కొయ్య బొమ్మకు కష్టకాలం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఖండాంతర వ్యాప్తి పొందిన నిర్మల్ కొయ్య బొమ్మను కష్టకాలం వీడడం లేదు. ఈ బొమ్మల తయారీకి అనువైన కలప లభించకపోవడంతో ఆదిలాబాద్ జిల్లాలోని కళాకారులకు క్రమంగా ఉపాధి కరువవుతోంది. బహిరంగ మార్కెట్‌లో ఈ కొయ్య బొమ్మలకు ఆదరణ పెరుగుతున్నప్పటికీ, వాటి తయారీకి అవసరమైన కలప అందుబాటులో లేకపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
కనిపించని పొనికి వనాలు..
జిల్లాలోని ఇచ్చోడ, మామడ, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి అటవీ రేంజ్‌ల్లో ఒకప్పుడు ఈ బొమ్మల తయారీకి ఉపయోగపడే పొనికి చెట్టు విపరీతంగా ఉండేది. అటవీ శాఖ, ఆదివాసీ గిరిజనుల సహకారంతో నిపుణులైన కళాకారులు అటవీ ప్రాంతానికి వెళ్లి ఈ పొనికి చెట్లను సేకరించేవారు. వీటిని ఇచ్చోడ, ఖానాపూర్, జన్నారం వంటి అటవీ శాఖ కలప డిపోలకు తరలించి వేలం ద్వారా కొనుగోలు చేసేవారు. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ కర్ర కొరత తీవ్రమైంది. గత కొన్ని నెలలుగా కలప డిపోల్లో ఈ కర్ర వేలానికి రాకపోవడంతో వీరికి ప్రధాన ముడిసరుకు దొరకక కళాకారులు ఉపాధి కోల్పోతున్నారు.
అంతేకాకుండా చింత గింజల పొడి కూడా ఈ బొమ్మల తయారీకి అవసరం ఉంటుంది. అవి కూడా లభించడం లేదు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో గత కొంత కాలంగా ఈ పొనికి చెట్ల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. ఉన్న చెట్లను తీసుకొచ్చేందుకు అటవీ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రధాన ముడిసరుకు లేక బొమ్మల తయారీ నిలిచిపోతోంది. ముఖ్యంగా కర్ర అధికంగా అవసరమయ్యే ఏనుగు, పులి, వంటి పెద్ద బొమ్మల తయారీకి కర్ర దొరకడం లేదు. నిర్మల్‌లోని సుమారు 40 కుటుంబాల్లోని కళాకారులు సహకార సంఘంగా ఏర్పడి వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. ఈ కళాకారులు తయారు చేసిన బొమ్మలు విక్రయించిన మొత్తంలో నుంచి 85 శాతం మొత్తాన్ని కార్మికులకు చెల్లిస్తారు. మిగిలిన 15 శాతం మొత్తాన్ని షోరూం, వర్క్‌షాప్ నిర్వహణ, ఇతర ఖర్చులకు వినియోగిస్తారు. నెలకు సుమారు రూ. 3 లక్షల టర్నోవర్ అవుతోందని షోరూం నిర్వాహకులు పేర్కొంటున్నారు.
అంతర్జాతీయ ఆదరణ..
నిర్మల్ కొయ్యబొమ్మలకు దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఆదరణ ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, దుబాయ్, స్వీడన్, మలేషియా, దుబాయ్ వంటి దేశాలకు ఈ బొమ్మలు ఎగుమతి అవుతాయి. హైదరాబాద్, ముంబై, చెన్నై, కలకత్తా, బెంగుళూరు వంటి నగరాల్లో వీటికి ఆదరణ ఉంది.
ఆన్‌లైన్ సంస్థ అమెజాన్‌తో ఒప్పందం..
నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సంఘం వారి ఉత్పత్తులను గోల్కొండ హ్యాండీక్రాఫ్ట్స్ సంస్థ కొనుగోలు చేస్తుంది. ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్‌తో ఈ కార్పొరేషన్ నెల రోజుల క్రితం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నిర్మల్ కొయ్యబొమ్మలు ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు వీలు కుదిరింది. అయితే ఇంకా విక్రయాలు ప్రారంభం కాలేదు.
పొనికి వనాలకు శ్రీకారమెప్పుడు..
నిర్మల్ కొయ్యబొమ్మల కళాకారులను ఆదుకునేందుకు వారికి అవసరమైన పొనికి చెట్ల పెంపకానికి శ్రీకారం చుడతామని ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం ప్రకటించింది. అయితే దాదాపు రెండేళ్లు దగ్గర పడుతున్నప్పటికీ అటవీ శాఖ ఈ చెట్ల పెంపకం ఊసే ఎత్తడం లేదు. హరితహారం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం అమలు కోసం ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి వివిధ రకాల మొక్కలను పెంచుతోంది. ఇందులో పొనికి చెట్ల పెంపకం కూడా ఉంటే రానున్న రోజుల్లో పొనికి కర్ర కొరతను అధిగమించవచ్చనే అభిప్రాయం కళాకారుల నుంచి వ్యక్తమవుతోంది. ‘‘బొమ్మలకు అనువైన కర్ర కావాలంటే కనీసం 15 ఏళ్లు చెట్లు పెరగాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ చెట్ల పెంపకానికి శ్రీకారం చుడితేనే రానున్న తరాలకు ఈ కళ కొనసాగుతుంది. కానీ అటవీశాఖ ఈ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టడం లేదు. పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది’’ అని నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సహకార సంఘం మేనేజర్ శంకర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.