చూస్తే చాలు ‘చెక్కే’స్తాడు
‘హోమ్‌వర్క్ చెయ్యని వాళ్లు చేతులెత్తండర్రా’...
మాస్టారు గద్దించారు. క్లాసులో ఒకే ఒక్కడు చెయ్యెత్తాడు. శిక్షగా మోకాళ్ల కుర్చీ వేయించారు. మాస్టారు పాఠం ప్రారంభించారు. అంతా శ్రద్ధగా వింటున్నారు. ఆ కుర్రాడు మాత్రం గోడపై దేశ నాయకుల చిత్రపటాల్ని చూస్తూనే ఉన్నాడు. ఇంటికెళ్లాక పెన్సిల్‌తో బాపూజీ, నెహ్రూ చిత్రాలను అద్భుతంగా గీయడం మొదలెట్టాడు. చెక్కపై చెక్కితే ఎలా ఉంటుందని ఆలోచించాడు. అనుకున్నదే తడవుగా చెక్కడం మొదలెట్టాడు.
చూడ‘చెక్క’ని కళాకారునిగా ఎదిగాడు. అపురూప చిత్రాలతో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. అతనే అనకాపల్లికి చెందిన వుడ్ కార్వింగ్ కళాకారుడు వల్లివిరెడ్డి శ్రీనివాసరావు.
అనకాపల్లిలోని నెహ్రూచౌక్ కూడలిలో ఒక సెల్‌ఫోన్ సర్వీసింగ్ కేంద్రం ఉంది. అక్కడికెళ్తే మూగనోము పట్టిన సెల్ఫోన్లను మాట్లాడించడంలో నిమగ్నమైన శ్రీనివాసరావు కనిపిస్తాడు. కాసేపయ్యాక సర్జికల్ బ్లేడు అందుకుంటాడు. కలపను సజీవ స్వరూపాలుగా తీర్చిదిద్దుతాడు. ఫొటో ఇస్తే అచ్చు గుద్దినట్టు చెక్కపై చిత్రాన్ని చెక్కుతాడు.
కలపతో 800 చిత్రాలు
లక్ష్మణరావు, మునెమ్మ దంపతుల ఎనిమిదో సంతానం శ్రీనివాసరావు. తండ్రి సమరయోధుడు. టెన్త వరకూ చదువుకున్న శ్రీనివాసరావు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత చదువులపై దృష్టి సారించలేకపోయాడు. సెల్ మెకానిక్‌గా జీవనోపాధి పొందుతూ ఉడ్ కార్వింగ్‌లో అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తున్నాడు. దేవతామూర్తులు, స్వాతంత్య్ర సమరయోధులు, ఆలయాల చిత్రాలను రూపొందించడంలో ప్రతిభావంతుడు.
సూక్ష్మ కళాఖండాల సృష్టికర్త
ఉడ్కార్వింగ్తో అద్భుతాలు సృష్టిస్తున్న శ్రీనివాసరావు పప్పులు, పంచదార పలుకులు, పసుపు కొమ్ముల్నీ వదలడు. అతని చేతుల్లో పంచదార పలుకు షిరిడి సాయిగా మారిపోతుంది. పసుపు కొమ్ము వినాయకుడిగా ఊపిరి పోసుకుంటుంది. గోధుమ గింజ శివలింగమై పూజలందుకుంటుంది. బియ్యం గింజ నందీశ్వరుడిగా రంకెలేస్తుంది. పసుపు కొమ్ములపై 108 రూపాల్లో వినాయకుడి రూపాన్ని చెక్కి ప్రశంసలు పొందాడు.
మోదీని కలవాలని...
ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఆయన తన తల్లితో మాట్లాడుతున్నట్టుండే చిత్రాన్ని చెక్కాడు. దాన్ని స్వయంగా మోదీకి అందజేయాలన్నది శ్రీనివాసరావు అభీష్టం. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ పర్యటన సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అమెరికా మంత్రి పెన్నీ ప్రిజ్కర్కు బహూకరించిన మోదీ-ఒబామాల జ్ఞాపిక శ్రీనివాసరావు చెక్కినదే.
వైఎస్, చంద్రబాబు, చిరంజీవి, కృష్ణ, మహేష్‌బాబు, అబ్దుల్‌కలాం తదితర ఎందరో ప్రముఖుల చిత్రాలు, బొమ్మలు, పక్షులు, జంతువుల రూపాలకు జీవం పోశాడు. ‘‘ఉడ్‌కార్వింగ్ చేసిన అల్లు రామలింగయ్య చిత్రాలను ఆయన కొడుకు అల్లు అరవింద్, సినీనటుడు చిరంజీవికి అందజేశాను. ఆ చిత్రాలను చూసి వారెంతో అభినందించారు’’ అని చెప్పాడు శ్రీనివాసరావు.
ఒక్కసారి చూస్తే చాలు...
‘‘ఫొటోలు, పెయింటింగులు ఎంతో కాలం ఉండవు. చెక్కతో చేసినవి చిరకాలం మన్నుతాయి. చెక్కిన తర్వాత పెయింటింగ్, పాలిషింగ్, ఫ్రేమ్ వర్క్ సక్రమంగా చేసేవరకూ ఆ ప్రక్రియ యజ్ఞంలా సాగుతుంది. అప్పుడే ఆ చిత్రానికి నిండుదనం వస్తుంది’’ అన్నాడు శ్రీనివాసరావు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా బుక్ ఆఫ్ స్టేట్ రివార్డ్స్ వారు ‘సృజనపుత్ర’ అవార్డును అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన సంఘమిత్ర సంస్థ ‘విజయపుత్ర’ అవార్డుతో సత్కరించింది. తాజాగా మార్వ్‌లెస్ గిన్నిస్, హైరేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డులను కూడా అందుకున్నాడు.
గిన్నిస్ బుక్‌లో చేరడమే లక్ష్యం
ఇప్పటి వరకూ కలపతో 800 చిత్రాలను చేశాను. వెయ్యి కళాఖండాలను రూపొందించి గిన్నిస్‌బుక్‌లో నమోదు కావాలన్నదే నా లక్ష్యం. చెక్కను చిత్రంగా మలచడానికి ఒక్కొక్కసారి నాలుగైదు రాత్రులపాటు నిద్ర ఉండదు. చిత్రం తయారయ్యాక అప్పటి వరకూ పడిన కష్టం మరచిపోతాను.
- వల్లివిరెడ్డి శ్రీనివాసరావు