Wooden Art artists
-
గిన్నిస్‌లో చూడ‘చెక్క’ని స్పూన్!
మండపేట: చెక్కతో అతిసూక్ష్మ స్పూన్ తయారు చేసి తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన సూక్ష్మ కళాకారుడు దొంతంశెట్టి బాలనాగేశ్వరరావు గిన్నిస్ రికార్డులోకెక్కారు. స్వర్ణకార పనిచేసే ఈయన చిన్న పరిమాణంలో కళాకృతులు తయారీ ద్వారా గతంలో అనేక రికార్డులను సొంతం చేసుకున్నారు. పంచదార పలుకు కంటే చిన్న పరిమాణంలో చెక్క స్పూన్ తయారీ ద్వారా గిన్నిస్ రికార్డును సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 10న మండపేట పశుసంవర్ధక శిక్షణ కేంద్రంలో ప్రభుత్వాధికారులు, గిన్నిస్ సంస్థ ప్రతినిధుల సమక్షంలో అతిసూక్ష్మ చెక్క స్పూన్‌ను తయారు చేశారు. 2 గంటల 13 నిమిషాల వ్యవధిలో 3.09 మిల్లీ మీటర్ల పరిమాణంలో దీన్ని తయారు చేశారు. గిన్నీస్ రికార్డు సంస్థ నుంచి వచ్చిన సర్టిఫికెట్, మెడల్‌ను మంగళవారం మండపేటలో వెటర్నరీ రిటైర్డ్ జేడీ డాక్టర్ విజయకుమారశర్మ, ఒంగోలుకు చెందిన çసృష్టి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ తిమ్మిరి రవీంద్ర, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చల్లా రవికుమార్, ఎస్ఆర్ అసోసియేషన్ అధినేత రాకుర్తి సత్యనారాయణ తదితరులు ఆవిష్కరించారు. -
వుడ్ ఎక్స్ప్రెషన్
చెక్కముక్కలే కాన్వాస్‌గా... ఉలే కుంచెగా అద్భుత కళారూపాలకు ప్రాణం పోశారు కళాకారులు. అమీర్‌పేట ‘ది ఆర్ట్ స్పేస్’లో గురువారం ప్రారంభమైన ‘వుడ్ కట్ ఆర్ట్ క్యాంప్’లో బహుచక్కని చిత్రాలు ఆవిష్కరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన పద్నాలుగు మంది వుడెన్ ఆర్ట్ కళాకారులంతా ఒక చోట చేరి నిర్వహించే ఈ వారం రోజుల వర్క్‌షాపులో మరెన్నో కళాకృతులు జీవం పోసుకుంటున్నాయి. మనసులోని ఊహా చిత్రాన్ని ఒక చెక్క పలక పై ప్రతిబింబింపజేయడమే వుడ్‌కట్ ఆర్ట్. కంబ కర్ర అనే ఒక విధమైన కలపను ఇందుకు ఉపయోగిస్తారు. మనసులో ఆలోచనకు చెక్కపై తగిన విధంగా రూపురేఖలు గీసి, ఆ తర్వాత దశల వారీగా పూర్తి చిత్రంగా రూపొందిస్తారు. ఈ దశల్లో ఒకసారి తప్పు జరిగినా మొత్తం చెక్క వేస్టవుతుంది. అందుకే ఒక్కోసారి ఒక కళారూపాన్ని తయారు చేయడానికే నెలలు పడుతుంది. బైబిల్‌ను ముద్రించేందుకు తొలుత వుడ్ కట్ ఆర్ట్‌ను ఉపయోగించిన ట్టు చెబుతారు. కానీ, ఈ విద్యను ప్రాచుర్యంలోకి తెచ్చింది మాత్రం జపనీయులే అంటారు ప్రముఖ వుడ్ కట్ ఆర్టిస్ట్, ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ టి.సుధాకర్‌రెడ్డి. 40 ఏళ్లుగా ఆయన ఈ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వర్సిటీలో వందల మందికి నేర్పించారు. ‘చెక్కపై భావోద్వేగాలను ప్రస్ఫుటం చేయడమే వుడ్ కట్ ఆర్ట్. దీన్నే ఎక్స్ప్రెషనిజం అంటాం. 18వ శతాబ్దంలో పేపర్ ప్రింటింగ్ వేగవంతం అయ్యాక అక్షరాలను ముద్రించేందుకు వుడ్ కట్ బ్లాక్స్‌ను వాడారు. దేశ ంలో 1970 వరకూ ఈ విధానం ఉండేది. జర్మన్లు చిన్న చిన్న సంకేతాలను చూపడం కోసం వుడ్ కట్‌ను ఉపయోగించారు. నేటికీ వాడుతున్నారు. భారత్‌లో మళ్లీ ఇప్పుడిప్పుడే ఈ కళపై యువతలో ఆసక్తి పెరుగుతోంది. అందరికంటే తెలుగు వారికే దీనిపై మక్కువ ఎక్కువ’ అని చెప్పారు వర్క్‌షాప్ నిర్వాహకులు, ఆర్టిస్ట్ భార్గవి గుండుల. సిటీలో నిర్వహించడం ఇదే తొలిసారన్నారు. - ఎస్.శ్రావణ్‌జయ