womens T20 cricket team
-
మెరిసిన త్రిష... భారత్ ఘనవిజయం
కౌలాలంపూర్: ఆసియా కప్ అండర్–19 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ ‘సూపర్ ఫోర్’ దశలో భారత్ శుభారంభం చేసింది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 12.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 86 పరుగులు సాధించి నెగ్గింది. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (46 బంతుల్లో 58 నాటౌట్; 10 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో అదరగొట్టింది. కమలిని (0), సనిక చాల్కె (1) వెంటవెంటనే అవుటైనా కెపె్టన్ నిక్కీ ప్రసాద్ (14 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు)తో కలిసి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ త్రిష టీమిండియాను విజయతీరాలకు చేర్చింది. అంతకుముందు బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 80 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3 వికెట్లు, సోనమ్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. నేడు జరిగే మరో ‘సూపర్ ఫోర్’ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడుతుంది -
Commonwealth Games 2022: క్రికెట్లో కనకంపై గురి
బర్మింగ్‌హామ్: తొలిసారిగా కామన్వెల్త్ క్రీడల్లో ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్లో భారత జట్టు సత్తా చాటింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరుస్తూ హర్మన్‌ప్రీత్ బృందం ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది. శనివారం ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపై భారత్ 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. స్మృతి మంధాన (32 బంతుల్లో 61; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, జెమీమా రోడ్రిగ్స్ (31 బంతుల్లో 44 నాటౌట్; 7 ఫోర్లు) రాణించింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున వేగవంతమైన అర్ధ సెంచరీ (23 బంతుల్లో)ని స్మృతి నమోదు చేయడం విశేషం. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. నాట్ సివర్ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, 1 సిక్స్), డానీ వ్యాట్ (27 బంతుల్లో 35; 6 ఫోర్లు), ఎమీ జోన్స్ (24 బంతుల్లో 31; 3 ఫోర్లు) రాణించారు. సివర్, జోన్స్ నాలుగో వికెట్‌కు 54 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ సునాయాసంగా విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. చేతిలో 7 వికెట్లతో 17 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో జోన్స్ రనౌట్ కాగా... ఆ తర్వాత 8 బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా సివర్ రనౌట్ కావడం జట్టును దెబ్బ తీసింది. ఆఖరి ఓవర్లో గెలుపు కోసం 14 పరుగులు చేసే ప్రయత్నంలో ఇంగ్లండ్ 9 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. స్పిన్నర్లు స్నేహ్ రాణా (2/28), దీప్తి శర్మ (1/18) ప్రత్యర్థిని కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో తుది పోరులో భారత తలపడుతుంది. భారత కాలమానం ప్రకారం నేడు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఫైనల్ మొదలవుతుంది. కాంస్య పతక మ్యాచ్ మధ్యాహ్నం గం. 3:30 నుంచి జరుగుతుంది. అప్పుడు పతకం రాలేదు కామన్వెల్త్ క్రీడల్లో గతంలో ఒకే ఒకసారి (1998; కౌలాలంపూర్) క్రికెట్ పోటీలు నిర్వహించారు. పురుషుల టీమ్‌తో వన్డే ఫార్మాట్లో అజయ్ జడేజా నాయకత్వంలో భారత్ బరిలోకి దిగింది. సచిన్, కుంబ్లే, లక్ష్మణ్, హర్భజన్, రాబిన్ సింగ్, ఎమ్మెస్కే ప్రసాద్ లీగ్ దశలో 3 మ్యాచ్‌లూ ఆడారు. గ్రూప్ ‘బి’లో ఉన్న భారత జట్టు... కెనడాపై గెలిచి ఆస్ట్రేలియా చేతిలో ఓడగా, ఆంటిగ్వా అండ్ బార్బుడాతో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా ఫలితం రాలేదు. దాంతో సెమీస్ చేరకుండానే టీమిండియా నిష్క్రమించింది. -
మహిళా క్రికెటర్లకు పిలుపు!
న్యూఢిల్లీ: మహిళల టి20 చాలెంజ్ సిరీస్ కోసం భారత మహిళా క్రికెటర్లను ఈనెల 13న ముంబైకి రావాల్సిందిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించింది. మొత్తం 30 మంది క్రికెటర్లకు పిలుపునిచ్చినట్లు తెలిపింది. ‘క్రికెటర్లకు సమాచారమిచ్చాం. వాట్సప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాం. అండర్–19 ప్లేయర్లు కొందర్ని ఎంపిక చేశాం’ అని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముంబైకి చేరుకున్న ప్లేయర్లు వారం రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. పలుమార్లు కోవిడ్–19 పరీక్షల అనంతరం అక్టోబర్ 22న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) బయల్దేరి వెళ్లనున్నారు. మరో వారం రోజుల క్వారంటైన్ అనంతరం బయో బబుల్‌లో అడుగుపెడతారు. ఈ తతంగం అంతా ముగిసేసరికి ఆటగాళ్లకు సరైన ప్రాక్టీస్ లేకుండానే టోర్నీ బరిలో దిగాల్సి ఉంటుంది. ఈ అంశంపైనే ఆటగాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెటరన్ ప్లేయర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నారు. షెడ్యూల్ ప్రకారం మూడు జట్లతో జరిగే నాలుగు మ్యాచ్‌ల ‘మహిళల టి20 చాలెంజర్ టోర్నీ’ షార్జా వేదికగా నవంబర్ 4 నుంచి 9 వరకు జరుగనుంది. -
విజయానికి 2 పరుగులు.. 5 వికెట్లు టపాటపా
-
విజయానికి 2 పరుగులు.. 5 వికెట్లు టపాటపా
జైపూర్: ఐపీఎల్ మహిళల టి20 చాలెంజ్‌లో భాగంగా బుధవారం ట్రయల్ బ్లేజర్స్, వెలాసిటీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరల్లో ఆసక్తి చేసింది. ట్రయల్ బ్లేజర్స్ బౌలర్ దీప్తి శర్మ చివరల్లో ముగ్గురిని క్లీన్‌బౌల్డ్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అప్పటికే వెలాసిటీ టీమ్ విజయం ఖాయం అయిపోవడంతో దీప్తి ప్రదర్శన వృధా అయింది. వెలాసిటీ 18 బంతులకు 2 పరుగులు చేయాల్సిన దశలో దీప్తి టపాటపా మూడు వికెట్లు పడగొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 112 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన మిథాలీ సేన 16.5 ఓవర్లలో 111 పరుగులు చేసి మూడో వికెట్ నష్టపోయింది. ఇక్కడ నుంచి వరుసగా ఐదు వికెట్లు కోల్పోయింది. టాప్ స్కోరర్ డానియల్ వ్యాట్(46) మూడో వికెట్‌గా ఔటైంది. తర్వాత వేదాకృష్ణమూర్తి రనౌటయింది. ఇక్కడి నుంచి దీప్తి షో మొదలైంది. 17 ఓవర్ తొలి బంతికి మిథాలీ రాజ్‌ను బౌల్డ్ చేసింది. మూడో బంతికి శిఖా పాండే, ఐదో బంతికి అమిలా కెర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపింది. ఈరోజు మ్యాచ్‌లో దీప్తి పడొట్టిన నాలుగు వికెట్లు క్లీన్‌బౌల్డ్ కావడం విశేషం. 4 ఓవర్ 5 బంతికి ఓపెనర్ హెలే మాథ్యూస్‌ను అవుట్ చేసిన దీప్తి చివర్లో మళ్లీ మాయాజాలం చేసింది. విజయానికి 2 పరుగులు చేయాల్సిన దశలో వెలాసిటీ టీమ్ ఏకంగా 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. 8 వికెట్ల తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో వెలాసిటీ టీమ్ చివరకు మూడు వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది. (చదవండి: మంధానకు షాక్.. మిథాలీ సేనదే విజయం) -
మంధానకు షాక్.. మిథాలీ సేనదే విజయం
జైపూర్: తొలి మ్యాచ్ విజయంతో జోరుమీదున్న ట్రయల్ బ్లేజర్స్‌కు వెలాసిటీ అదిరిపోయే పంచ్ ఇచ్చింది. ఐపీఎల్ మహిళల టి20 చాలెంజ్‌లో భాగంగా బుధవారం ట్రయల్ బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో వెలాసిటీ విజయం సాధించింది. బ్లేజర్స్ నిర్దేశించిన 113 పరుగుల స్వల్స లక్ష్యాన్ని ఛేదించడానికి మిథాలీ సేన ఆపసోపాలు పడింది. అయితే షేఫాలీ వర్మ(34; 31 బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్), వ్యాట్(46; 35 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్సర్లు)లు పట్టుదలతో రాణించడంతో వెలాసిటీ పని సులువైంది. వీరిద్దరూ ఔటైన తర్వాత వెలాసిటీ వికెట్ల పతనం వేగంగా సాగింది. చివర్లో మిథాలీ రాజ్(17) రాణించడంతో వెలాసిటీ మరో రెండు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. దీప్తి శర్మ నాలుగు వికెట్లతో అదరగొట్టగా, గైక్వాడ్, డియోల్‌లు తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్ బ్లేజర్స్‌కు శుభారంభం దక్కలేదు. స్మృతి మంధాన (10) జట్టు స్కోరు 15 పరుగుల వద్ద ఔటైంది. ఈక్రమంలో హర్లీన్ డియోల్ (43; 40 బంతుల్లో 5×4), సుజీ బేట్స్ (26; 22 బంతుల్లో 2×4, 1×6) నిలకడగా ఆడారు. దీప్తి శర్మ (16) ఫర్వాలేదనిపించింది. ఏక్తా బిస్త్, అమెలియా కెర్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక మహిళల ఐపీఎల్లో భాగంగా రేపు(గురువారం) సూపర్ నోవాస్‌తో వెలాసిటీ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ వెలాసిటీ గెలిస్తే నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిపోతే నెట్ రన్‌రేట్ కీలకంగా మారే అవకాశం ఉంది. -
సూపర్ బ్లేజర్స్
జైపూర్: అమ్మాయిల మెరుపులు మొదలయ్యాయి. అబ్బాయిలకు తీసిపోని విధంగా ఫైనల్ ఓవర్ ఉత్కంఠ పెంచింది. చివరకు ట్రయల్ బ్లేజర్స్ 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. మహిళల టి20 చాలెంజ్‌లో సోమవారం జరిగిన పోరులో సూపర్ నోవాస్ ఆఖరిదాకా వచ్చి ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (67 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసింది. రాధా యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సూపర్నోవాస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 46 నాటౌట్; 8 ఫోర్లు) రాణించింది. ఎకల్‌స్టోన్ 2 వికెట్లు పడగొట్టింది. మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. మంధాన ఒక్కతే... ట్రయల్ బ్లేజర్స్ ఓపెనర్ స్మృతి మంధాన ఇన్నింగ్స్ రెండో బంతి నుంచి ఆఖరి ఓవర్ రెండో బంతి దాకా బ్యాటింగ్ చేసింది. జట్టు స్కోరులో 65 శాతం పరుగులు చేసి మూల స్తంభంలా నిలిచింది. ఆమెతో పాటు బ్యాటింగ్‌కు దిగిన వారిలో హర్లీన్ డియోల్ (44 బంతుల్లో 36; 3 ఫోర్లు) మినహా ఇంకెవరూ 2 పరుగులను మించి చేయలేకపోయారు. అసాధారణ పోరాటం, కళ్లు చెదిరే షాట్లతో స్మృతి మంధాన ఒక్కతే బ్లేజర్స్ ఇన్నింగ్స్‌ను నడిపించింది. హర్లీన్ అండతో ఆఖరి దాకా... కెప్టెన్ మంధానతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సుజిబేట్స్ ఒక పరుగే చేసి అనూజా పాటిల్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. తర్వాత వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ హర్లీన్ జతకలిసింది. ఇద్దరు 17 ఓవర్లపాటు సూపర్నోవాస్ బౌలర్లకు చిక్క కుండా దొరకుండా విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో స్మృతి 47 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకుంది. 15వ ఓవర్లో ఫిఫ్టీ చేసుకున్న తర్వాత మంధాన ఒక్కసారిగా శివమెత్తింది. మరో 40 పరుగులు చేసేందుకు ఆమె కేవలం 20 బంతులే ఆడింది. ఆఖరిదాకా అండగా నిలిచిన హర్లీన్‌ను సోఫీ డివైన్ ఔట్ చేయడంతో 119 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్లో స్మృతి, దీప్తిశర్మ (0), స్టెఫానీ టేలర్ (2) ఔటయ్యారు. రాణించిన హర్మన్‌ప్రీత్ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన సూపర్నోవాస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియా పూనియా (2) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరింది. తర్వాత జయంగని (34 బంతుల్లో 26; 2 ఫోర్లు), జెమిమా రోడ్రిగ్స్ (19 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కాసేపు నడిపించారు. రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించాక జెమిమా రనౌట్ కావడంతో కష్టాలు మొదలయ్యాయి. స్వల్ప వ్యవధిలో జయంగని, సీవర్ (1) నిష్క్రమించడంతో ఒత్తిడి పెరిగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్నా... చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. డివైన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించింది. ఉత్కంఠ పెంచిన ఆఖరి ఓవర్ చివరి 12 బంతుల్లో సూపర్ నోవాస్ విజయానికి 21 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో 19వ ఓవర్ వేసిన ఎకల్‌స్టోన్ రెండే పరుగులిచ్చి సోఫీ డివైన్ (22 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను ఔట్ చేసింది. ఇక 6 బంతుల్లో 19 పరుగులు చేయాల్సివుండగా... సీనియర్ బౌలర్ జులన్ ఓవర్లో హర్మన్‌ప్రీత్ 4 బౌండరీలతో అదరగొట్టింది. చివరి బంతికి 3 పరుగులు అవసరం కాగా... లియా తహుహు రనౌట్ కావడంతో బ్లేజర్స్ ఊపిరిపీల్చుకుంది. -
ట్రయల్ బ్లేజర్స్ గీ సూపర్ నోవాస్
న్యూఢిల్లీ: ఐపీఎల్ తొలి క్వాలిఫయర్‌కు ముందు జరిగే మహిళల చాలెంజ్ టి20 మ్యాచ్ కోసం బీసీసీఐ గురువారం జట్లను ప్రకటించింది. ఈ నెల 22న ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఐపీఎల్ ట్రయల్ బ్లేజర్స్, ఐపీఎల్ సూపర్ నోవాస్ పేర్లతో జట్లు తలపడనున్నాయి. ట్రయల్ బ్లేజర్స్‌కు స్మృతి మంధాన, సూపర్ నోవాస్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ఈ రెండు జట్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లకు చెందిన పలువురు అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు. మొత్తం 26 మంది ప్లేయర్లను రెండు జట్ల కోసం ఎంపిక చేశారు. ఇందులో 10 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ ట్రయల్ బ్లేజర్స్: స్మృతి మంధాన (కెప్టెన్), అలీసా హీలీ (వికెట్ కీపర్), సుజీ బెట్స్, దీప్తి శర్మ, బెత్ మూనీ, జెమీమా రోడ్రిగ్స్, డానియల్ హజెల్, శిఖా పాండే, లీ టహుహు, జులన్ గోస్వామి, ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్, హేమలత. ఐపీఎల్ సూపర్ నోవాస్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), డానియెల్లి వ్యాట్, మిథాలీ రాజ్, మెగ్ లానింగ్, సోఫీ డివైన్, ఎలైస్ పెర్రీ, వేద కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, పూజా వస్త్రాకర్, మెగన్ షుట్, రాజేశ్వరి గైక్వాడ్, అనూజ పాటిల్, తానియా భాటియా (వికెట్ కీపర్). -
సర్రే స్టార్స్ తరఫున హర్మన్‌ప్రీత్
న్యూఢిల్లీ: భారత మహిళల టి20 క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్... ఇంగ్లండ్‌లో జరిగే సూపర్ లీగ్ టి20 టోర్నమెంట్లో ఆడనుంది. ఆమె సర్రే స్టార్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్‌బాష్ లీగ్‌లో హర్మన్‌ప్రీత్ సిడ్నీ థండర్స్ జట్టుకు ఆడింది.