Wooden toy
-
Meeta Sharma: ఆటలు ఆడు కన్నా
చీప్ ప్లాస్టిక్. చైనా ప్లాస్టిక్. ఇవాళ పిల్లల బొమ్మలు వీటితోనే దొరుకుతున్నాయి. కళాత్మకమైన దేశీయమైన చెక్కతో తయారైన బొమ్మలు పిల్లలకు ఉండాలి అని బొమ్మల కేంద్రం ప్రారంభించింది మీతా శర్మ. హార్వర్డ్‌లో చదువుకున్నా తన ఇద్దరు పిల్లలు ఆడుతున్న బొమ్మలను చూశాక ఆమె ఈ పని మొదలెట్టింది. ఇవాళ నెలకు వెయ్యి అర్డర్లు వస్తున్నాయి. 100 మంది బొమ్మల కళాకారులు ఉపాధి పొందుతున్నారు. పిల్లలు ఆమె బొమ్మలతో చక్కగా ఆడుకుంటున్నారు. ఈసప్ కథల్లో ‘కాకి దప్పిక’ కథ పిల్లలందరికీ చెబుతారు. దప్పికగొన్న కాకి కుండలో నీళ్లను తాగడానికి ప్రయత్నించి, అవి అందకపోతే నాలుగు రాళ్లు జారవిడిచి, నీళ్లు పైకి తేలాక తాగుతుంది. ఆ విధంగా ఆ కథ అవసరం అయినప్పుడు యుక్తిని ఎలా పాటించాలో పిల్లలకు చెబుతుంది. ఈ కథ యూట్యూబ్‌లో వీడియో గా సులభంగా దొరుకుతుంది. కాని మీతా శర్మ తయారు చేసే బొమ్మల్లో ఇదే కథ మొత్తం బుజ్జి బుజ్జి చెక్క బొమ్మల సెట్టుగా దొరుకుతుంది. పిల్లలను ఉద్రేక పరిచే ఆటబొమ్మల కంటే ఇలాంటి బొమ్మలే అవసరం అంటుంది ‘షుమి’ అనే బొమ్మల సంస్థను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహిస్తున్న మీతా శర్మ. కంప్యూటర్ ఇంజనీర్ మీతా శర్మది ఢిల్లీ. అక్కడే ఐఐటీ లో బిటెక్ చేసింది. ఆ తర్వాత హార్వర్డ్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసింది. వివాహం అయ్యాక అమెరికాలోనే జీవితం మొదలెట్టింది. ‘మా పెద్దాడు పుట్టాక అమెరికాలో క్వాలిటీ బొమ్మలు కొనిచ్చాను ఆడుకోవడానికి. అవన్నీ ఎకో ఫ్రెండ్లీ కొయ్యబొమ్మలు. పాడు కావు. హాని చేయవు. 2012 లో అమెరికా వద్దనుకుని ఇండియా వచ్చాక నాకు సమస్య ఎదురైంది. అప్పటికి నా రెండో కొడుక్కి రెండేళ్లు. ఇక్కడ వాడికి ఇద్దామంటే మంచి బొమ్మలే లేవు. అన్నీ ప్లాస్టిక్‌వి లేదా గాడ్జెట్స్, అమెరికన్ కామిక్స్‌లో ఉన్న కేరెక్టర్... ఇవే ఉన్నాయి. ఆ ప్లాస్టిక్ పిల్లలు నోటిలో పెట్టుకుంటే ప్రమాదం. మన చిన్నప్పుడు చెక్కతో తయారు చేసిన బుజ్జి బుజ్జి బొమ్మలు ఎంతో బాగుండేవి. అలాంటి బొమ్మలకోసం ఎంత వెతికినా దొరకడం లేదు. కొన్నిచోట్ల సంప్రదాయ బొమ్మలు ఉన్నాయి కాని వాటి మార్కెటింగ్ సరిగా లేదు. అందుకని నాకే ఒక బొమ్మల తయారీ సంస్థ ఎందుకు మొదలెట్టకూడదు అనిపించింది. 2016లో షుమి సంస్థను స్థాపించాను’ అని తెలిపింది మీతా శర్మ. వేప, మామిడి కలపతో ‘నిజానికి సంస్థ స్థాపించడానికి పెట్టుబడి దొరకలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో అందరూ పిల్లల గేమ్స్ తయారు చేసే సంస్థలనే ప్రోత్సహించేవి. నా దారేమో సంప్రదాయ కలప బొమ్మల దారి. అందుకే సొంత పెట్టుబడితో సంస్థను స్థాపించాను. బొమ్మలు చేసే కళకారులను సంప్రదించి కేవలం వేప, మామిడి కలపతో ముద్దొచ్చే బొమ్మలను ముఖ్యంగా రెండేళ్ల వయసున్న పిల్లల కోసం ఎక్కువ గా ఆ తర్వాత పదేళ్ల లోపున్న పిల్లలకోసం బొమ్మలను తయారు చేయించాను. వాటికి ఉపయోగించే రంగులు కూడా రసాయనాలు లేనివే’ అంది మీతా శర్మ. ఢిల్లీలో తన సంస్థను స్థాపించాక రకరకాల కొయ్యగుర్రాలను, మూడు చక్రాల తోపుడు బండ్లను, బుజ్జి గుడారాలను, పిల్లలు ఆడే వంట సామగ్రిని, వారికి కొద్దిపాటి లెక్కలు నేర్పే ఆట వస్తువులను, కథలను బొమ్మల్లో చెప్పే సెట్లను ఇలా తయారు చేయించింది.‘ఆన్లైన్లో మాకు ఆర్డర్లు వచ్చేవి. చాలామంది తల్లులు ఆ బొమ్మలతో ఐడెంటిఫై అయ్యారు. ఎందుకంటే వారంతా బాల్యంలో అలాంటి బొమ్మలతోనే ఆడారు కనుక. తమ పిల్లలకు సరిగ్గా అలాంటివే దొరకడంతో వారి ఆనందానికి హద్దులు లేవు’ అని చెప్పిందామె. ఇప్పుడు మీతా తయారు చేయిస్తున్న బొమ్మలు అమెరికా, యు.కె, సింగపూర్‌కు కూడా రవాణా అవుతున్నాయి. నెలలో 8000 ఆన్లైన్ ఆర్డర్లు వస్తున్నాయి. 100 మంది కళాకారులు చేతినిండా పనితో ఉపాధి పొందుతున్నారు. ఆటే పరిశోధన ‘పిల్లల అసలైన పరిశోధన వారు ఆడే ఆటలతోనే మొదలవుతుందని పిల్లల మనస్తత్వ నిపుణులు తెలుపుతారు. పిల్లల్ని పిల్లల్లా ఉంచే ఆటబొమ్మలతో వారిని ఆడనివ్వాలి. హింసాత్మకమైన బొమ్మల నుంచి వారిని దూరం పెట్టాలి. హింసను ప్రేరేపించే గేమ్స్ నుంచి కూడా. పిల్లలు బొమ్మలతో స్నేహం చేసి వాటిని పక్కన పెట్టుకుని భయం లేకుండా నిద్రపోతారు. వారికి బాల్యం నుంచి అలాంటి నిశ్చింతనిచ్చే బొమ్మల వైపుకు నడిపించాలి’ అని సలహా ఇస్తోంది మీతా. ఒక ఉద్యోగిగా కంటే తల్లిగా ప్రయోజనాత్మక అంట్రప్రెన్యూర్‌గా ఆమె ఎక్కువ సంతృప్తిని, గౌరవాన్ని, ఆదాయాన్ని పొందుతోంది. అదీ విజయమేగా. -
కొయ్య బొమ్మకు కష్టకాలం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఖండాంతర వ్యాప్తి పొందిన నిర్మల్ కొయ్య బొమ్మను కష్టకాలం వీడడం లేదు. ఈ బొమ్మల తయారీకి అనువైన కలప లభించకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలోని కళాకారులకు క్రమంగా ఉపాధి కరువవుతోంది. బహిరంగ మార్కెట్లో ఈ కొయ్య బొమ్మలకు ఆదరణ పెరుగుతున్నప్పటికీ, వాటి తయారీకి అవసరమైన కలప అందుబాటులో లేకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. కనిపించని పొనికి వనాలు.. జిల్లాలోని ఇచ్చోడ, మామడ, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి అటవీ రేంజ్‌ల్లో ఒకప్పుడు ఈ బొమ్మల తయారీకి ఉపయోగపడే పొనికి చెట్టు విపరీతంగా ఉండేది. అటవీ శాఖ, ఆదివాసీ గిరిజనుల సహకారంతో నిపుణులైన కళాకారులు అటవీ ప్రాంతానికి వెళ్లి ఈ పొనికి చెట్లను సేకరించేవారు. వీటిని ఇచ్చోడ, ఖానాపూర్, జన్నారం వంటి అటవీ శాఖ కలప డిపోలకు తరలించి వేలం ద్వారా కొనుగోలు చేసేవారు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ కర్ర కొరత తీవ్రమైంది. గత కొన్ని నెలలుగా కలప డిపోల్లో ఈ కర్ర వేలానికి రాకపోవడంతో వీరికి ప్రధాన ముడిసరుకు దొరకక కళాకారులు ఉపాధి కోల్పోతున్నారు. అంతేకాకుండా చింత గింజల పొడి కూడా ఈ బొమ్మల తయారీకి అవసరం ఉంటుంది. అవి కూడా లభించడం లేదు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో గత కొంత కాలంగా ఈ పొనికి చెట్ల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. ఉన్న చెట్లను తీసుకొచ్చేందుకు అటవీ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రధాన ముడిసరుకు లేక బొమ్మల తయారీ నిలిచిపోతోంది. ముఖ్యంగా కర్ర అధికంగా అవసరమయ్యే ఏనుగు, పులి, వంటి పెద్ద బొమ్మల తయారీకి కర్ర దొరకడం లేదు. నిర్మల్‌లోని సుమారు 40 కుటుంబాల్లోని కళాకారులు సహకార సంఘంగా ఏర్పడి వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కళాకారులు తయారు చేసిన బొమ్మలు విక్రయించిన మొత్తంలో నుంచి 85 శాతం మొత్తాన్ని కార్మికులకు చెల్లిస్తారు. మిగిలిన 15 శాతం మొత్తాన్ని షోరూం, వర్క్‌షాప్ నిర్వహణ, ఇతర ఖర్చులకు వినియోగిస్తారు. నెలకు సుమారు రూ. 3 లక్షల టర్నోవర్ అవుతోందని షోరూం నిర్వాహకులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ఆదరణ.. నిర్మల్ కొయ్యబొమ్మలకు దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఆదరణ ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, దుబాయ్, స్వీడన్, మలేషియా, దుబాయ్ వంటి దేశాలకు ఈ బొమ్మలు ఎగుమతి అవుతాయి. హైదరాబాద్, ముంబై, చెన్నై, కలకత్తా, బెంగుళూరు వంటి నగరాల్లో వీటికి ఆదరణ ఉంది. ఆన్లైన్ సంస్థ అమెజాన్‌తో ఒప్పందం.. నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సంఘం వారి ఉత్పత్తులను గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ సంస్థ కొనుగోలు చేస్తుంది. ఆన్లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్‌తో ఈ కార్పొరేషన్ నెల రోజుల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నిర్మల్ కొయ్యబొమ్మలు ఆన్లైన్లో విక్రయించేందుకు వీలు కుదిరింది. అయితే ఇంకా విక్రయాలు ప్రారంభం కాలేదు. పొనికి వనాలకు శ్రీకారమెప్పుడు.. నిర్మల్ కొయ్యబొమ్మల కళాకారులను ఆదుకునేందుకు వారికి అవసరమైన పొనికి చెట్ల పెంపకానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ప్రకటించింది. అయితే దాదాపు రెండేళ్లు దగ్గర పడుతున్నప్పటికీ అటవీ శాఖ ఈ చెట్ల పెంపకం ఊసే ఎత్తడం లేదు. హరితహారం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం అమలు కోసం ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి వివిధ రకాల మొక్కలను పెంచుతోంది. ఇందులో పొనికి చెట్ల పెంపకం కూడా ఉంటే రానున్న రోజుల్లో పొనికి కర్ర కొరతను అధిగమించవచ్చనే అభిప్రాయం కళాకారుల నుంచి వ్యక్తమవుతోంది. ‘‘బొమ్మలకు అనువైన కర్ర కావాలంటే కనీసం 15 ఏళ్లు చెట్లు పెరగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్ల పెంపకానికి శ్రీకారం చుడితేనే రానున్న తరాలకు ఈ కళ కొనసాగుతుంది. కానీ అటవీశాఖ ఈ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టడం లేదు. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది’’ అని నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సహకార సంఘం మేనేజర్ శంకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.