టాపర్‌గా నిలిచి ప్రభుత్వ అధికారిగా ప్రస్థానం ప్రారంభించారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయనగరం జిల్లా కలెక్టర్‌గా, పర్సనల్‌ అడ్మిని్రస్టేషన్‌ అండ్‌ వెల్ఫేర్‌ విభాగం డైరెక్టర్‌గా, స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ కార్యదర్శిగా, ఏపీ హ్యాండీక్రాఫ్టŠస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వీసీఎండీగా, రెవెన్యూ, ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శిగా, మత్స్య శాఖ కమిషనర్‌గా, జీఏడీ (సర్వీసెస్‌–హెచ్‌ఆర్‌ఎం) కార్యదర్శిగా, చివరిగా తెలంగాణ ప్రభుత్వంలో రెవెన్యూ(డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌) విభాగం ముఖ్య కార్యదర్శిగా సేవలందించి 2019 డిసెంబర్‌–31న పదవీ విరమణ పొందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement