సమర్థ నేతలుగా ఎదగండి!
* సాంకేతికాంశాల్లో పట్టు సాధించండి
* మహిళా ప్రజా ప్రతినిధులకు ప్రధాని పిలుపు
న్యూఢిల్లీ: ‘మహిళాభివృద్ధి గురించి మాత్రమే కాదు.. అంతకుమించి మహిళల నేతృత్వంలో అభివృద్ధి గురించి ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది’ అని ప్రధానిమోదీ ఉద్ఘాటించారు. చట్టసభల్లోని మహిళా ప్రతినిధుల జాతీయ సదస్సునుద్దేశించి ఆదివారం మోదీ ప్రసంగించారు. ‘మిమ్మల్ని మీరు సమర్ధవంతంగా తీర్చిదిద్దుకోండి. సాంకేతిక అంశాల్లో సాధికారత సాధించండి. అన్ని అంశాలపై పట్టు సాధించడం ద్వారా మీ నాయకత్వాన్ని పటిష్టం చేసుకోండి.
మీ ప్రాంతంలో మీ నాయకత్వానికి సంబంధించి మీదైన ముద్ర వేయండి. మీ పనితీరు, ఆలోచన ప్రజల్లో స్థిరపడితే మీ ఆలోచనలను ప్రజలు ఆమోదించడం మొదలెడతారు.’ అంటూ మహిళా ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. అయితే, దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశంపై మాట్లాడలేదు. పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం కనీసం 12% కూడా లేకపోవడంపై రాష్ట్రపతి తన ప్రసంగంలో ఆవేదన వ్యక్తం చేశారు.
స్వచ్చంధంగా మహిళలకు అధిక సంఖ్యల సీట్లు కేటాయించాలని ఉపరాష్ట్రపతి సైతం రాజకీయ పార్టీలకు విజ్ఞప్తిచేశారు. ప్రధాని మోదీ మాత్రం మహిళలకు రిజర్వేషన్ల అంశం జోలికి పోకుండా.. వ్యక్తిత్వాన్ని, పనితీరును మార్చుకోవాలంటూ మహిళలకు సూచించడంపై దృష్టి పెట్టారు. ‘క్షమ, ఓపిక లాంటివి స్త్రీలకు సహజ లక్షణాలు. భర్త, పిల్లల కోసం వారెంతో త్యాగం చేస్తార’ని వ్యాఖ్యానించారు. వ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయని, కేవలం వ్యవస్థలో వచ్చే మార్పు సరిపోదని పేర్కొన్నారు.
ఈర్ష్య.. ఆత్మన్యూనత వద్దు
కింది స్థాయి నుంచి మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, పోటీకి వస్తారేమోనన్న ఈర్ష్య భావనలను వదలుకోవాలని మహిళా ప్రతినిధులకు ప్రధాని హితవు చెప్పారు. ‘రాజకీయాలంటేనే పోటీ. ఈ పోటీలో అసూయ ఆధిపత్యం పెరిగితే మీరు అభివృద్ధి చెందలేరు. నా రంగంలోకి మరింత సమర్ధులైన వారు వస్తే నా పరిస్థితి ఏంటి? అనే ఆలోచన కానీ, నా ప్రాంతంలో మరొకరిని ఎదగనివ్వననే ఆలోచన కానీ వద్దు. అలా కాకుండా, ఇతర మహిళలనూ ప్రోత్సహిస్తే మరింత పైకి ఎదగగలమనే భావనను పెంపొందించుకోండి.
దానిద్వారా పిరమిడ్ తరహా నాయకత్వ నిర్మాణం రూపొందుతుంది. మీరు మరింత పైకి ఎదుగుతారు’ అని వివరించారు. ఆత్మన్యూనత వల్ల ఏమీ సాధించలేరన్నారు. అవకాశం లభిస్తే.. పురుషుల కన్నా స్త్రీలే మెరుగైన పనితీరు చూపగలరన్నారు. ‘ఎంతోమంది విదేశాంగ మంత్రులుగా పనిచేశారు. వారి పేర్లు కూడా మనకు గుర్తులేవు. కానీ అత్యుత్తమ పనితీరుతో సుష్మాస్వరాజ్ విదేశాంగ మంత్రిగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు’ అని తన మంత్రివర్గ సహచరురాలిని ప్రశంసించారు. ‘రువాండా పార్లమెంట్లో 65% మహిళలే, వారి నేతృత్వంలో ఆ దేశం గొప్పగా ముందుకు వెళ్తోంద’న్నారు. తన మంత్రివర్గంలోనూ మహిళలకు సముచిత ప్రాధాన్యతనిచ్చానన్నారు.
పార్లమెంటు ఉభయసభల్లోని మహిళా ప్రతినిధులు తమ అభిప్రాయాలను పంచుకునేందుకు ఒక ఈ- వేదికను ఏర్పాటు చేసుకోవాలని ప్రధాని సూచించారు. ‘మార్పులకు పురుషుల కన్నా మహిళలు త్వరగా అలవాటవుతారు. చదువుకోని మహిళలు కూడా వంటగదిలో కొత్త కొత్త సాంకేతికతలతో కూడిన వస్తువులను అలవోకగా ఉపయోగిస్తుంటారు.
ఏకకాలంలో అనేక పనులు చేయగలగడం భారతీయ మహిళలకు కొట్టిన పిండి’ అని ప్రశంసల్లో ముంచెత్తారు. చట్టాల రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషించాలని మహిళా ప్రజా ప్రతినిధులకు మోదీ పిలుపునిచ్చారు. ‘మహిళా సాధికారత అనే ఆలోచనే సరైంది కాదు. శక్తి లేనివారికి సాధికారత అవసరం. ఇప్పటికే శక్తిమంతమైన వారికి సాధికారత ఏంటి? మహిళలకు సాధికారత కల్పించేందుకు మగవాళ్లెవరు? సవాళ్లను ఎదుర్కొంటే తప్ప మన శక్తి మనకు తెలియదు’ అంటూ వారిలో స్ఫూర్తి నింపేందుకు ప్రధాని ప్రయత్నించారు.