జైపూర్: అమ్మాయిల మెరుపులు మొదలయ్యాయి. అబ్బాయిలకు తీసిపోని విధంగా ఫైనల్ ఓవర్ ఉత్కంఠ పెంచింది. చివరకు ట్రయల్ బ్లేజర్స్ 2 పరుగుల తేడాతో గట్టెక్కింది. మహిళల టి20 చాలెంజ్‌లో సోమవారం జరిగిన పోరులో సూపర్ నోవాస్ ఆఖరిదాకా వచ్చి ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ట్రయల్ బ్లేజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (67 బంతుల్లో 90; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేసింది. రాధా యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన సూపర్‌నోవాస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 138 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 46 నాటౌట్; 8 ఫోర్లు) రాణించింది. ఎకల్‌స్టోన్ 2 వికెట్లు పడగొట్టింది. మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
మంధాన ఒక్కతే...
ట్రయల్ బ్లేజర్స్ ఓపెనర్ స్మృతి మంధాన ఇన్నింగ్స్ రెండో బంతి నుంచి ఆఖరి ఓవర్ రెండో బంతి దాకా బ్యాటింగ్ చేసింది. జట్టు స్కోరులో 65 శాతం పరుగులు చేసి మూల స్తంభంలా నిలిచింది. ఆమెతో పాటు బ్యాటింగ్‌కు దిగిన వారిలో హర్లీన్ డియోల్ (44 బంతుల్లో 36; 3 ఫోర్లు) మినహా ఇంకెవరూ 2 పరుగులను మించి చేయలేకపోయారు. అసాధారణ పోరాటం, కళ్లు చెదిరే షాట్లతో స్మృతి మంధాన ఒక్కతే బ్లేజర్స్ ఇన్నింగ్స్‌ను నడిపించింది.
హర్లీన్ అండతో ఆఖరి దాకా...
కెప్టెన్ మంధానతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సుజిబేట్స్ ఒక పరుగే చేసి అనూజా పాటిల్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. తర్వాత వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ హర్లీన్ జతకలిసింది. ఇద్దరు 17 ఓవర్లపాటు సూపర్‌నోవాస్ బౌలర్లకు చిక్క కుండా దొరకుండా విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో స్మృతి 47 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకుంది. 15వ ఓవర్లో ఫిఫ్టీ చేసుకున్న తర్వాత మంధాన ఒక్కసారిగా శివమెత్తింది. మరో 40 పరుగులు చేసేందుకు ఆమె కేవలం 20 బంతులే ఆడింది. ఆఖరిదాకా అండగా నిలిచిన హర్లీన్‌ను సోఫీ డివైన్ ఔట్ చేయడంతో 119 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. చివరి ఓవర్లో స్మృతి, దీప్తిశర్మ (0), స్టెఫానీ టేలర్ (2) ఔటయ్యారు.
రాణించిన హర్మన్‌ప్రీత్
లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన సూపర్‌నోవాస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ప్రియా పూనియా (2) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరింది. తర్వాత జయంగని (34 బంతుల్లో 26; 2 ఫోర్లు), జెమిమా రోడ్రిగ్స్ (19 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కాసేపు నడిపించారు. రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించాక జెమిమా రనౌట్ కావడంతో కష్టాలు మొదలయ్యాయి. స్వల్ప వ్యవధిలో జయంగని, సీవర్ (1) నిష్క్రమించడంతో ఒత్తిడి పెరిగింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ జట్టును గట్టెక్కించే బాధ్యత తీసుకున్నా... చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. డివైన్‌తో కలిసి ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించింది.
ఉత్కంఠ పెంచిన ఆఖరి ఓవర్
చివరి 12 బంతుల్లో సూపర్ నోవాస్ విజయానికి 21 పరుగులు అవసరమయ్యాయి. ఈ దశలో 19వ ఓవర్ వేసిన ఎకల్‌స్టోన్ రెండే పరుగులిచ్చి సోఫీ డివైన్ (22 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు)ను ఔట్ చేసింది. ఇక 6 బంతుల్లో 19 పరుగులు చేయాల్సివుండగా... సీనియర్ బౌలర్ జులన్ ఓవర్లో హర్మన్‌ప్రీత్ 4 బౌండరీలతో అదరగొట్టింది. చివరి బంతికి 3 పరుగులు అవసరం కాగా... లియా తహుహు రనౌట్ కావడంతో బ్లేజర్స్ ఊపిరిపీల్చుకుంది.
సూపర్ బ్లేజర్స్
Published Tue, May 7 2019 12:53 AM | Last Updated on Tue, May 7 2019 12:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment