కరువు నిధులు మంజూరు చేయూలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మల్లేశ్
తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
బెల్లంపల్లి : తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్న జిల్లాను ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించి, యుద్ధ ప్రాతిపదికన కరువు సహాయ నిధులు రూ.200 కోట్లు మంజూరు చేయూలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక గ్రామాల్లో పంటలు పండక, చెరువు, కుంటల్లో నీళ్లు లేక సాగు, తాగునీటి సమస్య ఏర్పడిందని అన్నారు.
ప్రజలకు తిండిగింజల సమస్య ఏర్పడగా, మూగజీవాలకు మేత దొరకని దుస్థితి నెలకొందని తెలిపారు. ఉపాధి హామీ పనులను ముమ్మరం చేయాలని, ఒక్కో కూలీకి రూ.300 చొప్పున వేతనం చెల్లించాలని పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ కె.శ్యామలదేవికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శి డి.సత్యానారాయణ, కోశాధికారి మంతెన మల్లేశ్, బెల్లంపల్లి మండల కార్యదర్శి బి.లక్ష్మీనారాయణ, సీపీఐ జిల్లా సీనియర్ నాయకుడు సిహెచ్.నర్సయ్య, ఎం.వెంకటస్వామి, మున్సిపల్ కౌన్సిలర్లు తాళ్లపల్లి లక్ష్మీ, బొల్లం పూర్ణిమ, నాయకులు జి.చంద్రమాణిక్యం, ఎం.శంకర్, తాళ్లపల్లి మల్లయ్య, జి.సరోజ, తిరుపతిగౌడ్, వి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.